వైఎస్సార్ జిల్లా పులివెందుల మున్సిపాలిటీలో పేదల కోసం సిద్ధం చేసిన లేఅవుట్
సాక్షి, అమరావతి: ఆహ్లాదకరమైన వాతావరణం.. అద్దంలా చదును చేసిన ప్లాట్లు.. చక్కటి రోడ్లు.. అందమైన పార్కులు.. పాఠశాల, ఆస్పత్రి తదితర మౌలిక వసతుల కల్పనకు విశాలమైన స్థలాలతో కూడిన లేఅవుట్లు.. ప్రతి ప్లాటుకూ నంబర్.. ఇదేదో రియల్టర్ సంస్థల ప్రకటన కాదు.
‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా ఉగాది పర్వదినం రోజున పేదలకు నివాస స్థలాలిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న లేఅవుట్లలో కల్పిస్తున్న సౌకర్యాలివి. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 26.6 లక్షల మందికి వీటిని విక్రయ దస్తావేజుల (కన్వేయన్స్ డీడ్ల) రూపంలో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేందుకు అధికార యంత్రాంగం చకచకా ఏర్పాట్లుచేస్తోంది. రాష్ట్రంలో ఎవరికీ ఇల్లులేదనే మాట వినిపించకూడదు.. ప్రతిఒక్కరికీ నివాస యోగ్యం కల్పించాలనే ఉదాత్త ఆశయంతో సీఎం వైఎస్ జగన్ సర్కారు యజ్ఞంలా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా అధికారులు అహరహం శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా అన్ని జిల్లాల్లో భూమి చదును ముమ్మరంగా జరుగుతోంది.
ప్రధాన రహదారులు 30 అడుగులు
ఇళ్ల స్థలాల పంపిణీ కోసం రూపొందిస్తున్న వైఎస్సార్ జగనన్న కాలనీలకు 30 అడుగుల వెడల్పుతో ప్రధాన రహదారులు ఏర్పాటుచేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో అక్కడి పరిస్థితులు, లేఅవుట్ పరిమాణాన్ని బట్టి మరింత విశాలంగా నిర్మించేందుకు యోచిస్తున్నారు. ఇక పెద్దపెద్ద లేఅవుట్లు అన్నింటిలో ఆస్పత్రులు, విద్యా సంస్థలు, పార్కులు లాంటి మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేకంగా స్థలాలు కేటాయిస్తున్నారు.
చుట్టూ పచ్చని చెట్లు.. కొండలు
ఇక రాష్ట్రంలో అనేకచోట్ల గ్రామాలకు, పట్టణాలకు వెలుపల పచ్చని చెట్లు, కొండలు, పొలాల పక్కన వైఎస్సార్ జగనన్న కాలనీల కోసం స్థలాలు ఎంపిక చేశారు. దీంతో స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన గాలి వస్తోంది. పచ్చదనంతో వాతావరణం కూడా చల్లగా ఉంటోంది. వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం ఊటుకూరులో ఏర్పాటుచేస్తున్న కాలనీ కొండను ఆనుకుని సుందరంగా ఉంది. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో చాలాచోట్ల ఇలాగే ఉన్నాయి. ఉభయగోదావరి జిల్లాల్లో తోటలు, పొలాల పక్కన కాలనీలు సుందరంగా రూపుదిద్దుకోనున్నాయి.
22,43,561 మంది లబ్ధిదారులు.. 43,457 ఎకరాలు
– ఈనెల రెండో తేదీ నాటికి జిల్లాల నుంచి ప్రభుత్వానికి అందిన సమాచారం ప్రకారం మొత్తం 22,43,561 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు.
– వీరికి ప్లాట్ల కోసంతోపాటు రహదారులు, సామాజిక అవసరాలకు కేటాయించిన దానితో కలిపి మొత్తం 43,457.27 ఎకరాలు అవసరమని అధికారులు లెక్కగట్టారు. (సాంకేతిక కారణంలో మూడు, నాలుగు ప్రాంతాల వివరాలు వీటిలో చేర్చలేదు)
– కానీ, 26,976.68 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నట్లు వారు గుర్తించారు.
– మిగిలిన 12,693.29 ఎకరాలను ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరిస్తున్నారు.
నివాసానికి పూర్తి అనుకూలంగా ఉండాల్సిందే
పేదలకు స్థలాలిచ్చి కట్టించే ఇళ్లు వారికి పూర్తి అనుకూలంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యం. ఇందులో భాగంగానే అన్ని విధాలా లబ్ధిదారులకు సౌకర్యవంతమైన ప్రాంతాలనే ఎంపిక చేయాలని ఆయన పదేపదే ఆదేశించారు. ఈ విషయంలో సీఎం ఏమి చెప్పారంటే..
– 26.6 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఒకేరోజు ఇచ్చి 30 లక్షల మందికి (సొంతంగా స్థలాలు ఉన్న వారితో కలిపి) నాలుగేళ్లలో ఇళ్లు కట్టించి ఇవ్వడమన్నది మహా యజ్ఞం లాంటిది.
– ఈ గొప్పపనికి సార్థకత ఏర్పడాలంటే ఇళ్లను లబ్ధిదారులు వినియోగించుకోవాలి. అందువల్ల ఎంపిక చేసిన ప్రాంతాలను లబ్ధిదారులకు చూపించి వారు అంగీకరిస్తేనే ముందుకెళ్లండి.
ఒకే నమూనాలో ఇళ్లు
– వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్లన్నీ ఒకే నమూనాలో నిర్మించనున్నారు.
– ఒక్కో ఇంట్లో ఒక బెడ్‌రూమ్, హాలు, కిచెన్, వరండా, టాయిలెట్ సదుపాయాలతో ప్లాన్ రూపొందిస్తున్నారు.
– ప్రతి కాలనీలో డ్రైనేజి, తాగునీటి పైపులైను, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తారు.
– దశల వారీగా నాలుగేళ్లలో 30 లక్షల ఇళ్లు నిర్మించాలన్నది సర్కారు లక్ష్యం.
‘తూర్పు’లో అత్యధికంగా లబ్ధిదారులు
ఇళ్ల స్థలాలకు ఎంపికైన లబ్ధిదారుల సంఖ్య విషయంలో తూర్పు గోదావరి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది.
– ఈ జిల్లాలో ఇప్పటివరకు 3,29,532 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు.
– అధికారులు ఈ జిల్లాలో మొత్తం 1,129 లేఅవుట్లు రూపొందిస్తున్నారు.
– ఇతర జిల్లాలతో పోలిస్తే ఇక్కడే ఎక్కువ భూసేకరణ జరుగుతోంది.
– ఇక లబ్ధిదారుల సంఖ్య పరంగా చూస్తే కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
పులివెందులలో 7,284 ప్లాట్లతో ఒకే కాలనీ..
మరోవైపు.. వైఎస్సార్ జిల్లా పులివెందులలో కూడా 7,284 మందికి నివాస స్థలాలిచ్చేందుకు 257.53 ఎకరాల్లో అధికార యంత్రాంగం మరో భారీ లేఅవుట్ రూపొందించింది.
– ఈ కాలనీ ప్రధాన రహదారిని 98.42 అడుగుల (30 మీటర్లు) వెడల్పుతో నిర్మించనున్నారు.
– ఇందులో కొన్ని రోడ్లను 65.61 అడుగులు, మరికొన్ని రహదారులను 39.37 అడుగులు, కొన్ని అంతర్గత రహదారులను 30 అడుగుల వెడల్పుతో ప్లాన్ చేశారు.
– కాలనీలో మొత్తం 33,390 మీటర్ల పొడవున రోడ్లు నిర్మిస్తారు.
ప్రజలకు అన్ని సౌకర్యాలతో కాలనీలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని కాలనీలకు సకల సౌకర్యాలతో ఏర్పాటుచేస్తున్నాం. ప్రజలకు సౌకర్యంగా ఉండే ప్రాంతాలనే ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ఎంపిక చేసి చదును చేసి లేఅవుట్లు రూపొందిస్తున్నాం.
– హరికిరణ్, వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్
భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు
తూర్పు గోదావరి జిల్లాలో ఇళ్ల స్థలాలకు ఎక్కువ డిమాండు ఉంది. భూమి ధర కూడా ఎక్కువే. అందువల్ల ఇక్కడ భూసేకరణకే రూ.2వేల కోట్లకుపైగా వెచ్చించాల్సి వస్తోంది. ఇళ్లు లేని వారందరికీ ఇళ్లు కట్టించి ఇవ్వాలన్నది సీఎం వైఎస్ జగన్ ఉన్నతాశయం. భూములిచ్చిన రైతులందరికీ జిల్లా యంత్రాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
– మురళీధర్ రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్
అతిపెద్ద లేఅవుట్..
విజయనగరం జిల్లా గుంకలాం గ్రామంలో 341 ఎకరాల్లో రాష్ట్రంలోకెల్లా అతిపెద్ద లేఅవుట్ రూపుదిద్దుకుంటోంది. 16,043 మందికి ఇక్కడ ప్లాట్లు ఇచ్చేందుకు భూమిని చదును చేస్తున్నారు. విజయనగరానికి సమీపంలోనే ఉన్నందున ఈ ప్రాంతం పట్టణంలో కలిసిపోనుంది.
Comments
Please login to add a commentAdd a comment