పంపిణీ ‘భూ’టకం!
Published Sat, Oct 19 2013 3:45 AM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ భూ పంపిణీ పథకం అస్తవ్యస్తంగా మారింది. ఇది ఉత్తి బూటకమని, ప్రచారమే తప్పా ప్రయోజనం ఉండడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. కాయకష్టం చేసి భూములను బాగుచేసుకుందామనుకున్నా అవకాశం లేకుండా పోతోందని వారు చెబుతున్నారు. కొండవారే, ఏటి ఒడ్డునో, తుప్పలు, డొంకలు మొలిచిన భూములను ఇచ్చి అధికారులు చేతులుదులుపుకొంటున్నారని, నీటి సదుపాయం కల్పించుకునేందుకు, ఇతర అవసరాలకు బ్యాంకులు అప్పులుకూడా ఇవ్వడం లేదని ఎస్సీ, ఎస్టీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు.
చాలా గ్రామాల్లో ఎస్సీలకు అప్పటికే ఎస్సీల సాగుబడిలో ఉన్న భూములకు పట్టాలిచ్చారు. చాలా మందికి పట్టాలైతే ఇచ్చారు గాని భూమి ఎక్కడుందో తెలియని పరిస్థితి. మరి కొందరి పొలాలు ఇప్పటికే బడాబాబుల చేతుల్లోనే ఉన్నాయి. రైతు సదస్సులు, రచ్చబండ కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను గుర్తిస్తున్నారే తప్పా ఈ ప్రక్రియ కోసం నియమించిన అసైన్‌మెంట్ కమిటీలు అసలు పనిచేయడం లేదు. పట్టాలు ఇస్తున్నప్పటికీ ఆ భూములు లబ్ధిదారుల చేతుల్లో ఉండడం లేదు. తమ వద్ద పట్టాలున్నప్పటికీ పెద్దల చేతుల్లో భూములు ఉన్నాయంటూ వస్తున్న ఫిర్యాదులకు పరిష్కారం లభించడం లేదు. దీంతో చాలా మంది ఎస్సీ, ఎస్టీలు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఇటువంటి ఫిర్యాదులు 120 వరకూ పెండింగ్‌లో ఉన్నాయి. ఎస్.కోట, బాడంగి, రామభద్రపురం,తెర్లాం మండలాల్లో మిగులు భూములు పంచి పెట్టాలని దశాబ్ద కాలంగా పోరాటాలు చేస్తున్నా అవి పేదలకు దక్కడం లేదు. భూమి లేని నిరుపేదలు లక్షల సంఖ్యలో ఉండగా కేవలం కొద్ది మందికి మాత్రమే భూమి పంపిణీ చేశారు. మరికొందరికి పట్టాలు ఇచ్చారు గాని... భూములు ఎక్కడ ఉన్నాయో వారికే తెలియని పరిస్థితి నెలకొంది. 2004 నుంచి 2009 సంవత్సరం వరకూ జరిగిన పంపిణీలో లబ్ధిదారులకు పట్టాలతో పాటూ భూములు అప్పగించారు. ఆ తరువాత పథకం చతికిలపడింది. ఇప్పటి వరకూ ఆరు విడతలుగా జరిగిన భూపంపిణీ కార్యక్రమంలో 23,442 మందికి 26,220 ఎకరాలు పంపిణీ చేశారు. వీరిలో 250 మందికి తమ భూములు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది.
పత్తాలేని కమిటీలు...
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో భూపంపిణీకి శ్రీకా రం చుట్టారు. గ్రామాల్లో ఉన్న మిగులు భూములను గుర్తించి వాటిని పేదలకు పంపిణీ చేసేందుకు వీలుగా అసైన్డ్ కమిటీలను నియమించారు. నియోజకవర్గ స్థాయిలో ఉండే ఈ కమిటీలు ప్రతి మూడు నెలలకోసారి సమావేశమవ్వాలి. ఈ కమిటీకి ఎమ్మెల్యే అధ్యక్షునిగా, ఆర్డీఓ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. స్థానిక తహశీల్దార్లు సభ్యులుగా ఉంటారు. షెడ్యూల్ ప్రకారం మండలాల వారీగా ఉన్న భూములను సమగ్రంగా పరిశీలించి ప్రభు త్వ, అసైన్డ్ భూములకు సంబంధించిన నివేదికలు సిద్ధం చేయాలి. అయితే ఆ కార్యక్రమాలు జిల్లాలో జరగడం లే దు. కేవలం ప్రభుత్వం భూపంపిణీకి తేదీలు నిర్ణయించిన త ర్వాత మాత్రమే తూతూమంత్రంగా కమిటీలు సమావేశమై మమా అనిపించేస్తున్నాయి. దీంతో సర్కారు లక్ష్యం నెరవేరడం లేదు.
మిగుల భూముల గుర్తింపెక్కడ....
భూపరిమితి చట్టం ప్రకారం ఒక వ్యక్తికి ఉండవలసిన దానికంటే అధికంగా భూమి ఉంటే దాన్ని అధికారులు స్వాధీనం చేసుకోవాలి. అయితే మిగులు భూములు గుర్తించేందుకు కనీసం సర్వేలు కూడా నిర్వహించడం లేదు. కొన్ని మండలాల్లో పరిమితికి మించి భూములున్నా వారిపై యంత్రాంగం దృష్టి సారించడం లేదు. దీంతో భూస్వాములు బినామీ పేర్లతో వందలాది ఎకరాలను అనుభవిస్తున్నారు. పరిమితికి మించి భూమి ఉన్నట్టు గుర్తిస్తే ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరను ఆభూమి యజమానికి చెల్లించాలి.
పట్టాల కోసం ఎదురు చూపులు....
విజయనగరం రెవెన్యూ డివిజన్‌లో 19 మండలాలకు గానూ 12 మండలాలు వుడా పరిధిలో ఉండడంతో అక్కడ భూపంపిణీ జరగడం లేదు. దీంతో ఎస్.కోట, కొత్తవలస, నెల్లిమర్ల, భోగాపురం, విజయనగరం తదితర మండలాల్లో వేలాది మంది పేదలు ఇళ్ల స్థలాల కోసం అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
7వ విడత భూపంపిణీకి సన్నద్ధం...
జిల్లాలో 7వ విడత భూపంపిణీకి అధికారులు సన్నద్ధమయ్యారు. 225 గ్రామాల్లో 4,403 ఎకరాల భూమిని గుర్తించారు. దీనికి గానూ 3,984 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. 875 గ్రామాల్లో ప్రభుత్వ మిగులు భూములు లేనట్లు అధికారులు నివేదించారు.
ఆ పట్టాల వల్ల లాభం లేదు...
నా పేరు హిమరిక నారాయణ. మాది కొమరాడ మండలం డంగభద్ర గ్రామం. మాకు ఆరో విడతలో భూ పంపిణీలో పట్టాలిచ్చారు. ఆ పట్టాలతో బ్యాంకులకు వెళ్తే రుణాలివ్వడం లేదు. సరికదా పట్టాలిచ్చిన భూములు సాగుకు సరిపడా ఆర్థిక శక్తి లేదు. ఏదో బాగున్న మూల పంటల సమయంలో డొంకా తుప్పలు బయలు చేసి, కందులో, వరో, జొన్నో ఏవో చిరుధాన్యాలు వేస్తాం. వర్షాలు అనుకూలిస్తే పంట. లేదంటే శ్రమ దండగే. ప్రభుత్వం పట్టాలిచ్చినా, ఇవ్వకపోయినా ఒకటే. ఏటా గిరిజనులు బాగు చేసుకుంటే భూములు. లేకుండా బీడే అవుతుంది. పట్టాలిచ్చిన భూమిలో నీటి సదుపాయం, ఆ భూమి చదును చేసే అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది.
శ్రమ తప్ప ప్రయోజనం లేదు...
నా పేరు పువ్వల పెద నారాయణ, మాది కొమరాడ కొత్తవలస గ్రామం. మాకు ఆరో విడత భూ పంపిణీలో పట్టాలిచ్చారు. ఆ భూ పంపిణీ అనేది ఉత్తి బూటకమే. తాత ముత్తాతల నుంచి డొంకా తుప్ప కొట్టిన మా భూములకే పట్టాలిచ్చారు. అయినా ఆ భూములేటి తిన్నగా ఉన్నాయా...? మొజ్జు, రాయి, రప్పలతో నిండిపోయాయి. కొంతమంది జీడి మొక్కలు వేశారు. కొంతమంది అలాగే బాగు చేసుకొని ఏదో పండించుకుందామంటే వర్షాలు సకాలంలో లేక అవీ దూరమవుతున్నాయి. పోనీ తుప్పా, డొంకలు కొట్టి సాగు చేయడానికి, పంటకు అనుకూలంగా మలచుకోడానికి సహాయం లేదు. మా చుట్టు ఉన్న వాటిని బాగు చేసుకుంటే వాటికే పట్టాలిచ్చారు. ఆ భూములు ఇలా తుప్పలు కొడితే మళ్లీ బలిచేస్తాయి. ఏటా శ్రమ పోవడమే తప్ప ప్రయోజనం లేదు.
Advertisement
Advertisement