సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖలో ఏళ్ళ తరబడి టీచర్లు స్కూళ్లు ఎగ్గొట్టినా, అసలు కన్పించకుండా పోయినా అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఓ ఉపాధ్యాయుడు 20 ఏళ్ళు ఉద్యోగమే చేయకపోయినా తిరిగి పోస్టింగ్ ఇవ్వడం తీవ్ర వివాదాస్పదమైంది. ఇలా ఏళ్ళకు ఏళ్ళు స్కూల్ ముఖమే చూడని టీచర్లు ఒకరిద్దరు కాదు.. వంద మందికిపైగా ఉన్నారని అధికార వర్గాలే అంటున్నాయి.
2005 నుంచి ఇలాంటి వాళ్ళ కోసం జల్లెడ పడితే వంద మంది వరకూ గుర్తించామని చెబుతున్నారు. అనధికారికంగా ఈ సంఖ్య రెట్టింపే ఉంటుందని తెలుస్తోంది. కొన్ని రోజుల పాటు స్కూల్ ఎగ్గొడితేనే విద్యార్థిని పరీక్షలకు అనుమతించరు. అలాంటిది ఏళ్ళ తరబడి టీచర్ స్కూల్‌నే వదిలేస్తే కనీసంగా ఎవరూ పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. పత్తా లేని కాలంలో జీతాలు చెల్లించడం లేదు కదా అని సర్వీసులో ఉన్న మాస్టార్లను అలా ఎలా వదిలేస్తారన్న వాదనలు ఉత్పన్నమవుతున్నాయి.
వాళ్ళేం చేస్తున్నట్టు?
సాధారణంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు సెలవు పెట్టాలంటే ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైతే మళ్ళీ సెలవును పొడిగించుకోవాలి. లేదంటే గైర్హజరుగానే భావిస్తారు. నల్గొండ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో టీచర్లు మాత్రం సెలవు పెట్టిన దాఖలాల్లేవు. ఆ తర్వాత విద్యాశాఖకు తెలియజేసిన ఆనవాళ్ళూ లేవు. అసలా టీచర్లు స్కూల్‌కు రావడం లేదని మండల, జిల్లా స్థాయి అధికారులు ఉన్నతాధికారులకు చెప్పిందీ లేదు. ఉపాధ్యాయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు కొంతమంది టీచర్లు స్కూల్ మానేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో టీచర్లు ఏకంగా దుబాయ్ వంటి గల్ఫ్ దేశాలకు కూడా వెళ్ళినట్టు వెల్లడైంది. ఏడాది కన్పించకుండా పోతే సదరు టీచర్‌కు విద్యా శాఖ అధికారులు షోకాజ్ నోటీసు ఇవ్వాలి. కానీ ఐదేళ్ళు, పదేళ్ళు, ఏకంగా 20 ఏళ్ళు కన్పించకుండా పోయినా ఒక్క షోకాజ్ నోటీసు ఇవ్వలేదు. అసలు ఆ టీచర్ ఉన్నాడని తమకే తెలియదని మండల, జిల్లా అధికారులు అంటున్నారు. దీన్నిబట్టి విద్యాశాఖ నిర్లక్ష్యం ఏమేర ఉందో తెలుస్తోంది.
20 ఏళ్ళు గైర్హాజరైనా పోస్టింగా?
జగిత్యాల జిల్లాలో ఓ సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) 2003 నుంచి విధులకు గైర్హాజరయ్యాడు. ఈ విషయాన్ని ఇటీవలే గుర్తించిన అధికారులు ఏ తరహా చర్యలు తీసుకోకపోగా, అతను తిరిగి విధుల్లో చేరతానని పెట్టుకున్న అర్జీని గుట్టు చప్పుడు కాకుండా ఆమోదించారు. ఓ హెచ్‌ఎంపై క్రమశిక్షణ చర్యలకు నోటీసు ఇవ్వడంతో ఈ విషయం బయటకొచ్చింది. 20 ఏళ్ళు విధుల్లోనే లేని వ్యక్తిని ఎలా తీసుకున్నారో అర్థం కావడం లేదని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. జిల్లా అధికారులు మాత్రం రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు అతనిని తిరిగి విధుల్లోకి తీసుకున్నట్టు చెబుతున్నారు. ఈ విషయమై అధికారులు వింతగా స్పందించడం విశేషం. షోకాజ్ నోటీసు ఇచ్చామని, అతను విధుల్లో చేరతానని చెప్పాడని, చేరిన తర్వాత విచారణ జరిపి 20 ఏళ్ళు ఎందుకు గైర్హాజరైందీ తెలుసుకుని చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు. దీనిపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా పాఠశాల విద్య డైరెక్టర్ స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment