సాక్షి, హైదరాబాద్: దేశంలోనే గొప్ప లౌకిక రాష్ట్రంగా తెలంగాణ ముందుకెళ్తోందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కె.తారకరామారావు అన్నారు. అభివృద్ధి, సంక్షేమంతోపాటు పలు అంశాల్లో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ యజ్ఞయాగాలు చేస్తున్నా, యాదాద్రి ఆలయాన్ని గొప్పగా నిర్మిస్తున్నా, అన్ని కులాలు, మతాలు, వర్గాలపట్ల ఏ మాత్రం వివక్ష కనబర్చకుండా సమదృష్టితో ముందుకు సాగుతున్నారని అన్నారు.
పలువురు క్రిస్టియన్ ప్రముఖులు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ నాయకత్వంలో మంగళవారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఏడున్నరేళ్ల ఈ చిన్న రాష్ట్రంలో శాంతిభద్రతలు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, వాతావరణంపట్ల ఆకర్షితులైన పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని వివరించారు.
కేంద్ర ప్రభుత్వం పైసా నిధులివ్వకుండా, కేవలం మాటలు, ప్రశంసలతోనే కాలం వెళ్లదీయడమేకాకుండా పలు విషయాల్లో అడ్డుతగులుతోందని విమర్శించారు. కేటీఆర్‌ను కలిసినవారిలో ఎమ్మెల్యేలు డాక్టర్ టి.రాజయ్య, స్టీఫెన్‌సన్, ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్‌రావు, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, ఫుడ్ కమిషన్ సభ్యుడు ఆనంద్, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎం.డి. కాంతివెస్లీ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment