ప్రతిపక్ష కుటిల రాజకీయాల వల్ల పేదల ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం న్యాయ పోరాటం చేయాల్సి వస్తోంది. పెద్ద పారిశ్రామిక వేత్తలకు ఎకరాలకు ఎకరాలు కట్టబెట్టారు. కానీ ఇప్పుడు పేదలకు సెంటు, సెంటున్నర స్ధలం ఇస్తామంటే అడ్డుకుంటున్నారు. ఈ యుద్ధంలో గెలుస్తాం. దేవుడు మనకు అండగా ఉంటాడు. ఇది చాలా గొప్ప కార్యక్రమం.
గ్రామీణ ఇళ్లకు సంబంధించి చంద్రబాబు వదిలి పెట్టి పోయిన బకాయిలు రూ.1,432 కోట్లు ఉన్నాయి. అందులో ఈ వారంలో సుమారు రూ.470 కోట్లు విడుదల చేయబోతున్నాం. ఆ తర్వాత మిగిలిన రూ.962 కోట్లు డిసెంబర్ 25న బటన్ నొక్కి విడుదల చేస్తాం.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని డిసెంబర్ 25వ తేదీన ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కోర్టు స్టేలు ఉన్న చోట మినహా, మిగతా అన్ని చోట్ల ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులందరికీ డి–ఫామ్ పట్టా ఇచ్చి, ఇంటి స్థలం కేటాయించాలని స్పష్టం చేశారు. పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ ఏర్పాట్లు, ఇళ్ల నిర్మాణాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలకు మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అదే రోజు (డిసెంబర్ 25) తొలి దశలో దాదాపు 15.10 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 30,68,281 మంది లబ్ధిదారులను ఇళ్ల స్థలాల కోసం గుర్తించామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల నుంచే ఈ కార్యక్రమం మొదలు పెట్టామని, గిట్టని వాళ్లు కోర్టులకు వెళ్లి.. పేదలకు ఇంటి స్థలం ఇవ్వకుండా రాజకీయం చేస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ ఇంకా ఏం చెప్పారంటే..
స్పందన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు, అధికారులు
కుటిల రాజకీయం
► తొలుత మార్చి 25న ఉగాది రోజు పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలనుకున్నాం. ప్రతిపక్షం రాజకీయంతో వాయిదా పడింది. ఆ తర్వాత ఏప్రిల్ 14 అంబేడ్కర్ జయంతి రోజున, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా మే 30న, దివంగత నేత వైఎస్సార్ జయంతి రోజు జూలై 8న, ఆ తర్వాత ఆగస్టు 15న, చివరగా అక్టోబరు 2 గాంధీ జయంతి రోజున అనుకున్నా వాయిదా పడుతూ వచ్చింది.
► ఇళ్ల స్థలాల కోసం 66,518 ఎకరాలు సేకరించాం. వాటి మార్కెట్ విలువ రూ.23 వేల కోట్లు. మొత్తం 30,68,821 మంది పేదలకు డిసెంబర్ 25న పంచబోతున్నాం.
కొత్తగా 1.20 లక్షల మందికి..
► దరఖాస్తు చేసుకుంటే అర్హులకు 90 రోజుల్లో ఇస్తామన్నాం. ఆ మేరకు 1.20 లక్షల మందిని కొత్తగా జాబితాలో చేర్చాం. ఇందులో 80 వేల మంది కోసం కొత్తగా భూసేకరణ చేయాల్సి ఉంది. కాబట్టి వేగంగా ఆ పని చేయండి.
► డిసెంబర్ 10వ తేదీ లోగా భూసేకరణతో పాటు, ప్లాట్ల గుర్తింపు 100 శాతం పూర్తి కావాలి. అర్హులైన లబ్ధిదారులు ఇంకా ఎక్కడైనా మిగిలిపోతే, వారినీ కొత్త జాబితాలో చేర్చాలి. వచ్చే నెల 25న ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే నాటికి ఇంటి నిర్మాణాలకు సంబంధించిన లబ్ధిదారుల జియో ట్యాగింగ్ పూర్తి కావాలి.
► పథకాన్ని అమలు చేసేందుకు ఆ రోజు నాటికి కలెక్టర్లు సిద్ధంగా ఉండాలి. కోర్టు స్టేలు ఉన్న చోట వాటిని వెకేట్ చేయించుకునేలా కలెక్టర్లు గట్టి ప్రయత్నం చేయాలి.
సచివాలయాల పాత్ర
► ఇళ్ల నిర్మాణంలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలకపాత్ర పోషిస్తాయి. డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్‌తో పాటు, వలంటీర్లు కూడా పని చేస్తారు. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలు ప్రారంభించడం మొదలు, వారికి అవసరమైన అన్ని పనులు చేస్తారు.
► జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఆ బా«ధ్యత చూస్తారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు క్వాలిఫైడ్. వారి సేవలు ఉపయోగించుకోండి. అందుకు తగిన ఎస్‌ఓపీ ఖరారు చేయండి.
► తొలి దశలో నిర్మించనున్న ఇళ్లను 18 నెలల్లో (2022 జూన్ నాటికి) పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రెండో దశలో గ్రామీణ ప్రాంతాల్లో 13 లక్షల ఇళ్లు నిర్మిస్తారు. వచ్చే ఏడాది 2021 డిసెంబర్‌లో వాటి నిర్మాణం ప్రారంభించి 2023 జూన్ నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యం. వచ్చే ఏడాది ఇళ్ల నిర్మాణం అనేది ప్రభుత్వ అతి పెద్ద కార్యక్రమం. తొలి దశలో 167 నియోజకవర్గాలలో ఇళ్ల నిర్మాణాలు మొదలు కానున్నాయి.
► ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, శ్రీరంగనాథరాజు, ఆదిమూలపు సురేష్, డీజీపీ గౌతమ్ సవాంగ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అత్యంత నాణ్యతతో కొత్త ఇళ్ల నిర్మాణం
► నవరత్నాలులో చెప్పిన మరో కార్యక్రమం అమలు చేయబోతున్నాం. తొలి దశలో దాదాపు 15.10 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నాం. ఒక్కో ఇంటిని రూ.1.80 లక్షల వ్యయంతో, అన్నీ ఒకే మాదిరిగా నిర్మిస్తారు. ఒక్క రూపాయి కూడా పేదలపై భారం పడదు.
► ఇంటి నిర్మాణానికి అవసరమైన పూర్తి సామగ్రి సెంట్రల్ ప్రొక్యూర్‌మెంట్ ద్వారా సరఫరా అవుతుంది. నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. క్వాలిటీ అనేది ప్రభుత్వానికి ట్రేడ్ మార్క్. బ్రాండ్ ఇమేజ్. కాబట్టి ఎక్కడా రాజీ పడొద్దు.
► పేదల ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితంగా సరఫరా చేస్తారు. 67.50 లక్షల టన్నుల సిమెంట్, 7.20 లక్షల టన్నుల ఇనుము అవసరం అవుతుంది. ఈ ఇళ్ల నిర్మాణం వల్ల 21 కోట్ల పని దినాలు లభించనున్నాయి. మెటీరియల్ ఇస్తాం. లేబర్ కాంపొనెంట్ వారికే ఇస్తాం. ఆ విధంగా దగ్గరుండి పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తాం.
Comments
Please login to add a commentAdd a comment