st farmers
-
విద్యుత్ బకాయిలు రద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని షెడ్యూల్ తెగల(ఎస్టీలు)పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వరాలజల్లు కురిపించారు. ఎస్టీల విద్యుత్ బిల్లుల బకాయిలతో పాటు వారిపై ఉన్న విద్యుత్ కేసులన్నీ రద్దు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. డొమెస్టిక్ కేటగిరీలో ఎస్టీల విద్యుత్ బిల్లుల బకాయిలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం కూలంకషంగా చర్చించి, బకాయిలన్నీ రద్దు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీల అభివృద్ధికి కట్టుబడి ఉందని, ఎస్టీల్లోని అన్ని తెగలు, జాతులు సమైక్యంగా ఉండి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, ఎస్టీ ప్రజాప్రతినిధులే పూర్తి సమన్వయంతో ఎస్టీ తెగలు, జాతుల మధ్య ఐక్యత సాధించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఎస్టీ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ.125కే విద్యుత్ కనెక్షన్.. రూ.70 కోట్లకు పైగా ఉన్న విద్యుత్ బిల్లు బకాయిలను రద్దు చేయాలని, ఇందులో రూ.40 కోట్లను ప్రభుత్వం తరఫున విద్యుత్ సంస్థలకు చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మిగతా రూ.30 కోట్లను తాము మాఫీ చేస్తామని ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు వెల్లడించారు. ఎస్టీలపై పెట్టిన విజిలెన్స్ కేసులు కూడా ఎత్తేయాలని సీఎం ఆదేశించారు. ప్రతి ఎస్టీ ఇంటికి రూ.125 మాత్రమే ఫీజు తీసుకుని విద్యుత్ సౌకర్యం కల్పించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఒక్కో కనెక్షన్‌కు రూ.125 మాత్రమే దరఖాస్తు ఫీజు తీసుకుని కనెక్షన్ ఇస్తామని, ప్రతి ఇంటికి సర్వీస్ వైరు, ఇంటిలోపల వైరింగ్, రెండు లైట్లు ఏర్పాటు చేస్తామని, 50 యూనిట్ల లోపు వినియోగించే వారి నుంచి ఎలాంటి చార్జీ తీసుకోబోమని అధికారులు స్పష్టం చేశారు. ఎస్టీ వ్యవసాయదారులకు ఉచిత విద్యుత్ ఎస్టీ ఆవాస ప్రాంతాలన్నింటికీ త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 9,737 ఎస్టీ ఆవాస ప్రాంతాలుండగా, 8,734 గ్రామాల్లో త్రీఫేజ్ కరెంటు లేదని, సమైక్య రాష్ట్రంలో జరిగిన నిర్లక్ష్యానికి ఇదో ఉదాహరణ అని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఉన్న వారితో పాటు ఎస్టీ వ్యవసాయదారులందరికీ విద్యుత్ సౌకర్యం కల్పించి, ఉచిత విద్యుత్ అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. అటవీ ప్రాంతాల్లో విద్యుత్ లైన్ల నిర్మాణానికి అవసరమైన వ్యూహం రూపొందించాలని పీసీసీఎఫ్ ఝాను ఆదేశించారు. ఎస్టీ ఆవాస ప్రాంతాలకు రోడ్లు.. ఎస్టీ ఆవాస ప్రాంతాలన్నింటికీ రహదారి సౌకర్యం కల్పించాలని, దీనికోసం వచ్చే బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ఆర్థిక మంత్రిని సీఎం కేసీఆర్ కోరారు. రెసిడెన్షియల్ పాఠశాలల వల్ల ఎస్టీల పిల్లలకు ఎంతో మేలు కలుగుతోందని, ఈ పాఠశాలల్లో ప్రవేశానికి విపరీతమైన డిమాండ్ ఉన్నందున, మరికొన్ని పాఠశాలలు ప్రారంభిస్తామన్నారు. ఆదివాసీలకు ఎక్కువ అవకాశాలు రావడానికి వీలుగా ఆదివాసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించి స్థానికులకే అవకాశం దక్కే విధానం తీసుకొస్తామన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండా ఎస్టీల స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. గొర్రెల పెంపకం లాంటి స్వయం ఉపాధి పథకాలను ఎస్టీలకు కూడా వర్తింపచేస్తామని చెప్పారు. ఇందుకోసం పథకాలు రూపకల్పన చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, జెన్కో–ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనా, ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్‌రావు, మహేశ్‌దత్ ఎక్కా, ఎస్టీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రజత్‌కుమార్, కమిషనర్ లక్ష్మణ్, ఎంపీలు సీతారాంనాయక్, నగేశ్, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎస్టీ ప్రజాప్రతినిధులతో కమిటీలు - అన్ని ఎస్టీ ఆవాస ప్రాంతాలకు కచ్చితంగా రహదారి సౌకర్యం కల్పించే విషయంలో అధికారులతో సమన్వయం చేసుకోవడానికి సీనియర్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. - విద్య, స్వయంఉపాధి విషయాల్లో సమన్వయానికి ఎంపీ సీతారాంనాయక్ నేతృత్వంలో కమిటీని నియమించారు. - విద్యుత్‌కు సంబంధించిన అంశాలను సమన్వయం చేయడానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. -
ఎస్సీ, ఎస్టీల ఉచిత సూక్ష్మసేద్యం ఎత్తివేత
• తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం • 90 శాతం సబ్సిడీతో ఇవ్వాలని నిర్ణయం • బీసీలకు 90 శాతం సబ్సిడీ 80 శాతానికి తగ్గింపు సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచిత సూక్ష్మ సేద్యం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేసింది. వారికి 90 శాతం సబ్సిడీతో అందజేయాలని నిర్ణరుుస్తూ ఉద్యానశాఖ సంచ లన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉద్యాన సమగ్ర అభివృద్ధి మిషన్, సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టు, ఉద్యాన నర్సరీ సంస్థల కార్యనిర్వా హక సమావేశం శనివారం సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి, కమిషనర్ జగన్ మోహన్, ఉద్యాన కమిషనర్ వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. సూక్ష్మసేద్యం కోసం ఇస్తున్న రారుుతీని తగ్గిస్తూ సమావేశం సిఫార్సు చేసిం ది. బీసీలకు, ఇతర సన్నచిన్నకారు రైతులకు ప్రస్తుతం 90 శాతం సబ్సిడీ ఇస్తుండగా, దాన్ని 80 శాతానికి తగ్గించాలని... పెద్ద రైతులకు ప్రస్తుతం ఇస్తున్న 80 శాతం సబ్సిడీని 60 శాతానికి తగ్గించాలని నిర్ణరుుంచినట్లు తెలి సింది. ఈ పథకం కోసం కేటారుుస్తున్న నిధు ల్లో 16.05 శాతం ఎస్సీ రైతులకు, 9.55 శాతం ఎస్టీ రైతులకు, 64.40 శాతం సన్న, చిన్నకారు రైతులకు కేటారుుస్తారు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రధానంగా నష్టపోయేది ఈ వర్గాల రైతులే ఎక్కువగా ఉంటారు. నిధులు విడుదల చేయకపోవడం వల్లే... సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించాలని, అందుకు ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగా సంబంధిత పరికరాలు అందించాలని ప్రభుత్వం మొదట్లో నిర్ణయం తీసుకుంది. ఇతర రైతులకు కూడా కేంద్రం ఇస్తున్న సబ్సిడీ కంటే ఎక్కువగా ఇస్తూ ఇప్పటివరకు అమలు చేసింది. కానీ ఆచరణలో ఆ మేరకు నిధులను విడుదల చేయడంలో సర్కారు విఫలమైంది. 2014-15లో 1.34 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం ఏర్పాటు చేయా లనేది ఉద్యానశాఖ లక్ష్యం. అందుకు ప్రభుత్వం రూ.350.08 కోట్లు బడ్జెట్లో కేటారుుంచి, 70,480 ఎకరాలకు రూ.191 కోట్లు మాత్ర మే విడుదల చేసింది. 2015-16 బడ్జెట్లోనూ 1.03 లక్షల ఎకరాలకు రూ.308 కోట్లు కేటారుుంచింది. లక్ష్యానికి మించి రెండున్నర రెట్లు డిమాండ్ వచ్చింది. దీంతో 1.6 లక్షల ఎకరాల దరఖాస్తులను సర్కారు పెండింగ్‌లో పెట్టింది. వాటికి కూడా సూక్ష్మ సేద్యం అందించాలంటే బడ్జెట్ కేటారుుంపు లకు తోడు అదనంగా రూ.337.3 కోట్లు కేటారుుం చాలి. అప్పుడూ నిధుల సమస్య ఎదురైంది. 2016-17లో 3.37 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం కోసం రూ.290 కోట్లు కేటారుుంచింది. ప్రభుత్వ లక్ష్యం ప్రకారం ఈ సొమ్ము సరి పోదు. దీంతో నాబార్డు నుంచి రూ. వెరుు్య కోట్లు రుణానికి వెళ్లాలని నిర్ణరుుంచింది. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినా భారీ సబ్సిడీ ఇస్తే తాము ఒప్పుకోబోమని నాబార్డు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో నాబార్డును ఒప్పించేందుకు ముంబై వెళ్లేందుకు మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి సిద్ధమయ్యారు. చివరకు నాబార్డు సబ్సిడీ నిర్ణయాన్ని ఇప్పుడు అమలులోకి తీసు కొచ్చినట్లు చెబుతున్నారు. -
నీలినీడలు
► జలప్రభ పనులు నిలిపివేయాలని మౌఖిక ఆదేశాలు జారీ ► ఇప్పటికే నిలిచిన నిధుల విడుదల ► విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంతో తీవ్ర నిర్లక్ష్యం ► జిల్లాలో 556 బోర్ల పరిస్థితి ప్రశ్నార్థకం ఈ చిత్రంలో కనిపిస్తున్న వీరు వనపర్తి మండలం మెంటపల్లికి చెందిన దళిత రైతులు.. తమ క్లస్టర్ పరిధిలోని నలుగురు రైతులు కలిసి 10 ఎకరాల్లో ఇందిరా జలప్రభ పథకం కింద రెండేళ్లక్రితం బోరువేయించుకున్నారు. కరెంట్ కనెక్షన్ కోసం డ్వామా అధికారులు విద్యుత్‌లైన్ వేసేందుకు డీడీలు చెల్లించారు. రైతులు ట్రాన్స్‌కో అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగారు. రేపు మాపు ! అంటూ కాలం వెళ్లదీశారు. ఇప్పటికీ కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదు. స్తంభాలు వేసుకోలేక..బోరు కొనుగోలుచేసే స్తోమత లేక వర్షాధారంగా మెట్టపంటలు సాగుచేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. వనపర్తి: నిరుపేద ఎస్సీ, ఎస్టీ రైతుల వ్యవసాయాభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరా జలప్రభ పథకం మసకబారుతోంది. ప్రభుత్వం కొన్ని నెలలుగా నిధులు నిలిపివేయడంతో నిట్టూర్చుతోంది. దీంతో కొత్త లబ్ధిదారులకు మేలు చేకూర్చే అవకాశం లేకుండాపోయింది. ప్రస్తుతానికి ఎక్కడి పనులు అక్కడే ఆపివేయాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీఅయినట్లు తెలుస్తోంది. జిల్లాను క్లస్టర్లుగా విభజించి వాటి పరిధిలో వర్షాధారంగా సేద్యం చేసుకుని జీవనం సాగించే దళిత, గిరిజన రైతులను ఎంపికచేసి ప్రతి పదెకరాలను ఒక బ్లాక్‌గా గుర్తిస్తారు. అందులోని రైతులకు ఉమ్మడిగా ప్రభుత్వం బోరువేయించి, విద్యుత్ మోటార్‌ను బిగించి పంటలు పండించుకునేందుకు ప్రోత్సాహం కల్పిస్తారు. అందుకు అయిన ఖర్చును ప్రభుత్వమే పూర్తిగా భరించాల్సి ఉంటుంది. 2011లో ప్రారంభమైన ఈ పథకం జిల్లాలో ఐదేళ్లలో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. ప్రభుత్వం తాజాగా నిధులు నిలిపేయడంతో 3వేల మంది ఎస్సీ, ఎస్టీ పేదరైతులకు చెందిన 556బోర్లు ఎటువంటి ప్రయోజనం లేకుండాపోయాయి. అమలు తీరిది.. జిల్లాలోని 64 మండలాల్లో పథకం ప్రారంభం నుంచి 45,297మంది రైతులకు సంబంధించిన 1,07,731.8 ఎకరాల భూమిని భూగర్భజల పరిశోధక శాఖ అధికారులు సర్వే నిర్వహించి రూ.26.29కోట్ల వ్యయంతో 5754బోర్లు వేయాలని సర్వేచేశారు. డ్వామా అధికారులు జిల్లాలోని 12 క్లస్టర్లలో 2523 పనులు చేసేందుకు ప్రభుత్వానికి నివేదించారు. కాగా, ప్రభుత్వం నుంచి 2134పనులకు మంజూరు ఇచ్చింది. ఈ ఐదేళ్లలో జిల్లావ్యాప్తంగా 1576 బోర్లు తవ్వించారు. వాటిలో కొన్నింటికి విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. మరికొన్ని అంచనాల వద్దే ఆగిపోయాయి. కొన్ని క్లస్టర్లలో బోర్లువేసి ఏళ్లు గడిచినా విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడం, మోటార్లను బిగించకపోవడంతో చుక్కనీరు పారకుండానే ఎండిపోయాయి. దీంతో రూ.కోట్లు వెచ్చించినా ప్రయోజనం నామమాత్రమే అన్న విమర్శలూ ఉన్నాయి. విద్యుత్‌శాఖ నిర్లక్ష్యం ఇందిరా జలప్రభ పథకం మొదటి అడ్డంకి విద్యుత్‌శాఖ నిర్లక్ష్యమే అని చెప్పాలి. బోర్లు డ్రిల్లింగ్ అయిన వెంటనే డ్వామా అధికారులు బోర్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని డీడీలు చెల్లించినా విద్యుత్లైన్లు ఏర్పాటు చేయడంలో తీవ్ర అలక్ష్యం వహించారు. బోరు వేసినప్పుడు నీళ్లొచ్చినా.. ఏళ్లపాటు వినియోగించకపోవంతో కొన్ని ఎండిపోయాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇతరులు మరోబోరు వేసిన సందర్భంలోనూ నీళ్లు తగ్గిపోయిన సంఘటనలు ఉన్నాయి. -
ఎస్సీ, ఎస్టీలకు వ్యవసాయ యంత్రాలు
100 శాతం సబ్సిడీతో అందించాలని నిర్ణయం వ్యవసాయ శాఖ మంత్రి పోచారం వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీతో వ్యవసాయ యంత్ర పరికరాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో భారత వ్యవసాయ పరిశోధన మండలి, వ్యవసాయ పని ముట్ల పరిశోధన విభాగం శుక్రవారం సంయుక్తంగా నిర్వహించిన వ్యవసాయ యాంత్రీకరణ దినోత్సవం, రైతు సదస్సులో మంత్రి మాట్లాడారు. దేశంలో యాంత్రీకరణకు అత్యధికంగా సబ్సిడీ ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనన్నారు. వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గి లాభాలు పొందాలంటే యాంత్రీకరణ అవసరమన్నారు. ఎక్కువమంది రైతులకు ప్రయోజనం కలిగించేందుకు యాంత్రీకరణ పథకాల నిబంధనలను సరళతరం చేశామన్నారు. వచ్చే ఖరీఫ్‌కు వివిధ పంటలకు అవసరమైన 8 లక్షల క్వింటాళ్ల విత్తనాలు ముందస్తుగానే రైతులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే ఎరువులను కూడా బఫర్ స్టాక్ ఏర్పాటు చేశామన్నారు. కరువుకు సంబంధించి పెట్టుబడి రాయితీ కేంద్రం నుంచి సకాలంలో వచ్చినా రాకపోయినా వచ్చే ఖరీఫ్‌కు ముందే మే నెలలో రైతులకు పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 100 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కోచోట ఒక అసిస్టెంట్ డెరైక్టర్‌ను నియమిస్తున్నామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారధి, వ్యవసాయ వర్సిటీ ప్రత్యేకాధికారి డాక్టర్ వి.ప్రవీణ్‌రావు, పరిశోధన సంచాలకులు డాక్టర్ దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు డాక్టర్ ఎన్.వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆశలపై నీళ్లు
ఇందిర జలప్రభకు గ్రహణం * నిధులున్నా ముందుకు సాగని పనులు * జిల్లాలో సాగు లక్ష్యం 85 వేల ఎకరాలు * మూడేళ్లయినా 2,500 ఎకరాలకే మోక్షం * విద్యుత్ కనెక్షన్లకు రాని అనుమతులు * రైతుల ఆశలపై నీళ్లు చల్లిన ప్రభుత్వం సాక్షి, ఖమ్మం : ఎస్సీ, ఎస్టీ రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రవేశపెట్టిన ఇందిర జలప్రభ పథకం జిల్లాలో అడుగు ముందుకు కదలడం లేదు. పథకం ప్రారంభించి మూడేళ్లయినా ఇప్పటివరకు కేవలం 2500 ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చినట్లు సంబంధిత అధికారులు కాగితాల్లో చూపుతున్నారు. జిల్లాలో 85 వేల ఎకరాల బీడు భూములను సాగులోకి తేవాలన్నది ఈ పథకం లక్ష్యం. నిధులు పుష్కలంగా ఉన్నా పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు చెందిన వేలాది ఎకరాల బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు గత ప్రభుత్వం ‘ఇందిర జలప్రభ’ ప్రాజెక్టును రూపొందించింది. ఈ ప్రాజెక్టు అమలుకు మొత్తం రూ.196.5 కోట్లుమంజూరు చేసింది. ఇందులో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్ఆర్ఈజీఎస్) కింద రూ.124 కోట్లు, నాబార్డు ద్వారా రూ.72 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు అమలు కోసం ఎస్సీ, ఎస్టీలకు చెందిన 85 వేల ఎకరాలు గుర్తించారు. ఒక్కో బ్లాకులో 10 నుంచి 200 ఎకరాల వరకు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ యోచన. ఎకరానికి రూ.16 వేల చొప్పున పది ఎకరాలకు రూ.1.60 లక్షలు ఖర్చు చేస్తారు. ప్రధానంగా సాగును దృష్టిలో పెట్టుకొని పది ఎకరాలకు సరిపడా నీరందేలా బోరు వేయిస్తారు. విద్యుత్ సౌకర్యం, మోటార్ పంపు, పైపులు అన్నీ ఉచితంగానే రైతులకు అందజేయాలి. విద్యుత్ సౌకర్యం అందుబాటులో లేని భూములకు డీజిల్ ఇంజన్లు సరఫరా చేయాలి. అవసరమైన భూముల్లో జలవనరులను అభివృద్ధి చేసేందుకు చెక్ డ్యామ్‌లు, రాక్ పిల్ డ్యామ్‌లు, చెక్ వాల్స్ నిర్మించాలి. ఈ ప్రాజెక్టు అమలుతో జిల్లాలో 30,500 మంది ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్రయోజనం కలగాలి. ఎక్కువగా ఏజెన్సీ మండలాల్లోని రైతులకు ప్రాధాన్యత ఇచ్చారు. అంచనాలు తారుమారు.. ఈ పథకం కింద జిల్లా వ్యాప్తంగా 2,879 బ్లాకులను గుర్తించారు. ఇందులో 1,770 బ్లాకులు సర్వే చేయ గా బోర్లు వేయడానికి 778 బ్లాకులు అనుకూలమని గుర్తించారు. సర్వే చేసిన బ్లాకులకు సంబంధించి ఇప్పటివరకు జిల్లాకు 1,846 బోర్లు మంజూరయ్యా యి. ఎంపిక చేసిన బ్లాకుల్లో 1,078 బోర్లు డ్రిల్ చేస్తే 78 ఫెయిలయ్యాయి. అధికారుల పర్యవేక్షణ లోపం, జియాలజిస్టులు సరిగా అంచనా వేయకపోవడంతో ఈ బోర్లు ఫెయిల్ అయ్యాయని రైతులు ఆరోపిస్తున్నారు. వీటి కోసం సుమారు రూ. 50 లక్షలు వృథా అయ్యాయి. మిగిలిన బోర్లలోనూ నీరు అంతంత మాత్రమే. మరికొన్ని బోర్లలో నీరున్నా నేటికీ విద్యు త్ సౌకర్యం కల్పించలేదు. భూగర్భ, జలవనరుల శాఖ అధికారులు సర్వే చేయించి ఎక్కడ భూగర్భ జలం ఉందో అక్కడే బోర్లు వేయించాలి. కానీ అధికారులు ఇష్టానుసారంగా సర్వే చేయించడంతో బోర్లు ఫెయిలయ్యాయి. దీంతో తమ భూముల్లో సిరులు పండిస్తామని భావించిన ఎస్సీ, ఎస్టీ రైతులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. సా...గుతున్న పనులు.. జిల్లాకు రూ.196.5 కోట్లు మంజూరైతే ఈ మూడేళ్లలో ఖర్చు చేసింది కేవలం రూ.10.94 కోట్లే. 920 బోర్లకు విద్యుత్ సౌకర్యం అవసరం కాగా ఇప్పటి వరకు 743 బోర్లకు మాత్రమే అనుమతి వచ్చింది. ఇంకా 177 బోర్లకు విద్యుత్ అనుమతి కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే అనుమతి వచ్చిన చోటా మోటర్లను బిగించడం, పైపులై ను, విద్యుత్ స్తంభాల పనులు నత్తనడకన సాగుతుండడంతో రైతులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వ సహకారంతో భూములు సాగు చేసుకుందామనుకున్న రైతుల కలలు కల్లలయ్యాయి. ప్రధానంగా అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పనులు ముందుకు సాగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మోడల్ బ్లాక్‌లోనూ కనిపించని సాగు.. 2011 నవంబర్ 24న అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చండ్రుగొండ మండలం కొండాయిగూడెంలో జలప్రభ పథకానికి శంకుస్థాపన చేశారు. గ్రామంలోని 91 ఎకరాలను బ్లాకుగా తీసుకున్నారు. ఇందులో తొలుత 50 ఎకరాలకు సంబంధించి 4 బోర్లు వేశారు. ఆశించినంత నీరు లేకున్నా అక్కడ జిల్లా యంత్రాంగం సీఎంతో హడావిడిగా శంకుస్థాపన చేయించింది. ఈ బ్లాకులో 20 ఎకరాల వరకు అప్పట్లో మామిడి, ఆరటి, మిర్చి, జామాయిల్ సాగు చేశారు. బోర్లలో నీరు, విద్యుత్ సరఫరా, బ్లాక్ చుట్టూ ఫెన్సింగ్ లేకపోవడంతో సాగుచేసిన పంటల న్నీ నెలరోజులకే ఎండిపోయాయి. ప్రస్తుతం నాలుగు బోర్లకు గాను మూడింటిలో నీరు లేదు. మిగిలిన ఒక్కదాంట్లోనూ బొటాబొటిగానే ఉన్నా యి. ఈ పరిస్థితితో మోడల్ బ్లాక్‌గా తీసుకున్న ఈ భూమి కూడా బీడుగానే మిగిలింది. -
పంపిణీ ‘భూ’టకం!
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ భూ పంపిణీ పథకం అస్తవ్యస్తంగా మారింది. ఇది ఉత్తి బూటకమని, ప్రచారమే తప్పా ప్రయోజనం ఉండడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. కాయకష్టం చేసి భూములను బాగుచేసుకుందామనుకున్నా అవకాశం లేకుండా పోతోందని వారు చెబుతున్నారు. కొండవారే, ఏటి ఒడ్డునో, తుప్పలు, డొంకలు మొలిచిన భూములను ఇచ్చి అధికారులు చేతులుదులుపుకొంటున్నారని, నీటి సదుపాయం కల్పించుకునేందుకు, ఇతర అవసరాలకు బ్యాంకులు అప్పులుకూడా ఇవ్వడం లేదని ఎస్సీ, ఎస్టీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. చాలా గ్రామాల్లో ఎస్సీలకు అప్పటికే ఎస్సీల సాగుబడిలో ఉన్న భూములకు పట్టాలిచ్చారు. చాలా మందికి పట్టాలైతే ఇచ్చారు గాని భూమి ఎక్కడుందో తెలియని పరిస్థితి. మరి కొందరి పొలాలు ఇప్పటికే బడాబాబుల చేతుల్లోనే ఉన్నాయి. రైతు సదస్సులు, రచ్చబండ కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను గుర్తిస్తున్నారే తప్పా ఈ ప్రక్రియ కోసం నియమించిన అసైన్మెంట్ కమిటీలు అసలు పనిచేయడం లేదు. పట్టాలు ఇస్తున్నప్పటికీ ఆ భూములు లబ్ధిదారుల చేతుల్లో ఉండడం లేదు. తమ వద్ద పట్టాలున్నప్పటికీ పెద్దల చేతుల్లో భూములు ఉన్నాయంటూ వస్తున్న ఫిర్యాదులకు పరిష్కారం లభించడం లేదు. దీంతో చాలా మంది ఎస్సీ, ఎస్టీలు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటువంటి ఫిర్యాదులు 120 వరకూ పెండింగ్‌లో ఉన్నాయి. ఎస్.కోట, బాడంగి, రామభద్రపురం,తెర్లాం మండలాల్లో మిగులు భూములు పంచి పెట్టాలని దశాబ్ద కాలంగా పోరాటాలు చేస్తున్నా అవి పేదలకు దక్కడం లేదు. భూమి లేని నిరుపేదలు లక్షల సంఖ్యలో ఉండగా కేవలం కొద్ది మందికి మాత్రమే భూమి పంపిణీ చేశారు. మరికొందరికి పట్టాలు ఇచ్చారు గాని... భూములు ఎక్కడ ఉన్నాయో వారికే తెలియని పరిస్థితి నెలకొంది. 2004 నుంచి 2009 సంవత్సరం వరకూ జరిగిన పంపిణీలో లబ్ధిదారులకు పట్టాలతో పాటూ భూములు అప్పగించారు. ఆ తరువాత పథకం చతికిలపడింది. ఇప్పటి వరకూ ఆరు విడతలుగా జరిగిన భూపంపిణీ కార్యక్రమంలో 23,442 మందికి 26,220 ఎకరాలు పంపిణీ చేశారు. వీరిలో 250 మందికి తమ భూములు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. పత్తాలేని కమిటీలు... మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో భూపంపిణీకి శ్రీకా రం చుట్టారు. గ్రామాల్లో ఉన్న మిగులు భూములను గుర్తించి వాటిని పేదలకు పంపిణీ చేసేందుకు వీలుగా అసైన్డ్ కమిటీలను నియమించారు. నియోజకవర్గ స్థాయిలో ఉండే ఈ కమిటీలు ప్రతి మూడు నెలలకోసారి సమావేశమవ్వాలి. ఈ కమిటీకి ఎమ్మెల్యే అధ్యక్షునిగా, ఆర్డీఓ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. స్థానిక తహశీల్దార్లు సభ్యులుగా ఉంటారు. షెడ్యూల్ ప్రకారం మండలాల వారీగా ఉన్న భూములను సమగ్రంగా పరిశీలించి ప్రభు త్వ, అసైన్డ్ భూములకు సంబంధించిన నివేదికలు సిద్ధం చేయాలి. అయితే ఆ కార్యక్రమాలు జిల్లాలో జరగడం లే దు. కేవలం ప్రభుత్వం భూపంపిణీకి తేదీలు నిర్ణయించిన త ర్వాత మాత్రమే తూతూమంత్రంగా కమిటీలు సమావేశమై మమా అనిపించేస్తున్నాయి. దీంతో సర్కారు లక్ష్యం నెరవేరడం లేదు. మిగుల భూముల గుర్తింపెక్కడ.... భూపరిమితి చట్టం ప్రకారం ఒక వ్యక్తికి ఉండవలసిన దానికంటే అధికంగా భూమి ఉంటే దాన్ని అధికారులు స్వాధీనం చేసుకోవాలి. అయితే మిగులు భూములు గుర్తించేందుకు కనీసం సర్వేలు కూడా నిర్వహించడం లేదు. కొన్ని మండలాల్లో పరిమితికి మించి భూములున్నా వారిపై యంత్రాంగం దృష్టి సారించడం లేదు. దీంతో భూస్వాములు బినామీ పేర్లతో వందలాది ఎకరాలను అనుభవిస్తున్నారు. పరిమితికి మించి భూమి ఉన్నట్టు గుర్తిస్తే ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరను ఆభూమి యజమానికి చెల్లించాలి. పట్టాల కోసం ఎదురు చూపులు.... విజయనగరం రెవెన్యూ డివిజన్లో 19 మండలాలకు గానూ 12 మండలాలు వుడా పరిధిలో ఉండడంతో అక్కడ భూపంపిణీ జరగడం లేదు. దీంతో ఎస్.కోట, కొత్తవలస, నెల్లిమర్ల, భోగాపురం, విజయనగరం తదితర మండలాల్లో వేలాది మంది పేదలు ఇళ్ల స్థలాల కోసం అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 7వ విడత భూపంపిణీకి సన్నద్ధం... జిల్లాలో 7వ విడత భూపంపిణీకి అధికారులు సన్నద్ధమయ్యారు. 225 గ్రామాల్లో 4,403 ఎకరాల భూమిని గుర్తించారు. దీనికి గానూ 3,984 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. 875 గ్రామాల్లో ప్రభుత్వ మిగులు భూములు లేనట్లు అధికారులు నివేదించారు. ఆ పట్టాల వల్ల లాభం లేదు... నా పేరు హిమరిక నారాయణ. మాది కొమరాడ మండలం డంగభద్ర గ్రామం. మాకు ఆరో విడతలో భూ పంపిణీలో పట్టాలిచ్చారు. ఆ పట్టాలతో బ్యాంకులకు వెళ్తే రుణాలివ్వడం లేదు. సరికదా పట్టాలిచ్చిన భూములు సాగుకు సరిపడా ఆర్థిక శక్తి లేదు. ఏదో బాగున్న మూల పంటల సమయంలో డొంకా తుప్పలు బయలు చేసి, కందులో, వరో, జొన్నో ఏవో చిరుధాన్యాలు వేస్తాం. వర్షాలు అనుకూలిస్తే పంట. లేదంటే శ్రమ దండగే. ప్రభుత్వం పట్టాలిచ్చినా, ఇవ్వకపోయినా ఒకటే. ఏటా గిరిజనులు బాగు చేసుకుంటే భూములు. లేకుండా బీడే అవుతుంది. పట్టాలిచ్చిన భూమిలో నీటి సదుపాయం, ఆ భూమి చదును చేసే అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది. శ్రమ తప్ప ప్రయోజనం లేదు... నా పేరు పువ్వల పెద నారాయణ, మాది కొమరాడ కొత్తవలస గ్రామం. మాకు ఆరో విడత భూ పంపిణీలో పట్టాలిచ్చారు. ఆ భూ పంపిణీ అనేది ఉత్తి బూటకమే. తాత ముత్తాతల నుంచి డొంకా తుప్ప కొట్టిన మా భూములకే పట్టాలిచ్చారు. అయినా ఆ భూములేటి తిన్నగా ఉన్నాయా...? మొజ్జు, రాయి, రప్పలతో నిండిపోయాయి. కొంతమంది జీడి మొక్కలు వేశారు. కొంతమంది అలాగే బాగు చేసుకొని ఏదో పండించుకుందామంటే వర్షాలు సకాలంలో లేక అవీ దూరమవుతున్నాయి. పోనీ తుప్పా, డొంకలు కొట్టి సాగు చేయడానికి, పంటకు అనుకూలంగా మలచుకోడానికి సహాయం లేదు. మా చుట్టు ఉన్న వాటిని బాగు చేసుకుంటే వాటికే పట్టాలిచ్చారు. ఆ భూములు ఇలా తుప్పలు కొడితే మళ్లీ బలిచేస్తాయి. ఏటా శ్రమ పోవడమే తప్ప ప్రయోజనం లేదు. -
ఇందిర జలప్రభ బోర్ల పరిశీలన
తలమడుగు, న్యూస్‌లైన్ : మండలంలో ఇందిర జలప్రభ పథకం కింద రైతుల పొలాల్లో వేసిన బోర్లను ఇందిర జలప్రభ రాష్ట్ర అసిస్టెంట్ డెరైక్టర్ జి.నీలారెడ్డి, సీనియర్ అసిస్టెంట్ భానుప్రసాద్ మంగళవారం పరిశీలించారు. మండల కేంద్రంలో సర్వే చేసి వెళ్లారు గానీ ఇప్పటివరకు సిబ్బంది రాలేదని రైతులు ఎలుగు ఆనంద్, రాజన్న అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై ఏపీడీ కృష్ణారావు, ఏపీవో జగ్దేరావులను ప్రశ్నించగా.. నీటి లభ్యత లేకపోవడంతో తిరస్కరించామని తెలిపారు. నీటి లభ్యత ఉన్నట్లు దరఖాస్తు చేస్తే తిరిగి సర్వే చేస్తామని పేర్కొన్నారు. నీలారెడ్డి, భానుప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గతంలో పదెకరాలకు ఒక బోరు వేశామని, ప్రస్తుతం ఐదెకరాలున్నా బోరు వేస్తామని తెలిపారు. మండలంలో ఎన్ని గ్రామాల్లో బోర్లు వేశారని ఏపీవోను అడిగి తెలుసుకున్నారు. కజ్జర్ల, లక్ష్మీపూర్, కుచులాపూర్, కప్పర్దేవి గ్రామాల్లో బోర్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. వారి వెంట టెక్నికల్ అసిస్టెంట్ లక్ష్మణ్, రవీందర్, పొచ్చన్న తదితరులు ఉన్నారు.