గురుదేవోభవ | Teachers day | Sakshi
Sakshi News home page

గురుదేవోభవ

Published Fri, Sep 5 2014 3:53 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 PM

Teachers day

తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైంది. చిన్నారులకు బాల్యంలో ఉపాధ్యాయులు సరైన బాట వేస్తే అది వారిని ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేస్తుంది. శుక్రవారం గురుపూజోత్సవం సందర్భంగా జిల్లాలో కొందరు ఉపాధ్యాయులను వివిధ స్థాయిల్లో అవార్డులు వరించాయి. బోధనలో సృజనాత్మకత, విధుల నిర్వహణలో నిబద్ధత కనబరుస్తూ ఆదర్శంగా నిలిచిన కొందరు ఉపాధ్యాయుల స్ఫూర్తిదాయక కథనాలు..
 
 చిత్తశుద్ధి, నిబద్ధత, పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ ఉండదు. ఇవన్నీ పొదలకూరు డీఎన్‌ఆర్ జెడ్పీ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టి.బాలనాగమ్మలో ఉండటం వల్లే ఆ ప్రభుత్వ విద్యా సంస్థ ఆదర్శంగా నిలిచింది. ఐదేళ్ల క్రితం ఆమె పాఠశాలకు బదిలీపై వచ్చే నాటికి 500 మందిలోపు ఉన్న విద్యార్థినుల సంఖ్య నేడు 783కు పెరిగింది. ఒకవైపు విద్యార్థుల కొరతతో పాఠశాలలు మూసివేస్తున్న దుస్థితిలో పొదలకూరులో అందుకు భిన్నంగా అనూహ్యంగా పెరుగుతుండటం అక్కడి ఉపాధ్యాయుల ఉత్తమ బోధనకు నిదర్శనంగా చెప్పవచ్చు. పాఠశాల హెచ్‌ఎంగా తాను ఆదర్శంగా ఉంటూ సహచర ఉపాధ్యాయులను తనతో పాటు ముందుకు నడిపిస్తూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న ఆమె స్ఫూర్తి అభినందనీయం.
 
 పొదలకూరు : సహజంగా ప్రభుత్వ విద్యాసంస్థలాగే తిరోగమనానికి ప్రతీక అనే భావన ఎక్కువగా ఉంది. ఈ అభిప్రాయం సరైంది కాదని తన చర్యల ద్వారా స్థానిక డీఎన్‌ఆర్ జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల నిరూపిస్తోంది. ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న ఈ పాఠశాలకు మండలంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టి.బాలనాగమ్మ ఐదేళ్లలోపు పాఠశాల రూపురేఖలను మార్చేశారు.
 
 వందల్లో విద్యార్థినులు
 పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యార్థినులు చదువుకుంటున్నారు. ఐదేళ్ల క్రితం 500 మందికి లోపు విద్యార్థినులున్నా రు. ప్రస్తుతం 783 మందికి పెరిగారు. పొదల కూరు పట్టణానికి చెందిన వారే అధికంగా పా ఠశాలలో చేరడం విశేషం. పాఠశాలలో ఆహ్లాదకర వాతావరణంలో విద్యనభ్యసిస్తున్నారు.
 
 మండలంలో ప్రథమ స్థానం
 ఈ ఏడాది పదో తరగతిలో 75 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎం.మాధురి అనే విద్యార్థిని 9.5 జీపీఏ సాధించి మండలంలో ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే గతేడాది టెన్త్ ఫలితాల్లో  ఇదే పాఠశాల విద్యార్థిని 9.4 జీపీఏ సాధించి ప్రథమ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.
 
 25 మంది ఉపాధ్యాయులు,
 16 తరగతి గదులు
 పాఠశాలలో మొత్తం 25 మంది ఉపాధ్యాయినులు పని చేస్తున్నారు. మొత్తం 16 తరగతి గదులు ఉన్నాయి. ల్యాబ్, కంప్యూటర్ విద్య అందుబాటులో ఉన్నాయి.
 హెచ్‌ఎం వ్యక్తిగత పర్యవేక్షణ
 విద్యార్థినులు ఒక పర్యాయం పాఠశాలకు వస్తే తిరిగి సాయంత్రం  ఇంటికి వెళ్లే వరకు హెచ్‌ఎం బాలనాగమ్మ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తారు. అలాగే ప్రతి విద్యార్థిని తల్లిదండ్రుల ఫోన్ నంబర్లను తీసుకుని అవసరమైతే వారికి ఫోన్లు చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు.
 
 అదనపు గదుల నిర్మాణానికి నివేదిక
 పాఠశాల ప్రాంగణంలో ఉన్న శిథిలావస్థకు చేరుకున్న తరగతి గదులను తొలగించి అదనంగా మరో ఆరు గదులను నిర్మించేందుకు  ఉన్నతస్థాయి అధికారులకు హెచ్‌ఎం నివేదిక సమర్పించారు. సర్వశిక్షాభియాన్‌లో అదనపు గదులు మంజూరయ్యే అవకాశం ఉంది.
 
 వందశాతం ఉత్తీర్ణత
 సాధనే లక్ష్యం
 పాఠశాల పురోభివృద్ధికి అందరి సహకారం ఉంది. ఉపాధ్యాయినులు, స్థానికులు నాకు పూర్తి సహకారం అందిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల కంటే మిన్నగా ఫలితాలు సాధించడమే లక్ష్యం. వందశాతం ఫలితాలు సాధించి ప్రభుత్వ పాఠశాలల సత్తా చాటుతాం.
 - టీ.బాలనాగమ్మ,హెచ్‌ఎం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement