ఎస్సీ, ఎస్టీలకు వ్యవసాయ యంత్రాలు
100 శాతం సబ్సిడీతో అందించాలని నిర్ణయం
వ్యవసాయ శాఖ మంత్రి పోచారం వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీతో వ్యవసాయ యంత్ర పరికరాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో భారత వ్యవసాయ పరిశోధన మండలి, వ్యవసాయ పని ముట్ల పరిశోధన విభాగం శుక్రవారం సంయుక్తంగా నిర్వహించిన వ్యవసాయ యాంత్రీకరణ దినోత్సవం, రైతు సదస్సులో మంత్రి మాట్లాడారు. దేశంలో యాంత్రీకరణకు అత్యధికంగా సబ్సిడీ ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనన్నారు. వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గి లాభాలు పొందాలంటే యాంత్రీకరణ అవసరమన్నారు. ఎక్కువమంది రైతులకు ప్రయోజనం కలిగించేందుకు యాంత్రీకరణ పథకాల నిబంధనలను సరళతరం చేశామన్నారు.
వచ్చే ఖరీఫ్‌కు వివిధ పంటలకు అవసరమైన 8 లక్షల క్వింటాళ్ల విత్తనాలు ముందస్తుగానే రైతులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే ఎరువులను కూడా బఫర్ స్టాక్ ఏర్పాటు చేశామన్నారు. కరువుకు సంబంధించి పెట్టుబడి రాయితీ కేంద్రం నుంచి సకాలంలో వచ్చినా రాకపోయినా వచ్చే ఖరీఫ్‌కు ముందే మే నెలలో రైతులకు పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 100 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కోచోట ఒక అసిస్టెంట్ డెరైక్టర్‌ను నియమిస్తున్నామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారధి, వ్యవసాయ వర్సిటీ ప్రత్యేకాధికారి డాక్టర్ వి.ప్రవీణ్‌రావు, పరిశోధన సంచాలకులు డాక్టర్ దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు డాక్టర్ ఎన్.వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు.