ఇంటి పట్టాను చూపుతున్న మహేశ్వరరెడ్డి
సాక్షి నెట్‌వర్క్: బెలూన్లు ఎగురవేసేవారు.. మిఠాయిలు పంచేవారు.. పరస్పరం అభినందించుకునేవారు.. పట్టాలను పైకి చూపిస్తూ చేతులు జోడించేవారు.. జై జగన్ అంటూ ప్లకార్డులు పట్టుకున్నవారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోలు పట్టుకుని కృతజ్ఞతగా చూస్తున్నవారు.. వైఎస్సార్ జగనన్ననగర్ పేరుతో వేసిన ముగ్గులు.. ఎటు చూసినా కోలాహలమే. పండుగ వాతావరణమే. కొత్తబట్టలు ధరించి సంబరంగా స్థలాలు చూసుకుంటూ ‘ఈ స్థలం మాది..’ అనుకుంటూ భావోద్వేగంతో చెమ్మగిల్లిన కళ్లతో కనిపించినవారు లెక్కలేనంతమంది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టిన ‘నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు’ పథకంలో జరుగుతున్న పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంగళవారం 12వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కనిపించిన దృశ్యాలివి. అన్ని జిల్లాల్లోను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ఇంటిస్థల పట్టాలు, టిడ్కో ఇళ్ల పత్రాలు పంపిణీ చేశారు. పట్టాల పంపిణీ జరిగిన గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది.
అందరూ తమ ఇంట్లో శుభకార్యం అన్నట్లుగా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎవరెవరికి స్థలాలు వచ్చాయి, ఇళ్లు ఎంతమందికి మంజూరయ్యాయి.. అంటూ చర్చించుకోవడం కనిపించింది. భార్యాభర్తలు, పిల్లలతో కలిసి తమ స్థలం వద్ద ఫొటోలు తీసుకుంటూ ఆనందంగా కనిపించారు. కొందరు తమ స్థలాల్లో శంకుస్థాపన చేశారు. విజయనగరం జిల్లాలో 43,937 స్థలం పట్టాలు, ఇళ్ల పత్రాలు పంపిణీ చేశారు. విశాఖ జిల్లాలో 39,203 మందికి పట్టాలు, టిడ్కో ఇళ్ల పత్రాలు అందజేశారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, గుడివాడ అమర్‌నాథ్, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, పెట్ల ఉమాశంకర్‌గణేష్, యూవీ రమణమూర్తిరాజు, శెట్టి ఫాల్గుణ, వాసుపల్లి గణేష్‌కుమార్, తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు. కృష్ణాజిల్లాలో 35,124 పట్టాలు పంపిణీ చేశారు. మంత్రులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 22,968 పట్టాలు పంపిణీ చేశారు.
మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ, పినిపే విశ్వరూప్, ఎంపీ వంగా గీతా, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లాలో 11,743 మందికి, కర్నూలు జిల్లాలో 8,831 మందికి పట్టాలు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 8,649 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని, మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో 7,881 పట్టాలు అందజేశారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి హాజరయ్యారు. గుంటూరు జిల్లాలో 7,787 మందికి పట్టాలు పంపిణీ చేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 4,762 స్థలపట్టాలు, టిడ్కో ఇళ్ల పత్రాలు అందజేశారు. మంత్రులు అనిల్‌కుమార్‌యాదవ్, గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో 4,417 మందికి పట్టాలు పంపిణీ చేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో 3,776, శ్రీకాకుళం జిల్లాలో 3,357 మందికి పట్టాలు, ఇళ్ల పత్రాలు అందజేశారు.
సీఎంకు రుణపడి ఉంటాను
నేను దివ్యాంగుడిని. తల్లిదండ్రులు మృతి చెందడంతో పిన్నమ్మ ఇంట్లో ఉంటున్నా. సొంతిల్లు లేదు. తల్లిదండ్రులు ఉన్న సమయంలోనూ అద్దె ఇంట్లోనే ఉండేవాళ్లం. గతంలో పలుసార్లు ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక వలంటీర్ మా ఇంటికి వచ్చి స్థలం కోసం దరఖాస్తు చేయించాడు. ప్రస్తుతం ఇంటి పట్టా మంజూరు అయ్యింది. ఎట్టకేలకు సొంతింటి కల నెరవేరుతోంది. జగనన్నకు రుణపడి ఉంటాను.
– మహేశ్వరరెడ్డి, తుమ్మలపెంట, కొలిమిగుండ్ల మండలం, కర్నూలు జిల్లా
ఐదేళ్ల కల తీరింది
మా ఇద్దరిదీ నక్కలదిన్నె గ్రామమే. ఐదేళ్ల కిందట పెళ్లయింది. మేం ఇద్దరు పిల్లలతో పూరి గుడిసెలో నివాసం ఉంటున్నాం. ఇంటి స్థలం కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు మాకు ఇంటి స్థలంతోపాటు ఇల్లు కూడా మంజూరైంది. ఐదేళ్ల సొంతింటి కల నెరవేరుతోంది. స్థలం, ఇల్లు ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటాం.
– చిరంజీవి, నవీన దంపతులు, నక్కలదిన్నె, చాపాడు మండలం, వైఎస్సార్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment