government education department
-
పాఠశాల విద్య పాక్షికంగా ప్రైవేటు పరం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ విద్యా రంగంలోకి ప్రైవేటు సంస్థల ప్రవేశానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలుపుతూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలన్నింటిలో వర్చువల్ క్లాస్ రూమ్స్ ద్వారా విద్యార్థులకు పాఠాలను బోధించే ప్రాజెక్టును ట్రిజిన్ టెక్నాలజీస్‌కు కట్టబెట్టనుంది. రూ.160 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టును డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. మంత్రి మండలి నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాకు వివరించారు. వర్చువల్ క్లాస్ రూమ్స్ కోసం ప్రతి జిల్లా కేంద్రంలో క్లౌడ్ ఆధారిత రిసోర్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చంద్రన్న పెళ్లి కానుక.. బడుగు, బలహీన వర్గాల అమ్మాయిల పెళ్లిళ్లకు అందిస్తున్న ఆర్థిక సహాయాలన్నిం టినీ ‘చంద్రన్న పెళ్లి కానుక’ కిందకు తీసుకువస్తూ నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. ఈ పథకం కింద మైనార్టీలు, గిరిజనులు, దళితులు, బలహీన వర్గాల వారికి ఏడాదికి లక్ష మందికి ఎక్కువ కాకుండా అమ్మాయిల వివాహాలకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. మైనార్టీలకు ఇస్తున్న రూ.50,000, దళితులకు రూ.40,000 అదే విధంగా కొనసాగుతాయని, బలహీన వర్గాలకు రూ.30,000 లేదా రూ.35,000 ఇవ్వాలన్న దానిపై చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. తెల్ల రేషన్ కార్డు ఉండి, 18 ఏళ్లు దాటిన వారికే పథకం వర్తిస్తుందని చెప్పారు. మంత్రి మండలి మరిన్ని నిర్ణయాలు.. - విదేశాల్లో పని చేస్తున్న ప్రవాసీ తెలుగు వారి కోసం ఏపీ మైగ్రెంట్స్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ పాలసీకి ఆమోదం. - ఉపాధి కోసం విదేశాలకు వేళ్లే వారికి తగిన శిక్షణ ఇవ్వడానికి, పని చేస్తున్న చోట ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. లేక అక్కడ మరణించిన వారిని తరలించడానికి అయ్యే వాటి కోసం రూ.40 కోట్లతో నిధిని ఏర్పాటు. బీసీలకు పెళ్లి కానుక సరిపోదు: కేఈ పెళ్లి కానుక పథకం కింద బీసీలకు రూ.30 వేలు ఇస్తే సరిపోదని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశంలో పెళ్లి కానుక పథకం కింద ఏ వర్గానికి ఎంత మొత్తం ఇవ్వాలనే దానిపై చర్చ జరుగుతున్నప్పుడు బీసీలకు రూ.30 వేలు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ సమయంలో కేఈ కృష్ణమూర్తి జోక్యం చేసుకుని బీసీలకు రూ.30 వేలు సరిపోదని, ఇంకా పెంచాలని సూచించారు. దీనిపై ఆర్థిక మంత్రి యనమల స్పందిస్తూ కేఈ మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారేమో అని జోకు పేల్చడంతో పెళ్లి కోసం ఆయన కంటే మీకే ఎక్కువ ఉత్సాహం ఉన్నట్లుందన్నారు. కొద్దిసేపు సరదా సంభాషణ జరిగినా బీసీలకు ఇంకా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉందని కేఈ చెప్పడంతో అన్ని వర్గాలకు కలిపి ఏడాదికి లక్ష మందికి ఇవ్వాలని నిర్ణయించామని సీఎం చెప్పారు. ఎమ్మెల్యేల అపార్ట్మెంట్లకు డిజైన్లు రాజధాని పరిపాలనా నగరంలో ఎమ్మెల్యేలకు నిర్మించే అపార్ట్మెంట్ల డిజైన్లను మంత్రివర్గం పరిశీలించింది. ఆర్కాప్ ఆర్కిటెక్చర్ సంస్థ డిజైన్లను రూపొందించి తీసుకు రాగా వాటిని ముఖ్యమంత్రి, మంత్రులు పరిశీలించారు. బుధవారం జరిగే సమావేశంలో ఒక డిజైన్‌ను ఎంపిక చేయాలని నిర్ణయించారు. -
గురుదేవోభవ
తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైంది. చిన్నారులకు బాల్యంలో ఉపాధ్యాయులు సరైన బాట వేస్తే అది వారిని ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేస్తుంది. శుక్రవారం గురుపూజోత్సవం సందర్భంగా జిల్లాలో కొందరు ఉపాధ్యాయులను వివిధ స్థాయిల్లో అవార్డులు వరించాయి. బోధనలో సృజనాత్మకత, విధుల నిర్వహణలో నిబద్ధత కనబరుస్తూ ఆదర్శంగా నిలిచిన కొందరు ఉపాధ్యాయుల స్ఫూర్తిదాయక కథనాలు.. చిత్తశుద్ధి, నిబద్ధత, పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ ఉండదు. ఇవన్నీ పొదలకూరు డీఎన్ఆర్ జెడ్పీ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టి.బాలనాగమ్మలో ఉండటం వల్లే ఆ ప్రభుత్వ విద్యా సంస్థ ఆదర్శంగా నిలిచింది. ఐదేళ్ల క్రితం ఆమె పాఠశాలకు బదిలీపై వచ్చే నాటికి 500 మందిలోపు ఉన్న విద్యార్థినుల సంఖ్య నేడు 783కు పెరిగింది. ఒకవైపు విద్యార్థుల కొరతతో పాఠశాలలు మూసివేస్తున్న దుస్థితిలో పొదలకూరులో అందుకు భిన్నంగా అనూహ్యంగా పెరుగుతుండటం అక్కడి ఉపాధ్యాయుల ఉత్తమ బోధనకు నిదర్శనంగా చెప్పవచ్చు. పాఠశాల హెచ్ఎంగా తాను ఆదర్శంగా ఉంటూ సహచర ఉపాధ్యాయులను తనతో పాటు ముందుకు నడిపిస్తూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న ఆమె స్ఫూర్తి అభినందనీయం. పొదలకూరు : సహజంగా ప్రభుత్వ విద్యాసంస్థలాగే తిరోగమనానికి ప్రతీక అనే భావన ఎక్కువగా ఉంది. ఈ అభిప్రాయం సరైంది కాదని తన చర్యల ద్వారా స్థానిక డీఎన్ఆర్ జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల నిరూపిస్తోంది. ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న ఈ పాఠశాలకు మండలంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టి.బాలనాగమ్మ ఐదేళ్లలోపు పాఠశాల రూపురేఖలను మార్చేశారు. వందల్లో విద్యార్థినులు పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యార్థినులు చదువుకుంటున్నారు. ఐదేళ్ల క్రితం 500 మందికి లోపు విద్యార్థినులున్నా రు. ప్రస్తుతం 783 మందికి పెరిగారు. పొదల కూరు పట్టణానికి చెందిన వారే అధికంగా పా ఠశాలలో చేరడం విశేషం. పాఠశాలలో ఆహ్లాదకర వాతావరణంలో విద్యనభ్యసిస్తున్నారు. మండలంలో ప్రథమ స్థానం ఈ ఏడాది పదో తరగతిలో 75 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎం.మాధురి అనే విద్యార్థిని 9.5 జీపీఏ సాధించి మండలంలో ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే గతేడాది టెన్త్ ఫలితాల్లో ఇదే పాఠశాల విద్యార్థిని 9.4 జీపీఏ సాధించి ప్రథమ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. 25 మంది ఉపాధ్యాయులు, 16 తరగతి గదులు పాఠశాలలో మొత్తం 25 మంది ఉపాధ్యాయినులు పని చేస్తున్నారు. మొత్తం 16 తరగతి గదులు ఉన్నాయి. ల్యాబ్, కంప్యూటర్ విద్య అందుబాటులో ఉన్నాయి. హెచ్ఎం వ్యక్తిగత పర్యవేక్షణ విద్యార్థినులు ఒక పర్యాయం పాఠశాలకు వస్తే తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్లే వరకు హెచ్ఎం బాలనాగమ్మ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తారు. అలాగే ప్రతి విద్యార్థిని తల్లిదండ్రుల ఫోన్ నంబర్లను తీసుకుని అవసరమైతే వారికి ఫోన్లు చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. అదనపు గదుల నిర్మాణానికి నివేదిక పాఠశాల ప్రాంగణంలో ఉన్న శిథిలావస్థకు చేరుకున్న తరగతి గదులను తొలగించి అదనంగా మరో ఆరు గదులను నిర్మించేందుకు ఉన్నతస్థాయి అధికారులకు హెచ్ఎం నివేదిక సమర్పించారు. సర్వశిక్షాభియాన్‌లో అదనపు గదులు మంజూరయ్యే అవకాశం ఉంది. వందశాతం ఉత్తీర్ణత సాధనే లక్ష్యం పాఠశాల పురోభివృద్ధికి అందరి సహకారం ఉంది. ఉపాధ్యాయినులు, స్థానికులు నాకు పూర్తి సహకారం అందిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల కంటే మిన్నగా ఫలితాలు సాధించడమే లక్ష్యం. వందశాతం ఫలితాలు సాధించి ప్రభుత్వ పాఠశాలల సత్తా చాటుతాం. - టీ.బాలనాగమ్మ,హెచ్ఎం