కమిటీ సిఫార్సుల ఫైలును సీఎం వైఎస్ జగన్‌కు అందజేస్తున్న మంత్రి కన్నబాబు. చిత్రంలో సీఎస్
సాక్షి, అమరావతి: కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ (కే – సెజ్)కి సంబంధించి రైతుల భూముల విషయంలో గత 15 సంవత్సరాలుగా నెలకొన్న సమస్యలను సీఎం వైఎస్ జగన్ పరిష్కరించారు. నాడు ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర సమయంలో రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. కాకినాడ సెజ్ కోసం గత సర్కారు హయాంలో రైతుల నుంచి బలవంతంగా 2,180 ఎకరాలు తీసుకోవడం తెలిసిందే. దీంతో రైతులు పరిహారం తీసుకునేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో సెజ్ కోసం రైతుల నుంచి తీసుకున్న 2,180 ఎకరాలను తిరిగి వారికే ఇవ్వాలని దీనిపై ఏర్పాటైన కమిటీ చేసిన సిఫార్సులను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.
ఇతర సిఫారసులు ఇవీ: స్థానిక ప్రజల మనోభావాలను గౌరవించడంలో భాగంగా ఆరు గ్రామాలను తరలించరాదని కమిటీ చేసిన సిఫార్సుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. శ్రీరాంపురం, బండిపేట, ముమ్మిడివారిపోడు, పాటివారిపాలెం, రావివారిపోడు, రామరాఘవాపురం గ్రామాలను తరలించాల్సిన అవసరం లేదని, రామరాఘవాపురంను తరలించాల్సి వస్తే రావివారిపోడు గ్రామానికి తరలించాలని కమిటీ సిఫార్సు చేసింది.
► పునరావాసం లేని నివాసాలకు దగ్గరగా ఉన్న శ్మశాన వాటికలను ఆ గ్రామాలకే వదిలివేయాలని, వాటిని తరలించరాదని కమిటీ పేర్కొంది. అలాంటి శ్మశాసవాటిక స్థలం పరిశ్రమ కోసం అవసరమైతే ప్రత్యామ్నాయ భూమిని కేఎస్‌ఈజెడ్ గ్రామస్థులకు కల్పించాలని కమిటీ పేర్కొంది.
► నిషేధిత ఆస్తుల జాబితా నుంచి పట్టా భూములను తొలగించడానికి సంబంధించి జిల్లా కలెక్టర్ నిబంధనల ప్రకారం కేసులను పరిష్కరించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. కేఎస్‌ఈజెడ్ కోసం తీసుకున్న 657 ఎకరాల అసైన్డ్ భూములకు సంబంధించి కోన గ్రామానికి చెందిన రైతులు పరిహారం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో అదనంగా ఎకరానికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.పది లక్షలు పరిహారం ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసింది. దివీస్ ల్యాబ్‌కు చెందిన అసైన్డ్ భూములకు ఎకరానికి రూ.పది లక్షల చొప్పున పరిహారం అందించాలని సిఫార్సు చేసింది.
► సెజ్ కోసం భూముల స్వాధీనానికి వ్యతిరేకంగా ఆందోళన చేసిన రైతులపై పెట్టిన క్రిమినల్ కేసులను సమీక్షించడంతో పాటు అవకాశమున్న వరకు కేసులను ఉపసంహరించాలని కమిటీ సిఫార్సు చేసింది. సెజ్‌లో స్థానిక నిరుద్యోగ యువతకు 75% ఉద్యోగాలు కల్పించాలని సిఫార్సు చేసింది. నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. కే–సెజ్‌తో పాటు దివీస్ భూముల పరిసరాల్లో సరైన ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని, హేచరీస్ ప్రభావం పడకుండా సముద్ర ప్రవాహానికి దూరంగా తరలిం
చాలని సూచించింది.
పాదయాత్ర హామీ మేరకు కమిటీ
పాదయాత్ర హామీ మేరకు కాకినాడ సెజ్‌లో రైతుల సమస్య పరిష్కారానికి మంత్రి కన్నబాబు నేతృత్వంలో కమిటీని సీఎం జగన్ ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆ కమిటీ రైతులతో పాటు కాకినాడ సెజ్ వ్యతిరేక పోరాట సమితితో సంప్రదింపులు జరిపి ఆమోదయోగ్యమైన, అన్నదాతలకు మేలు జరిగేలా సిఫార్సులను చేసింది. సీఎం జగన్ అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో సిఫార్సులతో కూడిన కమిటీ నివేదికను కేబినెట్ ఆమోదించింది. ఈ భూములను తిరిగి రైతులకు ఇచ్చేస్తున్నందున కే – సెజ్ కోసం జమ చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కమిటీ చేసిన సిఫార్సును కేబినెట్ ఆమోదించింది.
సెజ్ బాధితుల హర్షం
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
పిఠాపురం: కేబినెట్ నిర్ణయంపై ఇక్కడి సెజ్ బాధిత రైతులు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. కొన్నేళ్ల క్రితం కాకినాడ సెజ్ పేరుతో పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంతో పాటు తుని నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సుమారు 10 వేల ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి స్థానిక రైతులు ఆందోళనలు చేస్తూ వచ్చారు. 2012లో చంద్రబాబు ఇక్కడకు వచ్చి అధికారంలోకి రాగానే ఎవరి భూములు వారికి ఇచ్చేస్తామని ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చాక తమను కేసులతో ఇబ్బందులకు గురిచేసినట్లు రైతులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పిఠాపురం వచ్చిన జగన్ దృష్టికి రైతులు తమ సమస్య తీసుకువచ్చారు.
సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న సెజ్ గ్రామాల నాయకులు
Comments
Please login to add a commentAdd a comment