
పట్టణ ధనికులకు ఉచితంగా స్థలం!
♦ ఆక్రమణల క్రమబద్ధీకరణపై మంత్రుల కమిటీ నిర్ణయం
♦ 100 గజాల వరకూ ఉచితంగా క్రమబద్ధీకరణకు యోచన
సాక్షి, హైదరాబాద్: పట్టణాల్లో అనధికారికంగా ఆక్రమించిన స్థలాలను క్రమబద్ధీకరించాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. పట్టణాల్లో దారిద్య్ర రేఖకు దిగువనున్న పేదలకు మాత్రమే 80 చదరపు గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించాలని జిల్లా కలెక్టర్లతో కూడిన కమిటీతో పాటు సీసీఎల్‌ఎ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేశాయి. మిగతా వారందరికీ నిర్ధారించిన ధరకు క్రమబద్ధీకరించాలని సూచించాయి. అయితే ఈ సిఫార్సు ప్రభుత్వ పెద్దకు ఏ మాత్రం నచ్చలేదు. ధనికులకు కూడా 100 చదరపు గజాల వరకు ఇళ్ల స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలనేది ఆయన లక్ష్యం.
ఇందుకోసం అధికారుల కమిటీ సిఫార్సులను పక్కన పెట్టి మంత్రులతో ఉప కమిటీ వేశారు. ఈ మంత్రుల కమిటీ పేద, ధనిక తేడా లేకుండా పట్టణాల్లో 100 చదరపు గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించాలంటూ సిఫార్సులు చేసింది. గత ప్రభుత్వాలు బీపీఎల్ కుంటుంబాలకు మాత్రమే గ్రామాల్లో 100 చదరపు గజాలు, పట్టణాల్లో 80 చదరపు గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించాయి. దారిద్య్ర రేఖకు ఎగువన (ఏపీఎల్) ఉండే కుటుంబాలకూ ఉచితంగా క్రమబద్ధీకరిస్తామనడం చూస్తుంటే అసలు క్రమబద్ధీకరణ ధనికుల కోసమే అన్నట్లుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మంత్రుల కమిటీ సిఫార్సులను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించాల్సి ఉందని ఆ వర్గాలు చెప్పాయి.