నీలినీడలు
► జలప్రభ పనులు నిలిపివేయాలని మౌఖిక ఆదేశాలు జారీ
► ఇప్పటికే నిలిచిన నిధుల విడుదల
► విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంతో తీవ్ర నిర్లక్ష్యం
► జిల్లాలో 556 బోర్ల పరిస్థితి ప్రశ్నార్థకం
ఈ చిత్రంలో కనిపిస్తున్న వీరు వనపర్తి మండలం మెంటపల్లికి చెందిన దళిత రైతులు.. తమ క్లస్టర్ పరిధిలోని నలుగురు రైతులు కలిసి 10 ఎకరాల్లో ఇందిరా జలప్రభ పథకం కింద రెండేళ్లక్రితం బోరువేయించుకున్నారు. కరెంట్ కనెక్షన్ కోసం డ్వామా అధికారులు విద్యుత్‌లైన్ వేసేందుకు డీడీలు చెల్లించారు. రైతులు ట్రాన్స్‌కో అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగారు. రేపు మాపు ! అంటూ కాలం వెళ్లదీశారు. ఇప్పటికీ కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదు. స్తంభాలు వేసుకోలేక..బోరు కొనుగోలుచేసే స్తోమత లేక వర్షాధారంగా మెట్టపంటలు సాగుచేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు.
వనపర్తి: నిరుపేద ఎస్సీ, ఎస్టీ రైతుల వ్యవసాయాభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరా జలప్రభ పథకం మసకబారుతోంది. ప్రభుత్వం కొన్ని నెలలుగా నిధులు నిలిపివేయడంతో నిట్టూర్చుతోంది. దీంతో కొత్త లబ్ధిదారులకు మేలు చేకూర్చే అవకాశం లేకుండాపోయింది. ప్రస్తుతానికి ఎక్కడి పనులు అక్కడే ఆపివేయాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీఅయినట్లు తెలుస్తోంది. జిల్లాను క్లస్టర్లుగా విభజించి వాటి పరిధిలో వర్షాధారంగా సేద్యం చేసుకుని జీవనం సాగించే దళిత, గిరిజన రైతులను ఎంపికచేసి ప్రతి పదెకరాలను ఒక బ్లాక్‌గా గుర్తిస్తారు.
అందులోని రైతులకు ఉమ్మడిగా ప్రభుత్వం బోరువేయించి, విద్యుత్ మోటార్‌ను బిగించి పంటలు పండించుకునేందుకు ప్రోత్సాహం కల్పిస్తారు. అందుకు అయిన ఖర్చును ప్రభుత్వమే పూర్తిగా భరించాల్సి ఉంటుంది. 2011లో ప్రారంభమైన ఈ పథకం జిల్లాలో ఐదేళ్లలో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. ప్రభుత్వం తాజాగా నిధులు నిలిపేయడంతో 3వేల మంది ఎస్సీ, ఎస్టీ పేదరైతులకు చెందిన 556బోర్లు ఎటువంటి ప్రయోజనం లేకుండాపోయాయి.
అమలు తీరిది..
జిల్లాలోని 64 మండలాల్లో పథకం ప్రారంభం నుంచి 45,297మంది రైతులకు సంబంధించిన 1,07,731.8 ఎకరాల భూమిని భూగర్భజల పరిశోధక శాఖ అధికారులు సర్వే నిర్వహించి రూ.26.29కోట్ల వ్యయంతో 5754బోర్లు వేయాలని సర్వేచేశారు. డ్వామా అధికారులు జిల్లాలోని 12 క్లస్టర్లలో 2523 పనులు చేసేందుకు ప్రభుత్వానికి నివేదించారు. కాగా, ప్రభుత్వం నుంచి 2134పనులకు మంజూరు ఇచ్చింది. ఈ ఐదేళ్లలో జిల్లావ్యాప్తంగా 1576 బోర్లు తవ్వించారు. వాటిలో కొన్నింటికి విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. మరికొన్ని అంచనాల వద్దే ఆగిపోయాయి. కొన్ని క్లస్టర్లలో బోర్లువేసి ఏళ్లు గడిచినా విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడం, మోటార్లను బిగించకపోవడంతో చుక్కనీరు పారకుండానే ఎండిపోయాయి. దీంతో రూ.కోట్లు వెచ్చించినా ప్రయోజనం నామమాత్రమే అన్న విమర్శలూ ఉన్నాయి.
విద్యుత్‌శాఖ నిర్లక్ష్యం
ఇందిరా జలప్రభ పథకం మొదటి అడ్డంకి విద్యుత్‌శాఖ నిర్లక్ష్యమే అని చెప్పాలి. బోర్లు డ్రిల్లింగ్ అయిన వెంటనే డ్వామా అధికారులు బోర్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని డీడీలు చెల్లించినా విద్యుత్‌లైన్లు ఏర్పాటు చేయడంలో తీవ్ర అలక్ష్యం వహించారు. బోరు వేసినప్పుడు నీళ్లొచ్చినా.. ఏళ్లపాటు వినియోగించకపోవంతో కొన్ని ఎండిపోయాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇతరులు మరోబోరు వేసిన సందర్భంలోనూ నీళ్లు తగ్గిపోయిన సంఘటనలు ఉన్నాయి.