భూ‘దండు’ పాళ్యం బ్యాచ్–3
కర్త, కర్మ, క్రియ చంద్రబాబే..
అమరావతి భూ దోపిడీలో చినబాబూ సూత్రధారే
తెరవెనుక పాత్రధారులుగా బాబు అండ్ కో
బినామీ పేర్లతో పేదల భూములపై పచ్చదండు దాడి
రాజధాని లీక్స్‌తో రూ.2 లక్షల కోట్ల భూ దురాక్రమణ
నారాయణ, లింగమనేని, సుజనా, ప్రత్తిపాటి, ధూళిపాళ్ల దోపిడీ లీలలు.. కొమ్మాలపాటి, కోడెల,పయ్యావుల, మురళీ మోహన్‌ల భూ దందా
‘నా పరిశీలనకు వచ్చిన, తెలియవచ్చిన విషయాల్ని ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని చెబుతూ 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం కుర్చిలో కూర్చున్నాక.. కుట్రలు చేయడంలో, నమ్మిన ప్రజల్ని మోసగించడంలో సిద్ధ హస్తుడైనచంద్రబాబు ఆ ప్రమాణాన్ని నిస్సిగ్గుగా ఉల్లంఘించారు.
అత్యంత కీలకమైన రాజధాని రహస్యాన్ని ఎల్లో గ్యాంగ్‌కు లీక్ చేసి సీఎం పదవికే కళంకం తెచ్చారు. అంతర్జాతీయ రాజధాని అంటూ ప్రధానితో పాటు ప్రముఖుల్ని పిలిచి హడావుడి చేసినప్పుడు.. బాబు కుట్రల్ని జనం పసిగట్టలేకపోయారు. ఇదంతా పేదల అసైన్డ్ భూముల స్వాహాకు, ఇన్‌సైడర్ ట్రేడింగ్ కోసం చంద్రబాబు వేసిన ఎత్తులు, జిత్తులని అప్పుడు వారికి తెలియలేదు.
‘రాజధాని ఫైల్స్’ డ్రామాలో పేద రైతుల అసైన్డ్ భూములను బెదిరించి బినామీల రూపంలోసొంతం చేసుకుని కథ నడిపించారు. ఎవరికీ చెందని ప్రభుత్వ అసైన్డ్ భూములు తమ వారివే అంటూ రికార్డులు సృష్టించి స్వాహా చేశారు. తన పని పూర్తయ్యాక.. గ్రాఫిక్స్ రాజధాని కట్టలేక చేత్తులేత్తేసి ఎన్నికల ముందు కొత్త డ్రామాలు అందుకున్నారు. ఈ డ్రామాలో బాబు బృందంలోనిమంత్రులు, ఎమ్మెల్యేలు...ఆయనకు ఆప్తులు అందరూ పాత్రధారులే.. ‘చేసేది నువ్వు.. చేయించేది నేను..’ రాజధాని ఫైల్స్‌లో చంద్రబాబు డైలాగ్ ఇదే. తెరముందు రాజధాని రూపశిల్పి..
తెరవెనుక రాజధాని లీక్స్ సూత్రధారి. అసలు సూత్రధారులు చంద్రబాబు, లోకేశ్ కాగా.. పాత్రధారులు నారాయణ, లింగమనేని రమేష్, ప్రత్తిపాటి పుల్లారావు, సుజనా చౌదరి, వేమూరి రవికుమార్, మాగంటి మురళీ మోహన్, కొమ్మాలపాటి శ్రీధర్, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్‌పీ రామారావు ఇలా 1,336 మంది బినామీలున్నారు. అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్‌సైడర్ ట్రేడింగ్‌తో రూ.లక్షల కోట్ల భూ దందాకు తెగించారు.
అసైన్డ్ దోపిడీ, ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో 1,336 మంది బినామీ ‘బాబు’ల బాగోతం
సాక్షి, అమరావతి : అమరావతి భూదోపిడీకి కర్త, కర్మ, క్రియ చంద్రబాబే. అసైన్డ్ భూములు, ప్రైవేటు భూములు, క్విడ్ ప్రోకో భూములు, బంగ్లాలు.. ఇలా ఒకటేమిటి.. చంద్రబాబు అక్రమ సామ్రాజ్యంలో అన్నీ భాగమే. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో అక్రమాలతో క్విడ్ ప్రోకో ద్వారా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్‌కు 14 ఎకరాలు దక్కాయి. కృష్ణానది కరకట్ట మీద ఉన్న లింగమనేని బంగ్లా ఆయన పరమైంది.
ఎస్సీ, ఎస్టీ, రైతులను భయపెట్టి బినామీల పేరిట కొల్లగొట్టిన వందలాది ఎకరాలు చంద్రబాబు ఖాతాలోకే వెళ్లాయి. సింగపూర్ కంపెనీ పేరిట స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోని భూముల అసలు హక్కుదారూ చంద్రబాబు కుటుంబమే. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌కు ఇరువైపులా, అమరావతి సీడ్ క్యాపిటల్ పరిధి దాటి బినామీల పేరిట కొనుగోలు చేసిన దాదాపు 5 వేల ఎకరాల అసలు యజమాని చంద్రబాబు కుటుంబమే.
చినబాబుది పెద్ద వాటానే
అమరావతి భూ కుంభకోణంలో లోకేశ్‌ది పెద్ద వాటానే. తన బినామీ, ఎన్నారై వ్యవహారాల సలహాదారుగా వ్యవహరించిన వేమూరి రవికుమార్‌తో పాటు మరికొందరు బినామీల పేరిట వేలాది ఎకరాలు దక్కించుకున్నారు. వేమూరి రవికుమార్‌తోపాటు ఆయన భార్య అనూరాధ గోష్పాది గ్రీన్‌ఫీల్డ్స్ పేరిట అమరావతిలోని కోర్ క్యాపిటల్ ప్రాంతంలోనే 500 ఎకరాలకుపైగా స్వాహా చేశారు.
అవినీతి తిమింగలం లింగమనేని
అమరావతిలో అవినీతి తిమింగలం లింగమనేని రమేశ్. చంద్రబాబు భూ దోపిడీలో ఇతనూ ఒక ప్రధాన పాత్రధారి. ఆయన కుటుంబానికి చెందిన 355 ఎకరాలను ఆనుకునే ఇన్నర్ రింగ్ రోడ్డు నిరి్మంచేలా అలైన్‌మెంట్ ఖరారు చేశారు. తన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట కొనుగోలు చేసిన వందలాది ఎకరాలను భూ సమీకరణ ప్రక్రియ నుంచి తప్పించారు. అమరావతిలో దాదాపు వెయ్యికి పైగా ఎకరాలు లింగమనేని హస్తగతం చేసుకున్నారు.
నారాయణ తంత్రం.. సుజనా, ప్రత్తిపాటి భూదందా
చంద్రబాబు తరువాత అమరావతి భూ దోపిడీలో రెండో పెద్ద దోపిడీదారు నారాయణ. లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కో లో ప్రధాన పాత్రధారు. కృష్ణా నదికి ఇటువైపు.. అటువైపు, కృష్ణా జిల్లా పరిధిలో ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్‌మెంట్‌కు దగ్గరలో వేలాది ఎకరాలు కొనుగోలు చేశారు. అక్కడ నారాయణ విద్యా సంస్థల భూములు ఉన్నాయి. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తన ఉద్యోగులను బినామీలుగా చేసి 162 ఎకరాల అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్నారు.
అసైన్డ్, ప్రైవేటు భూములు కలిపి దాదాపు 3 వేల ఎకరాల వరకు బినామీల పేరిట గుప్పిట పట్టారు. నారాయణ బినామీ కంపెనీ రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్‌ది అమరావతి భూ కుంభకోణంలో కీలక పాత్ర. అసైన్డ్ భూముల దోపిడీలో ఆ కంపెనీ ఎండీ అంజనీకుమార్ కీలకంగా వ్యవహరించారు. అమరావతిలో దాదాపు 2 వేల ఎకరాలను బినామీలు, ఉద్యోగుల పేరిట రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ కొల్లగొట్టింది.
చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు సుజనా చౌదరి అమరావతి భూ దోపిడీలో అతిపెద్ద వాటాదారు. ఆయన తన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఏకంగా 700 ఎకరాల వరకు కొల్లగొట్టారు. అమరావతి భూదోపిడీలో బినామీల పేరిట అసైన్డ్ భూములతో సహా 196 ఎకరాలు దోచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment