సిరిసిల్లలో పోడుభూముల పట్టా పంపిణీ చేస్తున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే రమేశ్‌బాబు
సిరిసిల్ల: సమాజంలో అణచివేతకు గురై, అట్టడుగున ఉన్న దళితులను ధనికులను చేసే లక్ష్యంతో దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం రాష్ట్ర ఎస్సీ, గిరిజన, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి పోడుభూములకు పట్టాలు, ఎస్సీ చిరువ్యాపారులకు ఆర్థిక సాయం అందించారు.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దళితబంధులో తొలి విడతలో ప్రతి నియోజ కవర్గానికి 100 కుటుంబాలకు అందించామని, విప్లవాత్మక మార్పులు వచ్చాయని అన్నారు. రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 1100 యూనిట్లు అందిస్తామని తెలిపారు. ఏ పార్టీ వారైనా అందరికీ దళితబంధు ఇస్తామన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ధనికులు ఏ నీళ్లు తాగుతారో.. వీర్నపల్లి తండాలోనూ అవే నీళ్లు తాగేలా ఇంటి ముందు నల్లా పెట్టి నీళ్లు అందిస్తున్నామన్నారు.
కొమురం భీమ్ స్ఫూర్తితో జల్, జమీన్, జంగల్ నినాదాలతో నీళ్లు సాధించి, పోడుభూములకు పట్టాలిచ్చి, కొత్తగా 5 లక్షల ఎకరాల్లో 8 శాతం పచ్చదనాన్ని పెంచామన్నారు. 70 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం 9 ఏళ్లలో చేసి చూపించామని, తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని కేటీఆర్ వివరించారు. రైతులకు బీమా చేయిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే అన్నారు. సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికి మోడల్‌గా మారిందని రాష్ట్ర ఎస్సీ, గిరిజన, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
వ్యవసాయ కాలేజీకి బాబూ జగ్జీవన్‌రామ్ పేరు
తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వ్యవసాయ కళాశాలకు బాబూ జగ్జీవన్‌రామ్ కళాశాలగా నామకరణం చేశారు. ఆయన వర్ధంతి సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని మంత్రులు ఆవిష్కరించారు. 128 మంది ఎస్సీ చిరువ్యాపారులకు రూ.62 లక్షల మేరకు ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేశారు. జిల్లాలో 1,614 మంది గిరిజనులకు 2,558.34 ఎకరాల పోడు భూములకు పట్టాలను అందించారు. జెడ్పీ చైర్‌పర్సన్ అరుణ, వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు, కలెక్టర్ అనురాగ్ జయంతి, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment