
సాక్షి, అమరావతి: ప్రజలకు కోరినంత నాణ్యమైన ఇసుకను అందించేందుకు సవరించిన ఇసుక పాలసీని గురువారం రాష్ట్ర మంత్రివర్గం చర్చించి ఆమోదించనుంది. ఇసుక విధానం మెరుగుపరచడం కోసం సిఫార్సుల నిమిత్తం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రుల కమిటీని నియమించిన విషయం విదితమే. ఈ కమిటీ సభ్యులు ఇసుక విధానంపై లోతుగా అధ్యయనం చేసింది. ప్రజల సౌలభ్యం కోసం ఇసుకను రీచ్‌ల నుంచే ఇవ్వాలని మంత్రుల కమిటీ సూచించింది. పట్టాభూముల్లో నాణ్యత లేని ఇసుక వస్తున్నందున అక్కడ తవ్వకాలకు స్వస్తిచెప్పి నదుల్లో డ్రెడ్జింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సిఫార్సు చేసింది. వీటితో పాటు మంత్రుల కమిటీ చేసిన పలు సూచనలను పరిశీలించిన సీఎం జగన్ లోపరహితమైన ఇసుక విధాన రూపకల్పన కోసం ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించాలని భావించారు. సీఎం సూచన మేరకు ఈ అంశాలపై ప్రజల నుంచి సలహాలు కోరుతూ అధికారులు పత్రికా ప్రకటనలు ఇచ్చారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలకు అనుగుణంగా ఇసుక పాలసీని ప్రభుత్వం సవరించింది.
నూతన పాలసీలోని ముఖ్యమైన అంశాలు
► ప్రభుత్వమే ఇసుక ధర నిర్ణయిస్తుంది. ప్రజలు నేరుగా రీచ్‌ల వద్ద డబ్బు చెల్లించి ఇసుక తీసుకెళ్లవచ్చు. స్టాక్ యార్డులు ఉండవు.
► రీచ్‌ల నుంచి తమకు నచ్చిన వాహనాల్లో ఇసుక తీసుకెళ్లే స్వేచ్ఛ ప్రజలకు ఉంటుంది.
► అవసరాలకు అనుగుణంగా నదుల్లో పెద్దఎత్తున డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక వెలికితీతకు ప్రాధాన్యం ఇస్తారు.
► రీచ్‌ల నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు అప్పగించాలన్నది పాలసీలో మరో అంశం. అవి ముందుకురాని పక్షంలో వేలం ద్వారా పెద్ద సంస్థలకు ఈ బాధ్యత ఇస్తారు.