కాజ గ్రామంలోని రైల్వే గేటు వద్ద లింగమనేని రమేష్ సతీమణి ఆ«దీనంలో ఉన్న పీర్ల మాన్యం భూమి
మంగళగిరి: రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఐజేఎం సంస్థ పేరుతో ప్రాచుర్యం పొందిన లింగమనేని రమేష్ చివరకు మైనార్టీల భూములనూ వదల్లేదు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ, చినకాకాని, నిడమర్రు గ్రామాల్లో ఐజేఎం లింగమనేని రియల్ ఎస్టేట్ పేరుతో అపార్ట్‌మెంట్లు, విల్లాలతో పాటు సుమారు 1,200 ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి. వాటిలో వందలాది ఎకరాల ప్రైవేటు భూములతో పాటు ప్రభుత్వ పోరంబోకు భూములు కూడా ఉన్నట్టు ఆరోపణలున్నాయి. తాజాగా పీర్ల మాన్యం భూములను లింగమనేని రమేష్ సతీమణి సుమన పేరిట ఉండటాన్ని గుర్తించిన అధికారులు నోటీసులు జారీ చేశారు.
కాజ గ్రామంలో రైల్వే గేటుకు అవతల, ఇవతల పీర్ల మాన్యం పేరుతో ఇనాం భూములు 11.25 ఎకరాలు ఉన్నాయి. పూర్వం దాతలు పీర్ల మాన్యం కింద అందజేసిన భూములను కౌలుకు ఇచ్చి.. వాటిపై వచ్చే ఆదాయంతో ముస్లింలు పీర్ల పండుగలను జరుపుకుంటారు. గ్రామంలో సర్వే నంబర్ 287/5లోని 2.06 ఎకరాలు లింగమనేని సుమన పేరున ఉన్నాయి. 287/1ఏ2, 287/1ఏ2ఏ, 287/1ఏ2బీ, 287/1ఏ2సీ, 287/1ఏ2డీ, 287/1బీ సర్వే నంబర్లలో మరో 9.19 పీర్ల మాన్యం భూములు ఉన్నాయి. అవన్నీ శ్యామల మల్లికార్జునరెడ్డి, సింహాద్రి నాగేశ్వరమ్మ, సింహాద్రి ప్రసాద్‌రెడ్డి, మెట్టు వెంకట కాశీ విశ్వనాథం, శ్యామల విజయలక్ష్మి, శ్యామల శ్రీనివాస్‌రెడ్డి, సింహాద్రి సామ్రాజ్యం, సింహాద్రి ప్రసాద్‌రెడ్డి, సింహాద్రి వెంకటరామారెడ్డి ఆ«దీనంలోకి మళ్లాయి. సదరు భూములను పీర్ల మాన్యం కౌలుకు మాత్రమే ఇచ్చి అనుభవించాల్సి ఉండగా భూములకు పట్టాలు, పాస్ పుస్తకాలు పుట్టించి విక్రయాలు జరిపారు. దానికి అప్పటి పీర్ల మేనేజర్ లావాదేవీలు నిర్వహించడం విశేషం.
ఎకరం రూ.3 కోట్లకు పైగా పలుకుతోంది. 2013 రెవెన్యూ చట్టం ప్రకారం భూములకు పట్టాలు ఉన్నా, పాస్ పుస్తకాలు ఉన్నా చెల్లవని, తిరిగి వక్ఫ్ బోర్డు స్వాదీనం చేసుకోవచ్చని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై తహసీల్దార్ జీవీ రాంప్రసాద్ వివరణ కోరగా.. ఆర్‌ఎస్‌ఆర్ ప్రకారం పీర్ల మాన్యం భూములు 11 ఎకరాలను గుర్తించి ఆ భూముల్లో ఉన్న యజమానులకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. నోటీసులు అందుకున్న వారు తమకు అనుకూలంగా కోర్టు తీర్పు ఉందని చెబుతున్నారన్నారు. కోర్టు తీర్పు ఉన్నా చట్ట ప్రకారం పీర్ల మాన్యం భూములు (ఇనాం భూములు) వక్ఫ్ బోర్డుకు చెందుతాయన్నారు. నోటీసులు జారీ చేసి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామని, విచారణ అనంతరం నిర్ణయం తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment