లక్షల్లో అవినీతి... వందల్లో రికవరీ  | Social Inspection Team Uncovers Corruption In The National Rural Employment Scheme | Sakshi
Sakshi News home page

లక్షల్లో అవినీతి... వందల్లో రికవరీ 

Published Tue, Jul 30 2019 11:07 AM | Last Updated on Tue, Jul 30 2019 11:07 AM

Social Inspection Team Uncovers Corruption In The National Rural Employment Scheme - Sakshi

ప్రజావేదికలో అధికారులను నిలదీస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు  

సాక్షి, సోమశిల: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో ఏడాది కాలంపాటు జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించి గ్రామీణ స్థాయిలో నిర్వహించిన సామాజిక తనిఖీ బృందం లక్షల్లో అవినీతిని వెలికితీస్తే చర్యలు చేపట్టాల్సిన అధికారులు మమ అంటూ వందల్లో రికవరీలు చూపుతూ తూతూ మంత్రంగా ప్రజావేదికను నిర్వహించారు. అధికారుల తీరుపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అనంతసాగరం మండలంలో గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఉపాధిహామీ పథకం కింద 3,686 అభివృద్ధి పనులను 24 పంచాయతీల్లో చేపట్టారు. ఇందుకు సంబంధించి రూ.1,00,5,38,311 నిధులు విడుదల చేశారు. పది రోజులుగా స్టేట్‌ ఉపాధిహామీ సామాజిక తనిఖీ మానిటరింగ్‌ అధికారి దుర్గమ్మ పర్యవేక్షణలో మండలంలోని అన్ని గ్రామాల్లో సామాజిక తనిఖీలు నిర్వహించి ఆయా గ్రామాల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి అవినీతిని వెలికితీశారు.

అనంతసాగరంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద సామాజిక తనిఖీ ప్రజావేదికను సోమవారం ఏర్పాటు చేశారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ అడిషనల్‌ పీడీ నాసర్‌రెడ్డి పర్యవేక్షణలో గ్రామ పంచాయతీ స్థాయిలో జరిగిన విచారణను ఆడిట్‌ బృందం వెల్లడించారు. సోమశిల నుంచి మొదలుపెట్టి అన్ని గ్రామాలకు రాత్రి వరకు కొనసాగుతున్నాయి.  ఉపాధిహామి పథకం కింద జరిగిన అభివృద్ధి పనుల వివరాలను ఆయా పనుల వద్ద బోర్డులు ఏర్పాటు చేసేందుకు ఆయా పంచాయతీల్లో బోర్డుల నిమిత్తం నగదు మళ్లించాల్సి ఉండగా మండలం మొత్తానికి ఒకే వ్యక్తి ఖాతాలో దాదాపు రూ.4 లక్షలు అప్పటి ఎంపీడీఓ ఐజాక్‌ ప్రవీణ్‌ మళ్లీంచడం ఏమిటంటూ మాజీ ఎంపీపీ కమతం శోభ అధికారులను ప్రశ్నించారు.

రసాభాస
ప్రజావేదికలో అమనిచిరువెళ్ల ఫీల్డ్‌ అసిస్టెంట్‌ అవినీతి అక్రమాలను తెలియచేసేందుకు అధిక సంఖ్యలో కూలీలు వచ్చి అధికారులకు వెల్లడించబోగా ఆయన వారించడంతో సభలో రసాభసా చోటు చేసుకుంది. కూలీలతో అసభ్యకరంగా మాట్లాడడంతోపాటు సొంత వాళ్లకు ఇష్టం వచ్చినంత కూలీలు వేస్తూ పనులకు రాకపోయినా వ్యాపారులు చేసుకునేవాళ్లకు కూడా ఉపాధి కూలీలుగా చిత్రీకరించడం, అవినీతిని ఆడిట్‌ బృందం వెల్లడి చేయగా అధికారులు అతనికి వంతు పాడడంతో ఒక్కసారి ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి సర్థుబాటు చేశారు. మాజీ సర్పంచ్‌ వనిపెంట రమణారెడ్డి, మాజీ ఎంపీపీ కమతం శోభలు గ్రామంలో జరుగుతున్న అవినీతిని నిగ్గుతేల్చాలంటూ పట్టుబట్టారు. దీంతో ఏపీడీ నాసరయ్య  మరో 10 రోజుల్లో గ్రామంలో  ప్రజావేదిక నిర్వహించి అందరికి న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇవ్వడంతో సభ సద్దుమణిగింది. అనంతసాగరం పంచాయతీలో పలు అవినీతి ఆరోపణలతోపాటు ఇరువురు ప్రభుత్వ ఉద్యోగులకు గృహ నిర్మాణశాఖ ద్వారా పక్కా ఇళ్లు మంజూరు చేసి ఉపాధి నిధులు మంజూరు చేయడం పట్ల మాజీ ఎంపీపీ అధికారులను నిలదీశారు.

దీంతోపాటు ఇంకుడుగుంతల నిర్మాణంలో కూడా ఉపాధి సిబ్బంది చేతివాటం ప్రదర్శించారని, వాటిపై అధికారులు చర్యలు చేపట్టకపోవడం ఏమిటంటూ నిలదీశారు. శంకరనగరంలో లక్షలాది రూపాయల ఉపాధి, పంచాయతీరాజ్, ఐకేపీ, గృహ నిర్మాణశాఖ ద్వారా నిధులు మంజూరయ్యాయని వాటిలో లక్షల రూపాయల అవినీతి జరిగిందంటూ గ్రామ వైఎస్సార్‌సీపీ నాయకుడు పార్లపల్లి రవికుమార్‌రెడ్డి అధికారులకు తెలియచేశారు. ఆడిట్‌ బృందం గ్రామంలో చేపట్టిన నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులు ఉపాధి సిబ్బందికి వత్తాసు పలుకుతున్నారని రవికుమార్‌రెడ్డి ధృజమెత్తారు. రాత్రి వరకు పలు గ్రామాల్లో జరిగిన ఆడిట్‌పై ప్రజావేదిక కొనసాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా డ్వామా విజిలెన్స్‌ అధికారి వెంకటేశ్వరరావు, ఏపిడి మృదుల ఆడిట్‌ బృందం కోనయ్య, లోకేష్, ఎంపీడీఓ మధుసూధన్, ఇతర మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement