మామిడికి ఇదే అదను | good season for mango crop cultivation | Sakshi
Sakshi News home page

మామిడికి ఇదే అదను

Published Mon, Sep 15 2014 12:25 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 PM

మామిడికి ఇదే అదను

మామిడికి ఇదే అదను

 సాగుకు ప్రోత్సాహం
  మామిడి సాగులో ఒక్కో మొక్కకు రోజుకు 50 పైసల చొప్పున నెలకు రూ.15 ఇస్తారు.
  ఎకరంలోని 70 మొక్కలకు నెలకు రూ.1,050 చొప్పున మూడేళ్ల పాటు సంవత్సరానికి రూ.12,600 అందజేస్తారు.

  ఆ తరువాత తోట కాపునకు వచ్చి ఏడాదికి రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు ఆదాయం వస్తుందని సీటీఏ తెలిపారు.

  చెట్లు పెరిగినా కొద్ది కాత అధికమై ఆదాయం పెరుగుతుందన్నారు.

 ఎవరు అర్హులు..?
  జిల్లాలో ఎన్‌ఆర్‌ఈజీఎస్, ఇందిరజలప్రభ పథకాల కింద పండ్ల తోటలను సాగు చేయాలనుకునే వారికి ఉపాధి హామీ జాబ్ కార్డు ఉండాలి.  
  పట్టాదారు పాసుపుస్తకం కలిగి ఉండాలి.
  5 ఎకరాలకు మించి భూమి ఉండకూడదు.
 మెట్ట భూముల్లో, నీటి వసతి గల బోర్ల వద్ద మొక్కలు పెట్టుకోవచ్చు.
  ఉపాధి హామీ,ఉద్యానవన శాఖ నుంచి ఎటువంటిలబ్ధిపొందని వారు మాత్రమే అర్హులు.
 తోటలు పెట్టే ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం సబ్సిడీపై, ఇతరులకు తొంభై శాతం రాయితీపై డ్రిప్ సౌకర్యం అందిస్తారు.
 
నేల తయారీ...
  నీరు నిలవని సారవంతమైన నేలలు మామిడికి సాగుకు అనుకూలం.
  చౌడు నేలలు పనికిరావు.
  భూమిని రెండు మూడు సార్లు బాగా కలియదున్నాలి.
  మొక్కలు నాటడానికి 3,4 వారాల ముందే మూడు ఫీట్ల లోతు, వెడల్పుతో 7.5మీటర్ల విడిది ఉండేలా గుంతలను తవ్వాలి.
  మొక్కలు నాటేముందు ఒక్కో గుంతలో 50 కేజీల ఎండిన పశువుల ఎరువు, చెదలు పట్టకుండా 2 కేజీల సింగిల్ సూపర్ పాస్పేట్, 100 గ్రాముల పారిడీల్‌పొడిని మట్టిలో కలిపి మొక్కను పాతుకోవాలి.
  ఎకరాకు 70 మొక్కలను నాటాలి.
 
ఈ రకాలు మేలు
  జిల్లాలో ఎక్కువగా మల్లిక రకం మొక్కలను సాగుచేస్తున్నారు.
  అక్కడక్కడ బేనిషాన్, ఖాదిరి, దసిరి రకాల తోటలు కూడా నాటుతున్నారు.  
  మేలైన రకాల కోసం ఉద్యానవనశాఖ అధికారులను సంప్రదిస్తే మేలు.
 
సూక్ష్మపోషక లోపాల నివారణకు
 మొక్కల ఎదుగు దశలో సూక్ష్మపోషక లోపాల నివారణకు ఏడాదికి 2-3 సార్లు జూన్, జూలై, సెప్టెంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో లేదా మొక్కలు కొత్తచిగుళ్లు తొడుగుతున్న దశలో లీటరు నీటిలో 3-5 గ్రాముల మల్టీప్లెక్స్ మందును కలిపి 2-3 సార్లు మొక్కలపై పిచికారీ చేయాలి.
 
నీటి యాజమాన్యం  
 మొక్కలు నాటిన వెంటనే ఒకటిన్నర పాదువేసి నీరు ఇవ్వాలి.
 వర్షాలు లేకుంటే 6 నెలల వరకు క్రమం తప్పకుండా 3-4 రోజులకోసారి నీరు పెట్టాలి.
 2-3 సంవత్సరాల వరకు మొక్కను భద్రంగా కాపాడాలి. డ్రిప్పు ద్వార నీరు ఇచ్చినప్పుడు కాలాన్ని బట్టి రోజుకు 8-13 లీటర్ల మేర నీరందేలా చూడాలి.
 
కత్తిరింపులు
మొక్కలు నాటిన మొదటి సంవత్సరం మొక్క కాండం మీద 50 సెంటీమీటర్ల వరకు ఎటువ ంటి కొమ్మలు రాకుండా తగు జాగ్రతలు తీసుకోవాలి.
మొక్క 60-90 సెంటీమీటర్ల ఎత్తు పెరిగిన తర్వాత ప్రధాన కాండం చివరను కత్తిరించి 2-3 బలమైన కొమ్మలను ఎంచుకుని పెరగనివ్వాలి. మిగిలిన వాటిని కత్తిరించాలి.
పక్క కొమ్మలు 80-90 సెంటీమీటర్లు పెరిగాక రెండోసారి కత్తిరించి రెండో దశలోనూ బలంగా ఉన్న రెండుమూడు కొమ్మలను ఉంచాలి.
మూడో దశలోనూ కొమ్మలను కత్తిరించి చెట్లు గొడుగు ఆకారంలో పెరిగేలా చర్యలు తీసుకోవాలి.
 
అంతర పంటలతో అదనపు ఆదాయం  
 మామిడిలో అంతర పంటలను సాగు చేసుకుని అదనపు ఆదాయం పొందవచ్చు. తీగ జాతికి చెందిన కాకర, బీర, సోర, దోస, ఉల్లి, బీన్స్, క్యాజేజీతోపాటు పప్పు దినుసులైన పెసర, మినుమును అంతర పంటలు గా సాగు చేసుకోవచ్చు. శమ్నాపూర్‌కు చెందిన మహిళా రైతు భాగమ్మ తనకున్న మూడెకరాల్లో మామిడి తోట సాగు చేసింది. దీనిలో అంతర పంట లుగా కాకర, దోస, బీర పండిస్తోంది. దీని కోసం రూ.20వేల పెట్టుబడి అవుతోందని తెలిపింది. ఇవిపోనూ తనకు ఏటా రూ.40 వేల వరకు ఆదాయం వస్తోందని చెప్పింది. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement