హరితహారం మొక్కలు అగ్నికి ఆహుతి ...
Published Fri, May 5 2017 3:52 PM | Last Updated on Tue, Sep 5 2017 10:28 AM
సదాశివపేటరూరల్ : తీవ్ర కరువు, వర్షాలు పడకపోవడం సకల సమస్యలకు చెట్ల లేకపోవడమేనని గ్రహించిన సీఎం కేసీఆర్ హరితహారం అనే బహుత్తర కార్యక్రమానికి స్వీకారం చుట్టారు. కానీ మెదక్ జిల్లా సదాశివపేట రూరల్ మండల పరిధిలోని వెల్టూర్ గ్రామంలో కొందరు ఆకతాయిలు ఈ పథకానికి తూట్లు పొడుస్తున్నారు. వెల్టూర్ రోడ్డుకు ఇరువైపులా అటవీ శాఖ , మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో గత సంవత్సరం జూన్‌లో భారీ సంఖ్యలో మొక్కలను నాటారు. సీఎం కేసీఆర్ పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేకంగా దష్టిసారించడంతో అధికారులు, సిబ్బంది హరితహారం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని వెల్టూర్ రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటి వాటి చుట్టు కంచెను ఏర్పాటు చేశారు.
ఎరువులు వేసి, నీళ్లు పోసి మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోని పెంచిపోషించి పెద్దవిగా చేశారు. తీరా ఇప్పుడు మూడు సంవత్సరాల వయస్సు గల రోడ్డుకు ఒక వైపు నాటిన దాదాపు వంద పైచిలుకు మొక్కలు, మరో వైపు దాదాపు 300 పైచిలుకు మొక్కలు కొందరి ఆకతాయిల చిలిపిచేష్టల పనికి అగ్నికి ఆహుతయ్యాయి. వెల్టూర్ రోడ్డు ప్రారంభమయ్యే నుంచి వెల్టూర్ గ్రామం వరకు ఒక వైపు నాటిన మొక్కలకు నిప్పు అంటించడంతో అవి పూర్తిగా కాలిపోయాయి. పర్యావరణ పరిరక్షణతో పాటుగా వాతావరణ సమతుల్యతను కాపాడటానికి హరితహరం కార్యక్రమంతో కోట్ల రూపాయాలను వెచ్చించి కార్యక్రమాన్ని అమలు చేస్తుంటే కొందరు దుర్మార్గులు పథకాన్ని నీరు కారుస్తున్నారు.
మరో వైపు అధికారుల నిర్లక్ష్యం కూడా కారణంగా కనబడుతోంది. మొక్కలను నాటిన తర్వాత వాటి సంరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. హరితహారంపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అక్కడక్కడ మొక్కలు ఎండిపోవడం, పశువులు తినడం, కాలిపోవడం లాంటివి జరుగుతున్నాయని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు అగ్నికి ఆహుతి అయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను నాటి సంరక్షించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని ప్రజలు కోరుతున్నారు.
Advertisement
Advertisement