మంగళగిరిలో ఎయిర్‌పోర్టు.. విశాఖలో గోల్ఫ్ కోర్సు
- రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం
- ఉడీ కాల్పుల్లో మృతిచెందిన జవాన్లకు శ్రద్ధాంజలి
సాక్షి, అమరావతి: రాష్ట్ర కొత్త రాజధాని అమరావతికి అతిసమీపంలో మంగళగిరిలో ఐదు వేల ఎకరాల్లో ఎయిర్ పోర్టు నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో విజయవాడ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో భేటీ అయిన మంత్రి మండలి వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విశాఖపట్నంలో గోల్ఫ్ కోర్సు ఏర్పాటుకు, విశాఖపట్నం జిల్లా అడవివరం గ్రామంలో పీపీపీ పద్ధతిన ప్రైవేట్ విద్యా సంస్థలకు భూములను కేటాయింపునకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో మృతి చెందిన ఆరుగురి కుటుంబాలకు రూ. రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించింది. శుక్రవారంలోగా పరిహారం అందేలా ఆదేశించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ బాధ్యతలను పర్యవేక్షిస్తారు. జమ్ముకాశ్మీర్‌లోని ఉడీ సెక్టార్ పరిధిలో సైనిక్ శిబిరంపై తీవ్రవాదుల నరమేధాన్ని కేబినెట్ తీవ్రంగా ఖండించడంతో పాటు ఈ ఘటనలో శత్రుమూకలను తరిమికొట్టిన సైనికులను అభినందిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అమరులైన జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించింది. మంత్రి పల్లె రఘునాధరెడ్డి మీడియాకు వెల్లడించిన వివరాలు..
► విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామంలో మెరైన్ అవుట్ ఫాల్ పైప్‌లైన్ నిర్మాణంలో నష్టబోయిన నిర్వాసితులకు జీవో ఎంఎస్ నెంబర్ 68 ప్రకారం రూ. 61 కోట్ల ప్రత్యేక బడ్జెట్ మొత్తాన్ని పరిహారంగా మంజూరుకు అనుమతి. ఏపీఐఐసీ చెల్లించే ఈ ప్యాకేజీ ఐదు వేల కుటుంబాలకు వర్తిస్తుంది.
► పశుసంవర్థక శాఖలో స్టేట్ లెవెల్ కమిటీ ద్వారా 300 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం.
► విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం సుంకి, ఉలిభద్ర గ్రామాల పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఉద్యానవన కళాశాలకు 90 అధ్యాపక, అధ్యాపకేతర పోస్టుల మంజూరుకు ఆమోదం.
► మంగళగిరిలో ఐదు వేల ఎకరాల్లో ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేయాలని నిర్ణయం. విశాఖ విమానాశ్రయం నుంచి 60 శాతం ఎయిర్ ట్రాఫిక్ పెంచాలని, అంతర్జాతీయ విమాన సర్వీసులను నడపాలని నిర్ణయం.
► విశాఖ జిల్లా అడవివరంలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య పద్థతిలో ఇంటర్నేషనల్ స్కూల్‌ను అభివృదికి తగిన అభివృద్ధిదారుగా ప్రియదర్శిని ఎడ్యుకేషనల్ సొసైటీ, నోవా ఎడ్యుకేషనల్ సొసైటీలతో కూడిన కన్సార్షియం ఎంపిక చేయడానికి అనుమతి.
► జిల్లా స్థాయి టూరిజం కౌన్సిళ్లు. గోల్ఫ్ టూరిజాన్ని ప్రమోట్ చేయడం కోసం విశాఖ జిల్లా ముదసరిలోవలో 12.71 ఎకరాల పురపాలకశాఖ భూమిని మెస్సర్స్ ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్‌కు కేటాయింపు.
పట్టణ ఇళ్ల పథకంలో సబ్సిడీ: నారాయణ
పట్టణ ప్రాంతాల ప్రభుత్వం చేపట్టే గృహ నిర్మాణ పథకంలో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతోపాటు లబ్ధిదారుల పేరిట బ్యాంకులోన్లు ఇప్పించి పూర్తి స్థాయిలో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించారని మంత్రి నారాయణ తెలిపారు. ఇంటి నిర్మాణానికి సొంత భూమి ఉన్న లబ్ధిదారులకు కేం ద్రం లక్షన్నర, రాష్ట్రం మరో లక్షన్నర రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తోందన్నారు.