లక్ష టిడ్కో ఇళ్లు పంపిణీ పూర్తి  | Distribution of one lakh Tidco houses completed | Sakshi
Sakshi News home page

లక్ష టిడ్కో ఇళ్లు పంపిణీ పూర్తి 

Published Wed, Feb 14 2024 4:54 AM | Last Updated on Wed, Feb 14 2024 4:54 AM

Distribution of one lakh Tidco houses completed - Sakshi

సాక్షి, అమరావతి: పట్టణ పేదలకూ సొంతింటి కలను నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ  లక్ష్యం మేరకు ఏపీ టౌన్‌షిప్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (ఏపీ టిడ్కో) ఇప్పటివరకూ లక్ష ఇళ్లను పేదలకు అందజేసింది. ఈనెల  22కల్లా మరో 25,456 ఇళ్లను అందించనుంది. ఇందులో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో నిర్మించిన 15,504 యూనిట్లను బుధవారం లబ్ధిదారులకు అందించేందుకు టిడ్కో అధికారులు ఏర్పాట్లుచేశారు.

ఇప్పటికే 35 పట్టణ స్థానిక సంస్థ (యూఎల్బీ)ల్లోని 66 ప్రాంతాల్లో నిర్మించిన 1,00,200 ఇళ్లను లబ్ధిదారులకు అందించగా, తాజాగా నెల్లూరు, అనంతరం సాలూరు 1,056, విజయనగరం 1,120, పెద్దాపురం 1,584, మచిలీపట్నం 2,304, చిత్తూరు 2,016, మదనపల్లి 1,872 టిడ్కో ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఖరారుచేశారు. ఈ మొత్తం ప్రక్రియ ముగియగానే 18 యూఎల్బీల్లో 24,812 యూని­ట్లను మార్చిలో లబ్ధి­దారులకు అందిస్తారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు ఫేజ్‌–1లో 1,51,298 టిడ్కో ఇళ్లు పూర్తిచేస్తారు.

ఇలా రాష్ట్రంలోని 88 పట్టణ స్థానిక సంస్థల పరిధి­లోని 163 ప్రాంతాల్లో జీ+3 విధానంలో 2,62,212 టిడ్కో ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. వీటిలో గత టీడీపీ ప్రభుత్వం నిరుపేదలపై మోపిన అధిక ధరలను పక్కనబెట్టి, సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 1,43,600 మంది నిరుపేదలకు ఉచితంగానే ఫ్లాట్ల­ను అందిస్తోంది. మరో 1,18,616 మంది తక్కు­­వ ఆదాయ వర్గాలకు గత ప్రభుత్వం మోపిన ఆర్థిక భారాన్ని సగం తగ్గించి ఇళ్లను కేటాయించింది. 

అన్ని వసతులతో ఆధునిక పట్టణ ఇళ్లు..
జీ+3 విధానంలో నిర్మంచిన టిడ్కో ఇళ్లకు తాగునీరు, డ్రైనేజీ, ఎస్టీపీ, విద్యుత్‌ సదుపాయం, రోడ్లు వంటి అన్ని వసతులను ప్రభుత్వం కల్పిస్తోంది. ఆ తర్వాతనే లబ్ధిదారులకు కేటాయిస్తున్నారు. ప్రస్తుతమున్న నగరాలు, పట్టణాలకు సమీపంలో అనువైన ప్రాంతాల్లో ఉన్న ఈ అపార్ట్‌మెంట్లు సరికొత్త పట్ట­ణా­లను తలపిస్తున్నాయి. గుడివాడ, నంద్యాల, కర్నూలు, నెల్లూరు యూఎల్బీల పరిధిలో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లు 10 వేల నుంచి 15 వేలకు పైగా ఉన్నాయి.

ఒక్క నెల్లూరు పరిధిలోనే (అల్లిపురం, వెంకటేశ్వరపురం) రెండుచోట్ల మొత్తం 27 వేల ఇళ్లు నిర్మిస్తుండగా, బుధవారం 15,504 యూనిట్లను అందిస్తున్నారు. గేటెడ్‌ కమ్యూనిటీలను తలపిస్తున్న ఈ 163 ప్రాంతాల్లోని నివాసాలకు ‘వైఎస్సార్‌ జగనన్న నగరాలు’గా నామకరణం చేసి, అంతర్గత నిర్వ­హణకు నివాసితులతో సంక్షేమ సంఘాలను సైతం ఏర్పాటుచేశారు. ఇక్కడి వారికి ఎలాంటి ఇబ్బ­ందిలేకుండా జగనన్న నగరాల్లో (టిడ్కో ఇళ్లు) పట్టణ స్వయం సహాయక సంఘాలు స్వయంగా నిర్వహిస్తున్న జగనన్న మహిళా మార్టులను మెప్మా ఏర్పాటుచేస్తోంది. 

లబ్ధిదారులకు జగన్‌ సర్కారు మేలు.. 
ఇదిలా ఉంటే.. సీఎం జగన్‌ ప్రభుత్వం మూడు కేట­­­­గిరీల్లో 2,62,216 టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఇందులో 300 చ.అ. విస్తీర్ణంలో 1,43,600 యూనిట్లు.. 365 చ.అ విస్తీర్ణంలో 44,304 యూనిట్లు.. 430 చ.అ విస్తీర్ణంలో 74,312 యూనిట్లు ఉన్నాయి. 300 చ.అ. ఇంటిని నిరుపేదలకు రూ.1కే కేటాయించి 1,43,600 మంది లబ్ధిదారులకు రూ.10,339 కోట్ల ప్రయోజనం చేకూర్చింది.

అలాగే, 365 చ.అ ఇళ్లలో 44,304 మంది లబ్ధిదారులు రూ.50 వేలు, 430 చ.అ. ఇళ్లలో 74,312 మంది లబ్ధిదారులు రూ.లక్ష చొప్పున వాటా చెల్లించాలని గత ప్రభుత్వం నిబంధన పెడితే, దాన్ని సగానికి తగ్గించడంతో పాటు వారు చెల్లించాల్సిన రూ.482.32 కోట్లను ప్రస్తుత ప్రభుత్వమే చెల్లించింది. రెండు, మూడు కేటగిరీల్లోని లబ్ధిదారులకు గత ధరల ప్రకారం రూ.10,797 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఆ మొత్తం రూ.4,590 కోట్లకు తగ్గిపోయింది.

మౌలిక సదుపాయాలకు సైతం గత సర్కారు రూ.306 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంటే జగన్‌ సర్కారు రూ.3,237 కోట్లతో సదుపాయాలు కల్పిస్తోంది. అంతేకాక.. రివర్స్‌ టెండరింగ్‌లో చ.అడుగు నిర్మాణ వ్యయాన్ని రూ.1,692కు తగ్గించడంతో పాటు, అన్ని పనుల్లోను దాదాపు రూ.4,368 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసింది. ఇక అన్ని కేటగిరీల ఇళ్ల లబ్ధిదారులకు సేల్‌డీడ్, స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులు, యూజర్‌ ఛార్జీలను మినహాయించడంతో లబ్ధిదారులు మొత్తంగా రూ.5,487.32 కోట్ల మేర లబ్ధిపొందారు. 

టిడ్కో ప్రాంగణాల్లో జేఎంఎం, కమ్యూనిటీ హాళ్లు 
మరోవైపు.. టిడ్కో నివాసాల వద్ద పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో పట్టణ మహిళా సంఘాలు విజయవంతంగా నిర్వహిస్తున్న జగనన్న మహిళా మార్టులను ఏర్పాటుచేయనున్నారు. వీటితో పాటు స్థానికుల అవసరాలకు అనుగుణంగా కమ్యూనిటీ హాళ్లను సైతం నిర్మిస్తున్నారు. తొలివిడతలో 21 యూఎల్బీల్లోని టిడ్కో నివా­సాల వద్ద వీటిని ఏర్పాటుచేయనున్నారు.

ఇందుకు ఇళ్ల ప్రాంగణాల్లో టిడ్కో విభాగం 1,000 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తోంది. ఇక్కడ 4 వేల చదరపు అడుగుల్లో రెండు అంతస్తుల్లో భవనాన్ని నిర్మించనున్నారు. మొదటి అంతస్తులో జగనన్న మహిళా మార్టు, రెండో అంతస్తులో కమ్యూనిటీ హాల్‌ అందుబాటులోకి తేనున్నారు. టిడ్కో నివాసితుల్లో అధిక శాతం మెప్మా సభ్యులే.

దాంతో అక్కడి వారికి ఉపాధితో పాటు ఆదాయ మార్గాలను కల్పించాలని ప్రభు­త్వం సంకల్పించింది. వీటి నిర్వహణను సైతం స్థానిక టిడ్కో నివాసితులు, స్వయం సహాయక సంఘాల సభ్యులకే అప్పగించనున్నారు. జేఎంఎం నిర్మాణానికి ఇప్పటికే విజయనగరంలో పనులు ప్రారంభించగా, మంగళవారం తాడిపత్రిలోను, బుధవారం నెల్లూరు, గురువారం మదనపల్లిలోను పనులు చేపట్టనున్నారు.

ఇళ్ల పేరిట పేదలను ముంచిన చంద్రబాబు..
ఇక టిడ్కో ప్రాజెక్టులో చంద్రబాబు ప్రభుత్వం 3,13,832 ఇళ్ల నిర్మాణం తలపెట్టింది. వీటిలో 2019 మే నాటికి 1,90,944 యూనిట్లు పునా­ది­స్థాయి దాటాయి. మరో 1,22,888 యూ­నిట్లు పునాదుల్లోనే మిగిలిపోయాయి. చ.అడుగు నిర్మాణ వ్యయాన్ని రూ.1,879గా నిర్ణయించడంతో పాటు 63,744 యూనిట్ల నిర్మాణానికి రూ.3,232 కోట్లు వ్యయాన్ని ఖరారుచేశారు.

అయితే, ఇందులో జరిగిన అక్రమాలను గుర్తించిన ప్రస్తుత జగన్‌ సర్కారు రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా నిర్మాణ వ్యయాన్ని రూ.2,840 కోట్లకు తగ్గించి రూ.392 కోట్ల ప్రజాధనం ఆదా చేసింది. పేదలు 300 చ.అ. ఇంటికి బాబు ప్రభుత్వం రూ.7.5 లక్షలు భారం మోపి, 20 ఏళ్లపాటు ప్రతి­నెలా వాయిదాలు కట్టాలని షరతుపెట్టి రూ.3,805 భారం మోపింది. అలాగే, 365 చ.అ. ఇంటికి రూ.50 వేలు, 430 చ.అ. ఇంటికి రూ.లక్ష వసూలు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement