సాక్షి, అమరావతి: అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం కేసు తీగ లాగితే నారా, నారాయణ నల్లధనం నెట్‌వర్క్ బట్టబయలైంది. అమరావతిలోని బడుగు, బలహీనవర్గాల అసైన్డ్ రైతులను బెదిరించి వారి భూములు కొల్లగొట్టడం కోసం నల్లధనం తరలించేందుకు చంద్రబాబు ముఠా పన్నిన పన్నాగం బయటపడింది. బంధువులు, బినామీలు, సన్నిహితులు, తమ ఉద్యోగుల పేరిట అసైన్డ్ భూములు హస్తగతం చేసుకునేందుకు వెచ్చించిన నల్లధనం గుట్టు రట్టయింది.
అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆ నల్లధనం నెట్వర్క్ను ఛేదించింది. అసైన్డ్ భూముల జాబితాలోని కేటగిరీ 1 నుంచి 4 వరకు ఉన్న 617.65 ఎకరాలను కొట్టేసేందుకు ఏర్పాటు చేసుకున్న ‘నల్ల’మార్గాన్ని ఆధారాలతోసహా బట్టబయలు చేసింది. బినామీల పేరిట అసైన్డ్ భూములు కొల్లగొట్టిన ముఠా జాబితా తవ్వుతుంటే.. చంద్రబాబు, లోకేశ్, నారాయణ, గంటా, ప్రత్తిపాటి, దేవినేని ఉమా ఇలా టీడీపీ పెద్దల పేర్లు బయటపడుతున్నాయి.
నల్లధనం కోసం కంపెనీ ఏర్పాటు
నారాయణ విద్యా సంస్థలకు మౌలిక వసతుల కల్పన, ఉద్యోగుల జీతాల చెల్లింపు కోసమని ‘ఎన్‌స్పైర మేనేజ్‌మెంట్ సర్వీసెస్’ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. అసైన్డ్ భూములు కొల్లగొట్టడం కోసమే నారాయణ కుమార్తె సింధూర, అల్లుడు పునీత్ డైరెక్టర్లుగా ఎన్‌స్పైర కంపెనీని నెలకొల్పారు. నారాయణ విద్యా సంస్థలకు అన్ని రకాల చెల్లింపులు నిర్వహిస్తున్నందుకు ఎన్‌స్పైరకు 10 శాతం కమిషన్ చెల్లిస్తున్నట్లు రికార్డుల్లో చూపారు. ఇదే అవకాశంగా ఎన్‌స్పైరలోకి ఇతర సంస్థల నుంచి భారీగా నిధులు మళ్లించారు.
ఎన్‌స్పైరలో ఇతర కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టినట్లు చూపడం గమనార్హం. ఒలంపస్ క్యాపిటల్ ఏషియా క్రెడిట్ అండ్ సీఎక్స్ పార్టనర్స్ మ్యాగజైన్ అనే కంపెనీ 2016లో ఏకంగా రూ. 400 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు చూపించారు. ఇక 2018లో మోర్గాన్ స్టాన్లీ ప్రైవేట్ ఈక్విటీ ఏషియా, బన్యాన్ ట్రీ గ్రోత్ క్యాపిటల్ అనే సంస్థలు 75 మిలియన్ డాలర్లు (రూ. 613.27 కోట్లు) పెట్టుబడి పెట్టినట్టు రికార్డుల్లో చూపారు. దీంతో రెండు విడతల్లో ఎన్‌స్పైర కంపెనీలోకి రూ.1,013.27 కోట్లు వచ్చి చేరాయి. ఇలా భారీగా నల్లధనాన్ని ఎన్‌స్పైరలోకి మళ్లించినట్లు తెలుస్తోంది.
ఎన్‌స్పైర టు రామకృష్ణ హౌసింగ్
నారాయణ సమీప బంధువు కేవీపీ అంజని కుమార్ రంగంలోకి వచ్చారు. ఆయన మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ను నల్లధనం తరలింపునకు మార్గంగా చేసుకున్నారు. అక్రమ నిధులను ఎన్‌స్పైర నుంచి రామకృష్ణ హౌసింగ్ కార్పొరేషన్ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారు. అప్పటికే నారాయణ విద్యా సంస్థల సిబ్బంది, మరికొందరిని తమ బినామీలుగా ఎంపిక చేసుకున్నారు.
రామకృష్ణ హౌసింగ్ బ్యాంకు ఖాతాల నుంచి ఆ బినామీల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి నిధులను మళ్లించారు. వారు ఆ నగదు డ్రా చేసుకున్నారు. ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వకుండా అసైన్డ్ భూములను తీసుకుంటుందని బడుగు, బలహీనవర్గాల రైతులను అప్పటికే భయపెట్టారు. తద్వారా ఆ రైతుల అసైన్డ్ భూములను తమ బినామీలైన ఉద్యోగులు, ఇతరులకు అతి తక్కువకు విక్రయించేలా కథ నడిపించారు.
నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములు తమ బినామీల ద్వారా హస్తగతం చేసుకున్నారు. తర్వాత బినామీలే సీఆర్‌డీఏకు ఆ భూములను ఇచ్చినట్టు చూపించి వారికే భూసమీకరణ ప్యాకేజీ వచ్చేలా చేశారు. ఆ విధంగా 617.65 ఎకరాలకు గాను రూ. 3,737 కోట్ల విలువైన భూసమీకరణ ప్యాకేజీ స్థలాలను పొందారు.
జీపీఏ, సేల్‌డీడ్‌ల ద్వారా హస్తగతం
కేటగిరీ 1 నుంచి 4 వరకు 617.65 ఎకరాలకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో ఉన్న అసైన్డ్ రైతుల జాబితా, సీఆర్‌డీఏ రికార్డుల్లో ఉన్న రైతుల పేర్లను పరిశీలిస్తే అక్రమాల బాగోతం బయటపడుతోంది. ఈ జాబితాలో చంద్రబాబు, నారాయణ, గంటా శ్రీనివాసరావు, వారి సన్నిహితులు, బంధువులు, బినామీలే బయటపడుతున్నారు.
అమరావతి పరిధిలోని అనంతవరం, కృష్ణాయపాలెం, కురగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కల్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెం, బోరుపాలెం, నేలపాడు తదితర గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు చెందిన 617.65 ఎకరాల అసైన్డ్ భూములను జీపీఏ, సేల్ డీడ్లు ద్వారా హస్తగతం చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల నుంచి అసైన్డ్ భూములను బినామీల ద్వారా కొల్లగొట్టిన టీడీపీ పెద్దలు
♦ నారా చంద్రబాబునాయుడు (టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి)
♦ నారా లోకేశ్ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి)
♦ పొంగూరు నారాయణ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి)
♦ గంటా శ్రీనివాసరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి)
♦ దేవినేని ఉమామహేశ్వరరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి)
♦ ప్రత్తిపాటి పుల్లారావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి)
♦ రావెల కిశోర్ బాబు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి)
♦ తెనాలి శ్రావణ్ కుమార్ (టీడీపీ మాజీ ఎమ్మెల్యే)
♦ గుమ్మడి సురేశ్ (టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వియ్యంకుడు)
♦ మండల ఎస్.ఎస్.కోటేశ్వరరావు (రియల్టర్)
♦ మండల రాజేంద్ర (రియల్టర్)
♦ కేవీపీ అంజనీ కుమార్ (రియల్టర్)
♦ దేవినేని రమేశ్ (రియల్టర్)
♦ బొబ్బ హరిశ్చంద్ర ప్రసాద్ (రియల్టర్)
♦ హరేంద్రనాథ్ చౌదరి (రియల్టర్)
♦ పొట్లూరి సాయిబాబు (సిటీ కేబుల్)
♦ దోనేపూడి దుర్గా ప్రసాద్ (రియల్టర్)
రూ.16 కోట్లతో.. రూ. 816 కోట్లు కొట్టేసిన నారాయణ
రాజధానిలో నారాయణ బంధువులు, బినామీల పేరిట 148 ఎకరాలు ఉన్నట్టుగా సిట్ దర్యాప్తులో వెల్లడైంది. అందుకోసం నారాయణ రూ.16.50 కోట్లను అక్రమంగా తరలించారు. అందుకు ప్రతిగా 148 ఎకరాలను పొందారు. ఆ 148 ఎకరాలకు సీఆర్‌డీఏ భూసమీకరణ కింద ఇచ్చింది రూ.816 కోట్లు విలువైన స్థలాల ప్యాకేజీ. ఆ భూములకు పదేళ్లపాటు కౌలు కూడా పొందగలుగుతారు.
బినామీ రైతులకు సీఆర్‌డీఏ ఇప్పటికే చెల్లించిన కౌలు మొత్తం రూ. 50 లక్షలు మళ్లీ రామకృష్ణ హౌసింగ్ బ్యాంకు ఖాతాలో జమ చేశారు. అక్కడ నుంచి ఆ మొత్తాన్ని మళ్లీ నారాయణ విద్యా సంస్థల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయడం గమనార్హం. అంటే అసైన్డ్ భూములు దక్కించుకుంది నారాయణే అన్నది స్పష్టమైంది. అదే రీతిలో చంద్రబాబు, గంటా, ప్రత్తిపాటి, దేవినేని ఉమా, ఇతర టీడీపీ పెద్దలు, వారి బంధువులు బినామీల ద్వారా 617 ఎకరాల్లో ఎంత భారీ దోపిడీకి పాల్పడ్డారో స్పష్టమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment