సర్కారీ నివేదికల డేంజర్‌ బెల్స్‌!! | Danger Bells to the State Govt Reports | Sakshi
Sakshi News home page

సర్కారీ నివేదికల డేంజర్‌ బెల్స్‌!!

Published Tue, Jan 29 2019 3:39 AM | Last Updated on Tue, Jan 29 2019 8:01 AM

Danger Bells to the State Govt Reports - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజల్లో సంతృప్తి శాతం పెరుగుతున్నట్లు సీఎం చంద్రబాబు చెబుతున్నా నిజానికి పెరుగుతోంది అసంతృప్తేనని రాష్ట్ర ప్రభుత్వ నివేదికలే వెల్లడిస్తుండటం గమనార్హం. అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగున్నరేళ్లలో ఆరుసార్లు జన్మభూమి–మా ఊరు కార్యక్రమాలను నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని ఖర్చు చేసిన టీడీపీ సర్కారు ప్రజల సమస్యలను తీర్చడంలో దారుణంగా విఫలమైనట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ నివేదిక స్పష్టం చేసింది. ఇళ్లు, ఇళ్ల జాగాలు, పింఛన్లు, రేషన్‌ కార్డుల కోసం ప్రజల నుంచి పదేపదే పెద్ద ఎత్తున విజ్ఞాపనలు అందినా దాదాపు సగం దరఖాస్తులను ప్రభుత్వం తిరస్కరించినట్లు వెల్లడైంది. అర్హులందరికీ మంజూరు చేసినట్లు ప్రభుత్వం చెబుతున్న మాటలన్నీ బూటకమేనని ఈ నివేదికను పరిశీలిస్తే వెల్లడవుతోంది. పేదల ఇళ్ల నిర్మాణంపై నాలుగున్నరేళ్లు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కేవలం ప్రచారార్భాటంతో కాలక్షేపం చేసిన చంద్రబాబు సర్కారు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇళ్ల నిర్మాణంతోపాటు రెవెన్యూలో ఏ సర్టిఫికెట్‌ కావాలన్నా లంచం ఇవ్వనిదే పని జరగడం లేదని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌లో వెల్లడైంది. పలు అంశాలపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతున్నట్లు తేలటం సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో చర్చనీయాంశమైంది.  



అర్హులుగా తేలినా ఇవ్వకుండా పెండింగ్‌లో... 
రాష్ట్రవ్యాప్తంగా పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు, రుణమాఫీ కోసం 87.37 లక్షల మందికిపైగా పడిగాపులు కాస్తున్నట్లు రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ నివేదిక బహిర్గతం చేసింది. పది అంశాలకు సంబంధించి 87.37 లక్షలకుపైగా దరఖాస్తులు అందగా ఏకంగా 37,49,043 దరఖాస్తులను తిరస్కరించినట్లు నివేదిక తెలిపింది. అర్హులుగా తేల్చినప్పటికీ మంజూరు చేయకుండా 49,16,423 దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచడం గమనార్హం. ఇళ్ల మంజూరు కోసం 28,44,510 మంది పేదలు దరఖాస్తు చేసుకోగా 12,66,817 అర్జీలను అర్హత లేదంటూ తిరస్కరించారు. మరో 2,283 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని, అర్హులుగా తేల్చినా మంజూరు చేయకుండా 15,75,410 దరఖాస్తులను ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచారని ఆర్టీజీఎస్‌ నివేదిక పేర్కొంది. ఇక ఇంటి జాగాల కోసం దరఖాస్తు చేసుకున్న 21,10,626 మంది పేదలు ప్రభుత్వం ఎప్పుడు కనికరిస్తుందా? అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుండగా ఏకంగా 13,50,727 లక్షల దరఖాస్తులను అర్హత లేదంటూ తిరస్కరించడం గమనార్హం. రేషన్‌కార్డులు, మంచినీటి సరఫరా, రుణమాఫీ, రహదారులతోపాటు రుణాలు కావాలంటూ ఎస్సీ కార్పొరేషన్‌కు లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.  

టీడీపీ ప్రజాప్రతినిధుల వసూళ్లు... 
పేదలకు ఇళ్ల మంజూరులో అధికార పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు భారీగా లంచాలు వసూలు చేస్తున్నారని సర్కారు ఆర్టీజీఎస్‌ సర్వేలో వెల్లడైంది. ఇంతవరకు బేస్‌మెంట్‌ బిల్లులు అందలేదని 63.98 శాతం మంది పేదలు తెలిపారు. వైఎస్సార్‌ జిల్లాలో ఏకంగా 83.33 శాతం మంది బేస్‌మెంట్‌ బిల్లులు అందలేదని పేర్కొన్నారు. విశాఖపట్టణం జిల్లాలో 78.13 శాతం మంది, కృష్ణా జిల్లాలో 86.67 శాతం, గుంటూరు జిల్లాలో 80 శాతం, ప్రకాశం జిల్లాలో 66.67 శాతం మంది బేస్‌మెంట్‌ బిల్లులు అందలేదని చెప్పారు. అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని 32.90 శాతం మంది చెప్పగా ప్రజాప్రతినిధులు 19.08 శాతం మంది అవినీతికి పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో అధికారులు 20 శాతం నుంచి 43 శాతం వరకు అవినీతికి పాల్పడుతున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు కొన్ని జిల్లాల్లో 19 శాతం నుంచి 50 శాతం వరకు అవినీతికి పాల్పడుతున్నట్లు వెల్లడించారు. ఇళ్ల మంజూరు పత్రాలు ఇవ్వడం లేదని 40 శాతం మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బేస్‌మెంట్‌ స్థాయితో పాటు రూఫ్‌ లెవల్‌ బిల్లులు, ఇటుకలకు సంబంధించి రూ.650 కోట్ల మేర బిల్లులు పేదలకు అందలేదని తేలింది.  

లంచం ఇవ్వనిదే పని కావట్లేదు! 
మీ–సేవ ద్వారా అన్నీ అందుబాటులోకి తెచ్చామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నట్లు రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ నివేదికలో వెల్లడైంది. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా రెవెన్యూ సిబ్బంది భూములను సర్వే చేయడం లేదని తెలిపారు. ధృవీకరణ పత్రం మంజూరుకు రెవెన్యూ సిబ్బంది తీవ్ర జాప్యం చేయడంతో పాటు లంచాలు తీసుకుంటున్నారని 54 శాతం మంది చెప్పారు. ఈబీసీ సర్టిఫికెట్‌ జారీకి తీవ్ర జాప్యం చేస్తున్నారని 67 శాతం మంది పేర్కొనగా, లంచాలు తీసుకుంటునా3్నరని 34 శాతం మంది స్పష్టం చేశారు. కుటుంబ సభ్యుని సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు తీవ్ర జాప్యం చేస్తున్నారని 60 శాతం మంది పేర్కొనగా 40 శాతం మంది లంచాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఆదాయ సర్టిఫికెట్‌ జారీకి తీవ్ర జాప్యం చేస్తున్నారని 70 శాతం మంది పేర్కొనగా 30 శాతం మంది లంచాలు తీసుకుంటున్నారని తెలిపారు. ల్యాండ్‌ మార్పిడి, ఓబీసీ సర్టిఫికెట్, పొజిషన్‌ సర్టిఫికెట్, ఎటువంటి ఆదాయం లేదని సరిఫికెట్‌ మంజూరుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా లంచాలు ఇవ్వకుండా రావడం లేదని వెల్లడైంది. అడంగల్‌ 1బి మంజూరుకు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపురం, విశాఖపట్టణం, కర్నూలు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నూటికి నూరు శాతం మంది రెవెన్యూ అధికారులు, సిబ్బంది లంచాలు తీసుకుంటున్నారని నివేదిక వెల్లడించడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement