మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబునాయుడు, చిత్రంలో మంత్రులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ విద్యా రంగంలోకి ప్రైవేటు సంస్థల ప్రవేశానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలుపుతూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలన్నింటిలో వర్చువల్ క్లాస్ రూమ్స్ ద్వారా విద్యార్థులకు పాఠాలను బోధించే ప్రాజెక్టును ట్రిజిన్ టెక్నాలజీస్‌కు కట్టబెట్టనుంది. రూ.160 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టును డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. మంత్రి మండలి నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాకు వివరించారు. వర్చువల్ క్లాస్ రూమ్స్ కోసం ప్రతి జిల్లా కేంద్రంలో క్లౌడ్ ఆధారిత రిసోర్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
చంద్రన్న పెళ్లి కానుక..
బడుగు, బలహీన వర్గాల అమ్మాయిల పెళ్లిళ్లకు అందిస్తున్న ఆర్థిక సహాయాలన్నిం టినీ ‘చంద్రన్న పెళ్లి కానుక’ కిందకు తీసుకువస్తూ నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. ఈ పథకం కింద మైనార్టీలు, గిరిజనులు, దళితులు, బలహీన వర్గాల వారికి ఏడాదికి లక్ష మందికి ఎక్కువ కాకుండా అమ్మాయిల వివాహాలకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. మైనార్టీలకు ఇస్తున్న రూ.50,000, దళితులకు రూ.40,000 అదే విధంగా కొనసాగుతాయని, బలహీన వర్గాలకు రూ.30,000 లేదా రూ.35,000 ఇవ్వాలన్న దానిపై చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. తెల్ల రేషన్ కార్డు ఉండి, 18 ఏళ్లు దాటిన వారికే పథకం వర్తిస్తుందని చెప్పారు.
మంత్రి మండలి మరిన్ని నిర్ణయాలు..
- విదేశాల్లో పని చేస్తున్న ప్రవాసీ తెలుగు వారి కోసం ఏపీ మైగ్రెంట్స్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ పాలసీకి ఆమోదం.
- ఉపాధి కోసం విదేశాలకు వేళ్లే వారికి తగిన శిక్షణ ఇవ్వడానికి, పని చేస్తున్న చోట ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. లేక అక్కడ మరణించిన వారిని తరలించడానికి అయ్యే వాటి కోసం రూ.40 కోట్లతో నిధిని ఏర్పాటు.
బీసీలకు పెళ్లి కానుక సరిపోదు: కేఈ
పెళ్లి కానుక పథకం కింద బీసీలకు రూ.30 వేలు ఇస్తే సరిపోదని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశంలో పెళ్లి కానుక పథకం కింద ఏ వర్గానికి ఎంత మొత్తం ఇవ్వాలనే దానిపై చర్చ జరుగుతున్నప్పుడు బీసీలకు రూ.30 వేలు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ సమయంలో కేఈ కృష్ణమూర్తి జోక్యం చేసుకుని బీసీలకు రూ.30 వేలు సరిపోదని, ఇంకా పెంచాలని సూచించారు. దీనిపై ఆర్థిక మంత్రి యనమల స్పందిస్తూ కేఈ మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారేమో అని జోకు పేల్చడంతో పెళ్లి కోసం ఆయన కంటే మీకే ఎక్కువ ఉత్సాహం ఉన్నట్లుందన్నారు. కొద్దిసేపు సరదా సంభాషణ జరిగినా బీసీలకు ఇంకా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉందని కేఈ చెప్పడంతో అన్ని వర్గాలకు కలిపి ఏడాదికి లక్ష మందికి ఇవ్వాలని నిర్ణయించామని సీఎం చెప్పారు.
ఎమ్మెల్యేల అపార్ట్‌మెంట్లకు డిజైన్లు
రాజధాని పరిపాలనా నగరంలో ఎమ్మెల్యేలకు నిర్మించే అపార్ట్‌మెంట్ల డిజైన్లను మంత్రివర్గం పరిశీలించింది. ఆర్కాప్ ఆర్కిటెక్చర్ సంస్థ డిజైన్లను రూపొందించి తీసుకు రాగా వాటిని ముఖ్యమంత్రి, మంత్రులు పరిశీలించారు. బుధవారం జరిగే సమావేశంలో ఒక డిజైన్‌ను ఎంపిక చేయాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment