ఆశలపై నీళ్లు
ఇందిర జలప్రభకు గ్రహణం
* నిధులున్నా ముందుకు సాగని పనులు
* జిల్లాలో సాగు లక్ష్యం 85 వేల ఎకరాలు
* మూడేళ్లయినా 2,500 ఎకరాలకే మోక్షం
* విద్యుత్ కనెక్షన్లకు రాని అనుమతులు
* రైతుల ఆశలపై నీళ్లు చల్లిన ప్రభుత్వం
సాక్షి, ఖమ్మం : ఎస్సీ, ఎస్టీ రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రవేశపెట్టిన ఇందిర జలప్రభ పథకం జిల్లాలో అడుగు ముందుకు కదలడం లేదు. పథకం ప్రారంభించి మూడేళ్లయినా ఇప్పటివరకు కేవలం 2500 ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చినట్లు సంబంధిత అధికారులు కాగితాల్లో చూపుతున్నారు. జిల్లాలో 85 వేల ఎకరాల బీడు భూములను సాగులోకి తేవాలన్నది ఈ పథకం లక్ష్యం. నిధులు పుష్కలంగా ఉన్నా పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి.
ఎస్సీ, ఎస్టీలకు చెందిన వేలాది ఎకరాల బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు గత ప్రభుత్వం ‘ఇందిర జలప్రభ’ ప్రాజెక్టును రూపొందించింది. ఈ ప్రాజెక్టు అమలుకు మొత్తం రూ.196.5 కోట్లుమంజూరు చేసింది. ఇందులో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్) కింద రూ.124 కోట్లు, నాబార్డు ద్వారా రూ.72 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు అమలు కోసం ఎస్సీ, ఎస్టీలకు చెందిన 85 వేల ఎకరాలు గుర్తించారు.
ఒక్కో బ్లాకులో 10 నుంచి 200 ఎకరాల వరకు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ యోచన. ఎకరానికి రూ.16 వేల చొప్పున పది ఎకరాలకు రూ.1.60 లక్షలు ఖర్చు చేస్తారు. ప్రధానంగా సాగును దృష్టిలో పెట్టుకొని పది ఎకరాలకు సరిపడా నీరందేలా బోరు వేయిస్తారు. విద్యుత్ సౌకర్యం, మోటార్ పంపు, పైపులు అన్నీ ఉచితంగానే రైతులకు అందజేయాలి. విద్యుత్ సౌకర్యం అందుబాటులో లేని భూములకు డీజిల్ ఇంజన్లు సరఫరా చేయాలి. అవసరమైన భూముల్లో జలవనరులను అభివృద్ధి చేసేందుకు చెక్ డ్యామ్‌లు, రాక్ పిల్ డ్యామ్‌లు, చెక్ వాల్స్ నిర్మించాలి. ఈ ప్రాజెక్టు అమలుతో జిల్లాలో 30,500 మంది ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్రయోజనం కలగాలి. ఎక్కువగా ఏజెన్సీ మండలాల్లోని రైతులకు ప్రాధాన్యత ఇచ్చారు.
అంచనాలు తారుమారు..
ఈ పథకం కింద జిల్లా వ్యాప్తంగా 2,879 బ్లాకులను గుర్తించారు. ఇందులో 1,770 బ్లాకులు సర్వే చేయ గా బోర్లు వేయడానికి 778 బ్లాకులు అనుకూలమని గుర్తించారు. సర్వే చేసిన బ్లాకులకు సంబంధించి ఇప్పటివరకు జిల్లాకు 1,846 బోర్లు మంజూరయ్యా యి. ఎంపిక చేసిన బ్లాకుల్లో 1,078 బోర్లు డ్రిల్ చేస్తే 78 ఫెయిలయ్యాయి. అధికారుల పర్యవేక్షణ లోపం, జియాలజిస్టులు సరిగా అంచనా వేయకపోవడంతో ఈ బోర్లు ఫెయిల్ అయ్యాయని రైతులు ఆరోపిస్తున్నారు.
వీటి కోసం సుమారు రూ. 50 లక్షలు వృథా అయ్యాయి. మిగిలిన బోర్లలోనూ నీరు అంతంత మాత్రమే. మరికొన్ని బోర్లలో నీరున్నా నేటికీ విద్యు త్ సౌకర్యం కల్పించలేదు. భూగర్భ, జలవనరుల శాఖ అధికారులు సర్వే చేయించి ఎక్కడ భూగర్భ జలం ఉందో అక్కడే బోర్లు వేయించాలి. కానీ అధికారులు ఇష్టానుసారంగా సర్వే చేయించడంతో బోర్లు ఫెయిలయ్యాయి. దీంతో తమ భూముల్లో సిరులు పండిస్తామని భావించిన ఎస్సీ, ఎస్టీ రైతులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
సా...గుతున్న పనులు..
జిల్లాకు రూ.196.5 కోట్లు మంజూరైతే ఈ మూడేళ్లలో ఖర్చు చేసింది కేవలం రూ.10.94 కోట్లే. 920 బోర్లకు విద్యుత్ సౌకర్యం అవసరం కాగా ఇప్పటి వరకు 743 బోర్లకు మాత్రమే అనుమతి వచ్చింది. ఇంకా 177 బోర్లకు విద్యుత్ అనుమతి కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే అనుమతి వచ్చిన చోటా మోటర్లను బిగించడం, పైపులై ను, విద్యుత్ స్తంభాల పనులు నత్తనడకన సాగుతుండడంతో రైతులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వ సహకారంతో భూములు సాగు చేసుకుందామనుకున్న రైతుల కలలు కల్లలయ్యాయి. ప్రధానంగా అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పనులు ముందుకు సాగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
మోడల్ బ్లాక్‌లోనూ కనిపించని సాగు..
2011 నవంబర్ 24న అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చండ్రుగొండ మండలం కొండాయిగూడెంలో జలప్రభ పథకానికి శంకుస్థాపన చేశారు. గ్రామంలోని 91 ఎకరాలను బ్లాకుగా తీసుకున్నారు. ఇందులో తొలుత 50 ఎకరాలకు సంబంధించి 4 బోర్లు వేశారు. ఆశించినంత నీరు లేకున్నా అక్కడ జిల్లా యంత్రాంగం సీఎంతో హడావిడిగా శంకుస్థాపన చేయించింది.
ఈ బ్లాకులో 20 ఎకరాల వరకు అప్పట్లో మామిడి, ఆరటి, మిర్చి, జామాయిల్ సాగు చేశారు. బోర్లలో నీరు, విద్యుత్ సరఫరా, బ్లాక్ చుట్టూ ఫెన్సింగ్ లేకపోవడంతో సాగుచేసిన పంటల న్నీ నెలరోజులకే ఎండిపోయాయి. ప్రస్తుతం నాలుగు బోర్లకు గాను మూడింటిలో నీరు లేదు. మిగిలిన ఒక్కదాంట్లోనూ బొటాబొటిగానే ఉన్నా యి. ఈ పరిస్థితితో మోడల్ బ్లాక్‌గా తీసుకున్న ఈ భూమి కూడా బీడుగానే మిగిలింది.