రాజధానిని మింగేసిన బాబు భూదందా | Babu benami land mafia organized in Amaravati | Sakshi
Sakshi News home page

రాజధానిని మింగేసిన బాబు భూదందా

Published Sun, Apr 14 2024 5:58 AM | Last Updated on Sun, Apr 14 2024 5:58 AM

Babu benami land mafia organized in Amaravati - Sakshi

అదిగో రాజధానిఅంటూ లీకులిచ్చిఅరచేతిలో వైకుంఠం  

అమరావతిలో బాబు బినామీల భూ మాఫియా వ్యవస్థీకృతం  

అంతర్జాతీయ స్థాయి రాజధాని.. ఆకాశ హర్మ్యాల నగరం అంటూ గాలిలో మేడలు  

రైతుల కాళ్ల కిందున్న భూమి కంపించేలా ఎత్తులు పైఎత్తులు 

బరితెగించి ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద భూ దోపిడీ.. రాజధాని ప్రచారం పేరిట భూ మాయాజాలం  

భూసమీకరణ ముసుగులో  అసైన్డ్, ప్రభుత్వ, ప్రైవేట్, లంక భూముల దురాక్రమణ  ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు పేరిట అవినీతి మలుపులు   

సింగపూర్‌తో ఒప్పందం పేరిట బురిడీ..స్విస్‌ చాలెంజ్‌ ముసుగులో దోపిడీ అస్మదీయులకు యథేచ్ఛగా భూ పందేరాలు  

పచ్చ దండు దండ యాత్రతో ఏకంగారూ.2 లక్షల కోట్ల విలువైన భూముల దురాక్రమణ  

అన్యాయంగా విభజనకు గురై కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికీ బాబు వెన్నుపోటు..  

బాబు అండ్‌ గ్యాంగ్‌ మోసాలకు ఎల్లో మీడియా వెన్నుదన్ను.. ఇదంతా గుర్తించే 2019 ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టిన జనం  

అయినా బుద్ధి తెచ్చుకోకఅక్రమాలను సమర్థించుకునేందుకువిఫలయత్నం

సినిమా క్లైమాక్స్‌లో విలన్‌ తన ఆచూకీని హీరోకు చెప్పే ముందు ముప్పుతిప్పలు పెడుతుంటాడు.. ఇక్కడున్నాను.. అబ్బే.. మరోచోట ఉన్నానంటూ కన్ఫ్యూజ్‌ చేస్తుంటాడు.. చంద్రబాబు తీరు కూడా అచ్చం ఇలానే ఉంది. అమరావతిని రాజధానిగా ప్రకటించే ముందు ఈ పెద్దమనిషి కూడా రాష్ట్ర ప్రజానీకంతో ఓ ఆట ఆడుకున్నాడు. ఈ ఆటలో ఎక్కువగా నష్టపోయింది బాబు మాయాజాలం తెలియని సామాన్య రియల్టర్లు, ప్రజలే.

అదిగో అక్కడే రాజధాని.. అరెరె కాదు కాదు.. దొనకొండ.. అబ్బే అక్కడా కాదు.. నూజివీడు..తూచ్‌.. అక్కడొద్దన్నారు.. ఏలూరు సమీపంలో పెడుతున్నాం..లేదు నాగార్జున యూనివర్సిటీ వద్ద అయితే మేలు.. అక్కడే ఫిక్స్‌.. ఇలా తన ఎల్లో మీడియాకు రోజుకో లీకు ఇచ్చి కథనాలు రాయించారు.. చివరికి లోపాయికారీగా తన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి బ్రోచర్‌ సిద్ధం చేసుకుని.. మన రాజధాని ‘అమరావతి’ అంటూ బాంబు పేల్చారు.. బాబు అండ్‌ గ్యాంగ్, ఆయన వంది మాగధులంతా సూపర్‌.. డూపర్‌.. అంటూ కీర్తనలు ఆలపిస్తూ భజనలు చేయసాగారు..

ఇదంతా బాబు అండ్‌ కోకు మాత్రమే వినోదం. రాజధాని ఎక్కడ ఏర్పాటవుతుందో వారికి ముందే తెలుసు కనుక, వారు ముందస్తుగా అమరావతి చుట్టుపక్కల భూములను కొనేశారు. అదీ రూ.2 లక్షల కోట్ల విలువైన భూములపై పచ్చదండు భూ దండయాత్ర చేసింది. చంద్రబాబు కుట్రలు గ్రహించలేని రియల్టర్లు దారుణంగా మోసపోయి, కోట్లకు కోట్లు నష్టపోయారు. కొందరి జీవితాలు విషాదాంతంగా మిగిలాయి. బాబు అండ్‌ కో మాత్రం తమ పాచిక పారినందుకు.. రూ.లక్షల కోట్ల భూములను చౌకగా కొట్టేయగలిగినందుకు పగలబడి నవ్వుకుంటూ డబ్బులు లెక్కబెట్టుకునే పనిలో బిజీ అయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్ని రకాలుగా భూ దోపిడీకి పాల్పడవచ్చో ప్రపంచానికి చాటారు. 

శ్రీకృష్ణ కమిషన్, శివరామకృష్ణన్‌ కమిటీ సూచనలను బుట్టదాఖలు చేశారు. స్విస్‌ చాలెంజింగ్‌ విధానం అంటూ ఊడ్చేశారు. సినిమా సెట్టింగుల్లో పేరుగాంచిన దర్శకుడు రాజమౌళిని రప్పించి ఇదిగిదిగో రాజధాని అంటూ గ్రాఫిక్స్‌తో మాయ చేశారు. మిడతల దండు దాడి చేసి పచ్చని పంటలను నాశనం చేసినట్టు చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, నాటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు, టీడీపీ నేతలు, వారి బినామీలు అమరావతి భూములపై దాడికి  తెగబడ్డారు.

చంద్రబాబు, లోకేశ్‌లతో పాటు టీడీపీ నేతలు, నారాయణ, సుజనా చౌదరి, ప్రత్తిపాటి పుల్లారావు, మాగంటి మురళీ మోహన్, కొమ్మాలపాటి శ్రీధర్, కోడెల శివ ప్రసాద్‌ కుమారుడు శివరామకృష్ణ, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్‌పీ రామారావులతో కూడిన పచ్చ దండు భూములను కొల్లగొట్టింది. రాజధాని విషయంలో నాడు బాబు అండ్‌ గ్యాంగ్‌ ఎంత అరాచకంగా, దుర్మార్గంగా, అశాస్త్రీయంగా వ్యవహరించిందో గుర్తు చేస్తూ ఆ బాగోతాలను రేపటి నుంచి ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement