Indira Jala Prabha scheme
-
జలప్రభకు బ్రేక్..
మెదక్ : ఇందిర జలప్రభ వెలుగులు ఆగిపోయాయి. టీఆర్ఎస్ సర్కార్ రాగానే ఈ పథకాన్ని నిలిపివేయడంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇదే పథకం కింద కొంత మంది వ్యవసాయం చేస్తుండగా, తమ పొలాలు బీడుగానే ఉండిపోయాయంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూముల్లో బోర్లు తవ్వించి బోరు మోటార్‌తోపాటు కరెంట్ లైన్ వేసి వాటిని సాగుకు యోగ్యంగా మార్చాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఇందిర జలప్రభ పేరుతో ప్రత్యేకంగా ఓ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి పదెకరాల భూములను గుర్తించి అందులో ఎంతమంది రైతులున్నా వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం బోరు తవ్వించడంతోపాటు పంపుసెట్లు అమర్చింది. విద్యుత్ లైన్ లాగి వారికి అప్పగించింది. దీంతో ఎంతోమంది నిరుపేద ఎస్సీ, ఎస్టీలు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆరు నెలల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇందిర జలప్రభ పథకాన్ని తొలగించి, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌కు అనుసంధానం చేసింది. వీరి పరిస్థితేంటి? జలప్రభ స్కీమ్‌ను నిలిపివేయడంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే కొంతమంది భూముల్లో బోరు బావులు తవ్వి, పంపుసెట్లు అమర్చకుండా, కరెంట్ లైన్ వేయకుండా వదిలేశారు. తాము వ్యవసాయం చేసుకుందామంటే అర్ధంతరంగా బోర్లు తవ్వి వదిలేశారని, దీంతో తమ భూములు బీళ్లుగానే ఉండిపోతున్నాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిర జల ప్రభ పథకాన్ని ప్రవేశ పెట్టి నాబార్డు నిధులను మళ్లించి జిల్లాలో అనేక మంది ఎస్సీ, ఎస్టీ రైతుల అభివృద్ధికి కృషి చేసింది. కాగా ఇందుకు సంబంధించి కొంతమందికి బోరు మోటార్లు అందించగా, మరికొంతమందికి పొలాల్లో బోర్లు వేసి వదిలేశారు. నాలుగేళ్లలో ఇలా... జిల్లాలో గడిచిన నాలుగేళ్లలో సుమారు 4,560 బోరు బావులు తవ్వించగా, అందులో 2,200 బోరుబావుల్లో పంపుసెట్లు బిగించారు. ఇందుకుగాను 1,500పై చిలుకు ఎస్సీ, ఎస్టీ రైతులు లబ్ధిపొందినట్లు అధికారులు పేర్కొన్నారు. మరో 1,500 పైచిలుకు మిగిలిన పనులను అలాగే వదిలేయడంతో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తమ పొలాల్లో మోటార్లు బిగించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. -
ఆశలపై నీళ్లు
ఇందిర జలప్రభకు గ్రహణం * నిధులున్నా ముందుకు సాగని పనులు * జిల్లాలో సాగు లక్ష్యం 85 వేల ఎకరాలు * మూడేళ్లయినా 2,500 ఎకరాలకే మోక్షం * విద్యుత్ కనెక్షన్లకు రాని అనుమతులు * రైతుల ఆశలపై నీళ్లు చల్లిన ప్రభుత్వం సాక్షి, ఖమ్మం : ఎస్సీ, ఎస్టీ రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రవేశపెట్టిన ఇందిర జలప్రభ పథకం జిల్లాలో అడుగు ముందుకు కదలడం లేదు. పథకం ప్రారంభించి మూడేళ్లయినా ఇప్పటివరకు కేవలం 2500 ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చినట్లు సంబంధిత అధికారులు కాగితాల్లో చూపుతున్నారు. జిల్లాలో 85 వేల ఎకరాల బీడు భూములను సాగులోకి తేవాలన్నది ఈ పథకం లక్ష్యం. నిధులు పుష్కలంగా ఉన్నా పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు చెందిన వేలాది ఎకరాల బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు గత ప్రభుత్వం ‘ఇందిర జలప్రభ’ ప్రాజెక్టును రూపొందించింది. ఈ ప్రాజెక్టు అమలుకు మొత్తం రూ.196.5 కోట్లుమంజూరు చేసింది. ఇందులో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్ఆర్ఈజీఎస్) కింద రూ.124 కోట్లు, నాబార్డు ద్వారా రూ.72 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు అమలు కోసం ఎస్సీ, ఎస్టీలకు చెందిన 85 వేల ఎకరాలు గుర్తించారు. ఒక్కో బ్లాకులో 10 నుంచి 200 ఎకరాల వరకు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ యోచన. ఎకరానికి రూ.16 వేల చొప్పున పది ఎకరాలకు రూ.1.60 లక్షలు ఖర్చు చేస్తారు. ప్రధానంగా సాగును దృష్టిలో పెట్టుకొని పది ఎకరాలకు సరిపడా నీరందేలా బోరు వేయిస్తారు. విద్యుత్ సౌకర్యం, మోటార్ పంపు, పైపులు అన్నీ ఉచితంగానే రైతులకు అందజేయాలి. విద్యుత్ సౌకర్యం అందుబాటులో లేని భూములకు డీజిల్ ఇంజన్లు సరఫరా చేయాలి. అవసరమైన భూముల్లో జలవనరులను అభివృద్ధి చేసేందుకు చెక్ డ్యామ్‌లు, రాక్ పిల్ డ్యామ్‌లు, చెక్ వాల్స్ నిర్మించాలి. ఈ ప్రాజెక్టు అమలుతో జిల్లాలో 30,500 మంది ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్రయోజనం కలగాలి. ఎక్కువగా ఏజెన్సీ మండలాల్లోని రైతులకు ప్రాధాన్యత ఇచ్చారు. అంచనాలు తారుమారు.. ఈ పథకం కింద జిల్లా వ్యాప్తంగా 2,879 బ్లాకులను గుర్తించారు. ఇందులో 1,770 బ్లాకులు సర్వే చేయ గా బోర్లు వేయడానికి 778 బ్లాకులు అనుకూలమని గుర్తించారు. సర్వే చేసిన బ్లాకులకు సంబంధించి ఇప్పటివరకు జిల్లాకు 1,846 బోర్లు మంజూరయ్యా యి. ఎంపిక చేసిన బ్లాకుల్లో 1,078 బోర్లు డ్రిల్ చేస్తే 78 ఫెయిలయ్యాయి. అధికారుల పర్యవేక్షణ లోపం, జియాలజిస్టులు సరిగా అంచనా వేయకపోవడంతో ఈ బోర్లు ఫెయిల్ అయ్యాయని రైతులు ఆరోపిస్తున్నారు. వీటి కోసం సుమారు రూ. 50 లక్షలు వృథా అయ్యాయి. మిగిలిన బోర్లలోనూ నీరు అంతంత మాత్రమే. మరికొన్ని బోర్లలో నీరున్నా నేటికీ విద్యు త్ సౌకర్యం కల్పించలేదు. భూగర్భ, జలవనరుల శాఖ అధికారులు సర్వే చేయించి ఎక్కడ భూగర్భ జలం ఉందో అక్కడే బోర్లు వేయించాలి. కానీ అధికారులు ఇష్టానుసారంగా సర్వే చేయించడంతో బోర్లు ఫెయిలయ్యాయి. దీంతో తమ భూముల్లో సిరులు పండిస్తామని భావించిన ఎస్సీ, ఎస్టీ రైతులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. సా...గుతున్న పనులు.. జిల్లాకు రూ.196.5 కోట్లు మంజూరైతే ఈ మూడేళ్లలో ఖర్చు చేసింది కేవలం రూ.10.94 కోట్లే. 920 బోర్లకు విద్యుత్ సౌకర్యం అవసరం కాగా ఇప్పటి వరకు 743 బోర్లకు మాత్రమే అనుమతి వచ్చింది. ఇంకా 177 బోర్లకు విద్యుత్ అనుమతి కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే అనుమతి వచ్చిన చోటా మోటర్లను బిగించడం, పైపులై ను, విద్యుత్ స్తంభాల పనులు నత్తనడకన సాగుతుండడంతో రైతులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వ సహకారంతో భూములు సాగు చేసుకుందామనుకున్న రైతుల కలలు కల్లలయ్యాయి. ప్రధానంగా అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పనులు ముందుకు సాగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మోడల్ బ్లాక్‌లోనూ కనిపించని సాగు.. 2011 నవంబర్ 24న అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చండ్రుగొండ మండలం కొండాయిగూడెంలో జలప్రభ పథకానికి శంకుస్థాపన చేశారు. గ్రామంలోని 91 ఎకరాలను బ్లాకుగా తీసుకున్నారు. ఇందులో తొలుత 50 ఎకరాలకు సంబంధించి 4 బోర్లు వేశారు. ఆశించినంత నీరు లేకున్నా అక్కడ జిల్లా యంత్రాంగం సీఎంతో హడావిడిగా శంకుస్థాపన చేయించింది. ఈ బ్లాకులో 20 ఎకరాల వరకు అప్పట్లో మామిడి, ఆరటి, మిర్చి, జామాయిల్ సాగు చేశారు. బోర్లలో నీరు, విద్యుత్ సరఫరా, బ్లాక్ చుట్టూ ఫెన్సింగ్ లేకపోవడంతో సాగుచేసిన పంటల న్నీ నెలరోజులకే ఎండిపోయాయి. ప్రస్తుతం నాలుగు బోర్లకు గాను మూడింటిలో నీరు లేదు. మిగిలిన ఒక్కదాంట్లోనూ బొటాబొటిగానే ఉన్నా యి. ఈ పరిస్థితితో మోడల్ బ్లాక్‌గా తీసుకున్న ఈ భూమి కూడా బీడుగానే మిగిలింది. -
నిధుల వినియోగంలో విఫలం
నీలగిరి :ఇందిర జలప్రభ, మెగావాటర్ షెడ్ నిధులు వినియోగించుకోవడంలో ప్రభుత్వ శాఖలు పూర్తిగా విఫలమవుతున్నాయని జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలూనాయక్ విచారం వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉదయం 11. 30 గంటలకు 2 వ గ్రామీణాభివృద్ధి స్థాయీ సంఘం, మధ్యాహ్నం 3 గంటలకు 4వ విద్య ,వైద్య స్థాయీ సంఘం కమిటీ సమావేశాలు నిర్వహించారు. జెడ్పీ చైర్మన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు శాఖల్లో అమలవుతున్న ప్రభుత్వ పథకాల అమలుతీరును ఆయన స మీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వాటర్ షెడ్ నిధులు కోట్ల రూపాయ లు మూలుగుతున్నా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో సంబంధిత శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. దీంతో పాటు నిరుపేద ఎస్సీ, ఎస్టీ భూమల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన ఇందిరజలప్రభ పథకం లక్ష్యం నీరుగారిపోయిందన్నారు. ఇందిరజలప్రభ అమలు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన చైర్మన్ విద్యుత్ శాఖ పై ఒత్తిడి పెంచి కనెక్షన్లు ఇప్పించే దిశగా ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు. పలు దఫాలుగా విద్యు త్ శాఖ అధికారులతో సమావేశాలు నిర్వహించామని..వారి పనితీరులో మార్పురానట్లయితే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇక మెగావాటర్ షెడ్ నిధులతో వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, గ్రామీణాభివృద్ధి శా ఖ, పట్టు పరిశ్రమ, మత్స్య శాఖలకు రూ.21 కోట్లు కేటాయించామని పీడీ తెలిపారు. దీంట్లో ఆయా శాఖలు కేవలం కోటి రూపాయలు మాత్రమే వినియోగించాయని చెప్పా రు. దీని పై చైర్మన్ జోక్యం చేసుకుని సంబంధిత శాఖల అధికారులను ప్రశ్నించారు. నిధు ల వినియోగానికి సంబంధించి అధికారులు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. మరుగుదొడ్ల నిధుల విడుదలో జాప్యం జరుగుతోందని సభ్యులు ఫిర్యాదు చేశారు. దీని పై డ్వామా పీడీ మాట్లాడుతూ...వివిధ కారణాల దృష్ట్యా మూడు మాసాల పాటు నిధు లు నిలిచిపోయాయని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. అయితే ఇంది రమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన మరుగుదొడ్లకు, పూర్తయిన పనులకు మాత్రం డ్వామా నుంచి చెల్లింపులు చేయడం వీలుకాదని సభ్యు లు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. జిల్లాలో ఈ ఏడాది లక్ష మరుగుదొడ్లు పూర్తిచేయాలన్న లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. దీనిపై జెడ్పీ సీఈఓ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు గ్రామాలను దత్తత తీసుకుని మరుగుదొడ్లు పూర్తి చేసేందుకు సహరించాలన్నారు. పాఠశాలల సమస్యలుపరిష్కరించాలి ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, వంటగదుల నిర్మాణపనులు పూర్తి చేసేం దుకు చర్యలు తీసుకోవాలని చైర్మన్ అధికారులను ఆదేశించారు. బీఆర్‌జీఎఫ్‌ను వంటగదులకు కేటాయించినందున త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. సాక్షర భారత్ కోఆర్డినేటర్ల జీతాల విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు అందజేయాలని డీడీకి సూచించారు. ఈ సమస్యను ఎంపీ దృష్టికి తీసుకెళతామని చైర్మన్ హామీ ఇచ్చారు. చౌటుప్పుల్ పరిసర ప్రాంతాల్లో తాగునీరు కలుషితవుతోందని సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని వాతావరణ కాలుష్య నియంత్రణ అధికారులను చైర్మన్ ఆదేశించారు. దీంతో పాటు వైద్య, ఎక్సైజ్ శా ఖల పై కూడా చైర్మన్ సమీక్షించారు. అధికారులు పరస్పర సమన్వయంతో ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్లాలని చైర్మన్ సూచించారు. ఈ సమావేశానికి అధికారులు హాజరయ్యారు. -
మామిడికి ఇదే అదను
సాగుకు ప్రోత్సాహం మామిడి సాగులో ఒక్కో మొక్కకు రోజుకు 50 పైసల చొప్పున నెలకు రూ.15 ఇస్తారు. ఎకరంలోని 70 మొక్కలకు నెలకు రూ.1,050 చొప్పున మూడేళ్ల పాటు సంవత్సరానికి రూ.12,600 అందజేస్తారు. ఆ తరువాత తోట కాపునకు వచ్చి ఏడాదికి రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు ఆదాయం వస్తుందని సీటీఏ తెలిపారు. చెట్లు పెరిగినా కొద్ది కాత అధికమై ఆదాయం పెరుగుతుందన్నారు. ఎవరు అర్హులు..? జిల్లాలో ఎన్ఆర్ఈజీఎస్, ఇందిరజలప్రభ పథకాల కింద పండ్ల తోటలను సాగు చేయాలనుకునే వారికి ఉపాధి హామీ జాబ్ కార్డు ఉండాలి. పట్టాదారు పాసుపుస్తకం కలిగి ఉండాలి. 5 ఎకరాలకు మించి భూమి ఉండకూడదు. మెట్ట భూముల్లో, నీటి వసతి గల బోర్ల వద్ద మొక్కలు పెట్టుకోవచ్చు. ఉపాధి హామీ,ఉద్యానవన శాఖ నుంచి ఎటువంటిలబ్ధిపొందని వారు మాత్రమే అర్హులు. తోటలు పెట్టే ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం సబ్సిడీపై, ఇతరులకు తొంభై శాతం రాయితీపై డ్రిప్ సౌకర్యం అందిస్తారు. నేల తయారీ... నీరు నిలవని సారవంతమైన నేలలు మామిడికి సాగుకు అనుకూలం. చౌడు నేలలు పనికిరావు. భూమిని రెండు మూడు సార్లు బాగా కలియదున్నాలి. మొక్కలు నాటడానికి 3,4 వారాల ముందే మూడు ఫీట్ల లోతు, వెడల్పుతో 7.5మీటర్ల విడిది ఉండేలా గుంతలను తవ్వాలి. మొక్కలు నాటేముందు ఒక్కో గుంతలో 50 కేజీల ఎండిన పశువుల ఎరువు, చెదలు పట్టకుండా 2 కేజీల సింగిల్ సూపర్ పాస్పేట్, 100 గ్రాముల పారిడీల్పొడిని మట్టిలో కలిపి మొక్కను పాతుకోవాలి. ఎకరాకు 70 మొక్కలను నాటాలి. ఈ రకాలు మేలు జిల్లాలో ఎక్కువగా మల్లిక రకం మొక్కలను సాగుచేస్తున్నారు. అక్కడక్కడ బేనిషాన్, ఖాదిరి, దసిరి రకాల తోటలు కూడా నాటుతున్నారు. మేలైన రకాల కోసం ఉద్యానవనశాఖ అధికారులను సంప్రదిస్తే మేలు. సూక్ష్మపోషక లోపాల నివారణకు మొక్కల ఎదుగు దశలో సూక్ష్మపోషక లోపాల నివారణకు ఏడాదికి 2-3 సార్లు జూన్, జూలై, సెప్టెంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో లేదా మొక్కలు కొత్తచిగుళ్లు తొడుగుతున్న దశలో లీటరు నీటిలో 3-5 గ్రాముల మల్టీప్లెక్స్ మందును కలిపి 2-3 సార్లు మొక్కలపై పిచికారీ చేయాలి. నీటి యాజమాన్యం మొక్కలు నాటిన వెంటనే ఒకటిన్నర పాదువేసి నీరు ఇవ్వాలి. వర్షాలు లేకుంటే 6 నెలల వరకు క్రమం తప్పకుండా 3-4 రోజులకోసారి నీరు పెట్టాలి. 2-3 సంవత్సరాల వరకు మొక్కను భద్రంగా కాపాడాలి. డ్రిప్పు ద్వార నీరు ఇచ్చినప్పుడు కాలాన్ని బట్టి రోజుకు 8-13 లీటర్ల మేర నీరందేలా చూడాలి. కత్తిరింపులు మొక్కలు నాటిన మొదటి సంవత్సరం మొక్క కాండం మీద 50 సెంటీమీటర్ల వరకు ఎటువ ంటి కొమ్మలు రాకుండా తగు జాగ్రతలు తీసుకోవాలి. మొక్క 60-90 సెంటీమీటర్ల ఎత్తు పెరిగిన తర్వాత ప్రధాన కాండం చివరను కత్తిరించి 2-3 బలమైన కొమ్మలను ఎంచుకుని పెరగనివ్వాలి. మిగిలిన వాటిని కత్తిరించాలి. పక్క కొమ్మలు 80-90 సెంటీమీటర్లు పెరిగాక రెండోసారి కత్తిరించి రెండో దశలోనూ బలంగా ఉన్న రెండుమూడు కొమ్మలను ఉంచాలి. మూడో దశలోనూ కొమ్మలను కత్తిరించి చెట్లు గొడుగు ఆకారంలో పెరిగేలా చర్యలు తీసుకోవాలి. అంతర పంటలతో అదనపు ఆదాయం మామిడిలో అంతర పంటలను సాగు చేసుకుని అదనపు ఆదాయం పొందవచ్చు. తీగ జాతికి చెందిన కాకర, బీర, సోర, దోస, ఉల్లి, బీన్స్, క్యాజేజీతోపాటు పప్పు దినుసులైన పెసర, మినుమును అంతర పంటలు గా సాగు చేసుకోవచ్చు. శమ్నాపూర్‌కు చెందిన మహిళా రైతు భాగమ్మ తనకున్న మూడెకరాల్లో మామిడి తోట సాగు చేసింది. దీనిలో అంతర పంట లుగా కాకర, దోస, బీర పండిస్తోంది. దీని కోసం రూ.20వేల పెట్టుబడి అవుతోందని తెలిపింది. ఇవిపోనూ తనకు ఏటా రూ.40 వేల వరకు ఆదాయం వస్తోందని చెప్పింది. -
ఇందిర జలభ్రమ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో ‘ఇందిర జలప్రభ’ పనులు ముందుకు సాగడం లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది పథకం పరిస్థితి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, నాబార్డు నిధులతో ఈ పథకంలో పనులు చేపడతా రు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన సుమారు 7,868 మంది రైతుల భూములకు మొదటి విడతగా సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి సంబంధించి ఉ పాధిహామీ, నాబార్డు నుంచి రూ.15.95 కోట్ల నిధు లు కేటాయించారు. అయితే పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. 3,724 ఎస్సీ, 4,144 ఎస్టీ కుటుంబాలకు చెందిన భూములను అభివృద్ధి చేసే ఈ పథకంపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండటంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2,734 బ్లాకులు ఎంపిక ఇందిర జలప్రభ కింద ఎస్సీ, ఎస్టీ రైతులకు చెంది న బంజరు,అసైన్డ్ భూములను అభివృద్ధి చేసేం దుకు అధికారులు ఆరు క్లస్టర్లు ఏర్పాటుచేసి 2,734 బ్లాకులు గుర్తించారు. ఈ బ్లాకుల పరిధిలో సుమారుగా 18,326.31 ఎకరాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా అనుమతి లభించింది. 1,577 బోర్లను వేసేందుకు ప్రతిపాదించగా, 1,326 బోర్లకు పరిపాలన అనుమతి లభించింది. ఈ మేరకు అధికారులు 2011 నవంబర్ మొదటి వారంలో టెండర్లు నిర్వహించారు. బోర్వెల్(డీటీహెచ్) కోసం మీటరుకు రూ.230 చొప్పున 90 మీటర్ల వరకు, ట్యూబ్‌వెల్ కన్స్ట్రక్షన్ (రోటరీ)కు మీటర్‌కు రూ.820లు చెల్లించేందుకు ప్రభుత్వం ధర నిర్ణయించింది. 18,326.31 ఎకరాలలో భూగర్భజలాల గుర్తింపు సర్వే పూర్తిచేసిన అధికారులు, 1,326 బోర్లను వేసేందుకు అర్హత గల బోర్వెల్ సంస్థలకు అప్పగిం చారు. జిల్లాలో ఇప్పటి వరకు నాబార్డు, ఈజీఎస్‌ల కింద 351 బోర్లు వేసినట్లు రికార్డులు చెబుతున్నాయి.186 బోర్ల కింద తక్షణమే ఎస్సీ, ఎస్టీ భూములు సాగులోకి తీసుకు రావాల్సి ఉండగా, కేవలం 86 బోరుబావులకు మాత్రమే విద్యుత్ కనెక్షన్షపై ఎన్పీడీసీఎల్ స్పష్టత ఇచ్చింది. బోర్లు వేసి మోటార్లు బిగించినా, విద్యుత్ స్తంభాలు, వైర్లు, అదనపు ట్రాన్స్ఫార్మర్లు లేవంటూ చేతులెత్తేయడంతో లబ్ధిదారులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పంపుసెట్ల కొనుగోలు టెండర్లపై స్పష్టత కరువు బోర్‌వెల్స్ కోసం 2011, నవంబర్ 19, 26 తేదీలలో రెండు పర్యాయాలు టెండర్లు నిర్వహించారు. అగ్రిమెంట్ పూర్తయ్యేసరికి రెండు మాసాలు పట్టింది. 18,326.31 ఎకరాలలో బోర్లు వేసేందుకు భూగర్భజల పరీక్షల నిర్వహణకు సిబ్బంది కొరత ఏర్పడగా, డిప్యూటేషన్‌పై ఇతర జిల్లాల నుంచి తాత్కాలిక నియామకాలు చేశారు. 1,326 బోర్లు వేసేందుకు సర్వే పూర్తయినా, 351 బోర్లు మాత్రమే ఇప్పటి వరకు సక్సెస్‌ఫుల్‌గా వేయగలిగారు. తక్షణమే విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని ఆ శాఖ అధికారులకు సిఫారసు చేయగా, కేవలం 86 కనెక్షన్లు మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. విద్యుత్ శాఖ నుంచి అవాంతరాలు తప్పడ ం లేదు. సబ్ మెర్సిబుల్ మోటార్లు, పంపుసెట్లు, ఇన్స్‌లేషన్, పీవీసీ పైపులు, మినీ ప్యానెల్ బోర్డు తదితర సామగ్రి కోసం రెండు పర్యాయాలు నిర్వహించిన టెండర్లు కొలిక్కి వచ్చినా రైతులకు స్పష్టత లేదు. ఐఎస్ఐ-9283, ఐఎస్ఐ-8034 గుర్తింపు పొందిన మోటార్లు, పంపుసెట్లు తదితర సామగ్రిని సరఫరా చేసేందుకు అర్హత గల కాంట్రాక్టర్లను ఎంపిక చేశామని చెబుతున్నా,రైతులకు చేరిన మోటార్లపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బావులు, పర్క్యులేషన్ ట్యాంకులు,లిఫ్ట్ ఇరిగేషన్ వంటి పనులు అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వం ఇకనైనా దృష్టిసారించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
‘ఇందిర జలప్రభ’తో ఎస్సీ, ఎస్టీ భూముల అభివృద్ధి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఇందిర జలప్రభ (ఐజేపీ) కింద జిల్లాలో ఎస్సీ, ఎస్టీ భూములు అభివృద్ధి చేసి మార్చి నెలాఖరు నాటికి 10 వేల ఎకరాలను సాగులోకి తెస్తామని కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్లోని అడిటోరియంలో సంగారెడ్డి రెవెన్యూ డివిజన్లోని సర్పంచులకు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఓలకు జీవో నం. 10లోని 25 అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఐజేపీ కింద ఎంపికైన బ్లాక్‌ల లో ఈ నెల చివరి నాటికి 5వేల ఎకరాలను సాగులోకి తెచ్చేలా పనులను వేగవంతం చేస్తామన్నారు. ట్రాన్స్‌కో, ఉద్యాన శాఖ ద్వారా మొక్కలు, ఎపీఎంఐపీ ద్వారా బిందుసేద్యం, బోరు మోటార్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సంగారెడ్డి మండలం ఎర్ధనూర్, నర్సాపూర్ మండలం గోమార్ గ్రామాలు ఐకేపీ కింద ఉన్నాయన్నారు. కోహీర్ మండలంలోని కేవలం 6 గ్రామాలు మాత్రమే ఐజేపి కింద ఎంపిక చేశారని ఆ మండల పరిధిలోని వివిధ గ్రామల సర్పంచులు కలెక్టర్ దృష్టికి తేగా ఏపీడీల ద్వారా ప్రతిపాదనలు పంపాల్సిందిగా కలెక్టర్ సూచించారు. న్యాల్కల్ మండలం టేకూర్ గ్రామంలో వాటర్‌షెడ్ పథకం చేపట్టి భూగర్భ జలాలు పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ అధికారుల దృష్టికి తెచ్చారు. మనూర్ మండలం కారముంగిలో ఐజేపీ కింద 100 ఎకరాలను గుర్తించామని మార్చి నాటికి దానిని పూర్తి అభివృద్ధిలోకి తేస్తామని కలెక్టర్ తెలిపారు. వ్యక్తి గత మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేయండి గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించేందుకు నిర్దేశించిన వ్యక్తి గత మరుగుదొడ్ల నిర్మాణాన్ని 100 శాతం పూర్తి చూస్తే నిర్మల్ భారత్ అభియాన్ పథకం కింద ప్రతి గ్రామానికి రూ. 20 లక్షల నిధులు వస్తాయని సర్పంచ్‌లకు సూచించారు. వీటి ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించుకోవచ్చన్నారు. సదస్సులో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విజయ్ ప్రకాశ్, హౌసింగ్ పీడీ బాల్‌రెడ్డి, పశుసంవర్థక శాఖ జేడీ లకా్ష్మరెడ్డి, డీపీఓ ప్రభాకర్‌రెడ్డి, డ్వామా పీడీ రవీందర్, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 37 కోట్ల వ్యయంతో 42 ఎకరాల అభివృద్ధి సంగారెడ్డి రూరల్ : ఇందిర జల ప్రభ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీలకు చెందిన బీడు భూములను అభివృద్ధి చేస్తామని కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. సంగారెడ్డి మండలం ఎర్దనూర్ శివార్లో ఇందిర జల ప్రభ బ్లాక్‌లను శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామంలో ఒకే ప్లాట్‌గా ఉన్న 42 ఎకరాలను అభివృద్ధి చేసేందుకు రూ.37.72 కోట్ల వ్యయంతో బోరుబావుల తవ్విస్తున్నట్లు ఆమె వివరించారు. ఎర్దనూర్‌లో ఇందిర జలప్రభ బ్లాక్‌లో 26 మంది లబ్దిదారులు ఉండగా, వీరిలో 24 మంది ఎస్సీలు కాగా, మిగతా ఇద్దరు గిరిజనులని తెలిపారు. ప్రస్తుతం 18 ఎకరాల భూమిలో నాలుగు బోరుబావులు ఏర్పాటు చేశామన్నారు. ఈ భూముల్లో సూక్ష్మ బిందుసేద్యం ద్వారా పంటలు సాగు చేసేందుకు రైతులకు పరికరాలను కూడా అందజేస్తున్నట్లు వివరించారు. -
ఇందిర జలభ్రమ
సాక్షి, రాజమండ్రి : ‘రెక్కలు ముక్కలయ్యేలా అటవీ భూములను చదును చేసుకుని సాగులోకి తెచ్చుకున్నాము. కానీ ఏం లాభం వాన తడికి వేసిన ఆరుతడి పంటలు కోతకు వచ్చేసరికి ఎండి పోవడం రివాజుగా మారిపోతోంది. పోడు భూముల్లో వానలేని రోజుల్లో నేలకు కాస్త చెమ్మ తగిలితే చాలు బంగారం పండించుకుందుము బాబూ’ అంటూ ఆనాడు గిరిజనులు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి మొర పెట్టుకున్నారు. ఫలితంగా ఇందిర ప్రభ పథకాన్ని ప్రారంభించి ఎస్సీ, ఎస్టీ మెట్ట భూములకు సాగునీరందించుకునే కలను మహానేత సాకారం చేశారు. కానీ ఈనాడు ఆ పథకం అమలు కల్లగా మారిపోయింది. ఇందిర జలప్రభగా పేరు మార్చిన కిరణ్ సర్కారు పథకాన్ని పూర్తి భ్రమగా మార్చేసింది. ఆర్భాటంతో సరి కాంప్రహెన్సివ్ ల్యాండ్ డవలప్మెంట్ ప్రోగ్రాం(సీఎల్డీపీ)లో భాగంగా నిధులు విడుదల చేసి సమీపంలోని కొండ కాలువలు, చెరువుల నుంచి పైపుల ద్వారా పొలాలకు నీరు అందించాలన్నది పథకం ఉద్దేశం. 2009లో ఆయన మరణానంతరం ఈ పథకం కుంటినడకన సాగుతోంది. తర్వాత ఇందిర జలప్రభగా పేరు మార్చి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఆర్భాటం చేసింది. రాష్ట్రంలో ఈ పథకంలో 10 లక్షల ఎస్సీ, ఎస్టీ భూములను సాగుయోగ్యంగా మారుస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా జిల్లాలో 28,000 ఎకరాలు సాగులోకి తెస్తామని ప్రకటించి 2011 సెప్టెంబర్‌లో రూ.33.94 కోట్లు మంజూరు చేస్తున్నట్టు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా జీఓ నెంబరు 315ను విడుదల చేసింది. కానీ ఆర్భాటం అంతా జీవోకే పరిమితం కాగా పథకం చతికిల బడింది. జిల్లాలో ప్రస్తుత పరిస్థితి చూస్తే పథకం పూర్తిగా అటక ఎక్కినట్టేనని అనిపిస్తోంది. 22 మండలాల్లో.. జిల్లాలో ఏడు క్లస్టర్లలోని 22 మండలాల్లో పథకం అమలులో ఉంది. అడ్డతీగల క్టస్టర్ పరిధిలో అడ్డతీగల, రాజవొమ్మంగి, గంగవరం, వై.రామవరం మండలాలు. రంపచోడవరం క్టస్లర్ నుంచి మారేడుమిల్లి, దేవీపట్నం, రంపచోడవరం మండలాలు. కాకినాడ క్లస్టర్ నుంచి గొల్లప్రోలు, కత్తిపూడి క్లస్టర్ నుంచి తుని, తొండంగి, శంఖవరం, రౌతులపూడి, కోటనందూరు మండలాలు, పెద్దాపురం క్లస్టర్ నుంచి రంగంపేట, పెద్దాపురం. ప్రత్తిపాడు క్లస్టర్లో గోకవరం, జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, రాజమండ్రి క్లస్టర్ నుంచి కోరుకొండ, రాజానగరం మండలాల నుంచి లబ్దిదారులను ఎంపిక చేశారు. అమలు ఇలా.. 2011లో 15,778 ఎకరాల భూమిని ఎంపిక చేశారు. ఇందులో 636 ఎస్సీ లబ్దిదారులకు చెందినభూమి 860 ఎకరాలు ఉండగా, 4822 మంది గిరిజనులకు చెందిన 14,918 ఎకరాలు ఉంది. ఈ భూమిని సాగునీటి సౌకర్యం కల్పించడం కోసం 1072 బ్లాకులుగా విభజించి పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. 2011 సంవత్సరాంతానికి 356 బ్లాకుల్లో 1744 పనులు ప్రతిపాదించారు. కాగా వీటిలో ఇప్పటికి 342 బ్లాకుల్లోని 1500 లకు పైగా పనులకు పరిపాలనా పరమైన అనుమతులు లభించగా 107 బ్లాక్‌లలోని 326 పనులు పూర్తిచేయగలిగారు. ఇంకా 78 డివిజన్లలో 136 పనులు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పుకొస్తున్నారు. రెండేళ్లుగా పనుల్లో ప్రగతి మందగించింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో పనులు పూర్తిగా స్తంభించినట్టు తెలుస్తోంది. -
31 వరకు ఐజీపీ విద్యుదీకరణ పూర్తిచేయాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఇందిరా జలప్రభ పథకం(ఐజీపీ) కింద బోర్లకు విద్యుదీకరణ ప్రక్రియ ను ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 31వ తేదీ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ స్మితాసబర్వాల్ ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశంలో ఇంది రా జలప్రభ పథకంపై డ్వామా, విద్యుత్, ఏపీఎంఐపీ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరా జలప్రభ పథకం కింద చేపట్టిన 20 వేల ఎకరాల భూమిని పూర్తిస్థాయిలో సాగులోకి తెచ్చేందుకు సమన్వయంలో పనిచేయాలన్నారు. వీటికి ఓఆర్సీచెల్లింపులను డ్వామా అధికారులు చెల్లించాలన్నారు. డ్రిప్ పరికరాలను 15 రోజుల్లోగా అమర్చేలా చర్యలు తీసుకోవాలని ఏపీఎంఐపీ పీడీ రామలక్ష్మీని ఆదేశించారు. ఈ సమావేశంలో జేసీ డాక్టర్ ఎ.శరత్, ట్రాన్స్‌కో ఎస్ఈ రాములు, డ్వామా ఏపీడీలు, విద్యుత్‌శాఖ డీఈలు పాల్గొన్నారు.