కాపులకు రిజర్వేషన్‌పై కమిషన్
రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం
సాక్షి, విజయవాడ బ్యూరో : కాపులను వెనుకబడిన తరగతుల్లో చేర్చే విషయం పరిశీలించేందుకు కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జిని నియమించాలని తీర్మానించింది. కమిషన్ తొమ్మిది నెలల్లో నివేదిక ఇచ్చేలా మార్గనిర్దేశం చేయాలని, నివేదిక అందిన తర్వాత రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాలని భావించింది. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ భేటీ జరిగింది. అనంతరం మంత్రులు యనమల రామకృష్ణుడు, పల్లె రఘునాథరెడ్డి, పి.నారాయణ మీడియాతో మాట్లాడారు.
కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. కాపులను బీసీల్లో చేర్చే విషయంలో మిగిలిన వర్గాలకు ఎటువంటి అపోహలు ఉండాల్సిన అవసరం లేదని, దీనివల్ల వారికి ఎలాంటి నష్టం ఉండదని చెప్పారు. ప్రస్తుతం బీసీలకున్న రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు ఉండదని అన్నారు. మిగిలిన వారికి రిజర్వేషన్లు తగ్గించి కాపులకు రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితి ఉండదని మంత్రులు పేర్కొన్నారు. బీసీల సబ్‌ప్లాన్ అమలుకు 2015-16 బడ్జెట్‌లో రూ.6,640 కోట్లు కేటాయించామన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇప్పటికే రూ.50 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.
మంత్రివర్గం ఇతర నిర్ణయాలు..
► రూ.100 కోట్లతో కాపు కార్పొరేషన్ ఏర్పాటు. పనితీరును బట్టి ఈ కార్పొరేషన్‌కు అదనపు నిధులు.
► రాష్ట్రంలో ఓడరేవుల కార్యకలాపాలు పెంచి వాటిని అభివృద్ధి చేసేందుకు గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర తరహాలో మారిటైమ్ బోర్డు ఏర్పాటు. ఈ బోర్డుకు చైర్మన్, ఐదు నుంచి పది మంది డెరైక్టర్లను నియమించే అధికారం ప్రభుత్వానికి ఉండేలా చర్యలు. దీనికి సంబంధించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలి.
► రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కోసం భూముల లీజు కాలపరిమితిని 99 ఏళ్లకు పెంచేందుకు లేదా ఫ్రీ హోల్డింగ్ కు అనుమతించాలి. దీనిపై త్వరలో ఆర్డినెన్స్.
► నాయీ బ్రాహ్మణ, రజక తదితర ఫెడరేషన్లకు సంబంధించిన డిమాండ్ల పరిశీలన, పునఃసమీక్ష. మత్స్యకారులు, వాల్మీకులను బీసీల్లోంచి తప్పించి ఎస్సీల్లో చేర్చాలనే డిమాండ్‌పైనా పరిశీలన.
► అర్బన్ డెవలప్‌మెంట్ కారిడార్ ఏర్పాటుకున్న అవకాశాల పరిశీలన. విశాఖ-చెన్నయ్, బెంగళూరు-చెన్నయ్ పారిశ్రామిక కారిడార్లను దృష్టిలో పెట్టుకుని నెల్లూరు, రాజమండ్రి-కాకినాడ, కర్నూలు, అనంతపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల ఏర్పాటుపై వచ్చే కేబినెట్‌లో నిర్ణయం.
► గ్రామాల్లో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు డిసెంబర్ 1 నుంచి 14వ తేదీ వరకు జనచైతన్య యాత్రలు.
భూ కేటాయింపులు
ప్రకాశం జిల్లా పొదిలి మండలం తలమలలో ఏపీ ట్రాన్స్‌కో ఏర్పాటుచేసే 4/200 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం ఎకరం రూ.4.26 లక్షల చొప్పున 13.5 ఎకరాల కేటాయింపు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కానుపురంలో రవీంద్రభారతి ఎస్‌కేఎస్ స్కూల్‌కు అప్రోచ్ రోడ్డు వేసేందుకు ఎకరం రూ.55 లక్షల చొప్పున 95 సెంట్లు కేటాయింపు. వెఎస్సార్ జిల్లా కడప మండలం చిమ్ముమియాపేటలో ఈసీహెచ్ పాలీక్లినిక్ భవన నిర్మాణానికి సెంటు రూ.96,800 వంతున 14 సెంట్ల భూమి కేటాయింపు. క్రిభ్‌కో ఫెర్టిలైజర్స్ యూనిట్ ఏర్పాటుకు నెల్లూరు జిల్లా వెంకటపల్లి మండలం సర్వేపల్లిలో ఎకరం రూ.7లక్షల చొప్పున 5.8 ఎకరాల కేటాయింపు.