- ఐదు ప్రాజెక్టుల్లో రూ.27,819 కోట్ల
- అదనపు అంచ నా వ్యయానికి కేబినెట్ ఓకే
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాల్లో హక్కుగా కలి గిన నీటి వాటాలను సంపూర్ణంగా వినియోగంలోకి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో చేపట్టిన రీఇంజనీరింగ్‌కు రాష్ట్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. కాళేశ్వరం, ప్రాణహిత, ఇందిరమ్మ వరద కాల్వ, దేవాదుల, తుపాకులగూడెం ప్రాజెక్టుల్లో రీఇంజనీరింగ్ కారణంగా పెరుగుతున్న రూ. 27,819 కోట్ల అంచనా వ్యయాలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. పెరిగిన అంచనా వ్యయాలు, వాటికి టెండర్లు పిలిచే అంశంపై భారీ నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని సబ్ కమిటీ చేసిన సిఫార్సులకు ఆమోదముద్ర వేసింది. కేబినెట్ నిర్ణయం వల్ల మార్పులు చేసిన ప్యాకేజీల వరకు ఈ ఐదు ప్రాజెక్టుల వ్యయ అంచనా రూ. 59,412.56 కోట్లకు చేరుతుంది.
సబ్ కమిటీ ప్రతిపాదనలకు అనుగుణంగానే...
సాగు, ఇతర అవసరాలకు ఎక్కువ రోజులు నీటిని అందుబాటులో ఉంచడం, గ్రావిటీ ద్వారా వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు నీరందించడం, ముంపు తక్కువగా ఉండేలా చూడటం వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తూ కాళేశ్వరం, ప్రాణహిత, దేవాదుల, ఇందిరమ్మ వరదకాల్వ, తుపాకులగూడెంలలో రీ ఇంజనీరింగ్‌ను నీటి పారుదల శాఖ పూర్తి చేయడం తెలిసిందే. అయితే రీ ఇంజనీరింగ్‌తో పెరుగుతున్న అంచనాలు, వాటికి టెండర్లు పిలిచే అంశాలపై సబ్ కమిటీ ప్రతిపాదనలను కేబినెట్‌కు సమర్పించింది. ఈ విధానం ద్వారా ఐదు ప్రాజెక్టుల పరిధిలో సిద్ధం చేసిన అంచనాల మేరకు రూ. 27,819.78 కోట్ల వ్యయ భారం ప్రభుత్వంపై పడుతుందని లెక్కించింది.
ఇందులో విడదీయ వీలులేని పనుల విలువ రూ. 5,966.58 కోట్లు ఉండగా, వీడదీసేందుకు అనుకూలమైన పనుల విలువ రూ. 21,853.20 కోట్లుగా ఉంటుందని తేల్చింది. ప్రాణహిత, కాళేశ్వరం ప్రాజెక్టుల పరిధిలోనే మొత్తంగా 20 ప్యాకేజీల్లో వాస్తవ ఒప్పంద విలువ రూ. 27,390 కోట్లు ఉండగా అదనంగా మరో రూ. 26,444 కోట్ల అదనపు పనులు వచ్చి చేరాయి. ఇందులో రూ. 6,992 కోట్ల పనులను విడదీయరాని పనులుగా గుర్తించి వాటిని పాత కాంట్రాక్టర్లకే అప్పగించాలని కేబినెట్ నిర్ణయించింది. మరో రూ. 19,452 కోట్ల పనులను విడదీయగలిగే పనులుగా గుర్తించి వాటికి కొత్తగా టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది.
మిగతా వ్యయాలకూ ఓకే..
చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు ఆయకట్టును గోదావరి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉన్న ఇందిరమ్మ వరద కాల్వ(ఎఫ్‌ఎఫ్‌సీ) పరిధిలోకి తెచ్చే తుది ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దేవాదుల కింద నిర్ణయించిన ఆయకట్టులోంచి 1.90 లక్షల ఎకరాలను వరద కాల్వలోకి మార్చనున్నారు. ఈ కారణంగా వరద కాల్వ పరిధిలోని 5 పాత ప్యాకేజీల్లో మార్పులకు తోడు కొత్తగా మరో ప్యాకేజీని చేర్చారు. దీంతో ఇక్కడ వాస్తవ అంచనా రూ. 617.09 కోట్ల నుంచి రూ. 1,666.87 కోట్లకు చేరింది. దీంతోపాటు దేవాదుల మూడో దశలోని ప్యాకేజీ-2, ప్యాకేజీ-3 మార్పుల్లో భాగంగా భీమ్‌ఘణపూర్ నుంచి రామప్ప చెరువును కలుపుతూ టన్నెల్ ద్వారా నీటిని తరలించాలన్న ప్రతిపాదనకు ప్రత్యామ్నాయంగా ఇప్పుడున్న దేవాదుల ఫేజ్-2 పంప్‌హౌస్, పైప్‌లైన్ వ్యవస్థకి సమాంతరంగా పైప్‌లైన్ వేసేలా నీటిపారుదల శాఖ ప్రణాళిక వేసింది. ఈ విధానం ద్వారా రామప్ప దేవాలయానికి ఎలాంటి నష్టం వాటిల్లదు. కొత్తగా చేసిన నిర్ణయం మేరకు పైప్‌లైన్ వ్యవస్థ ద్వారా పనులు చేపడితే మొదట వేసిన వ్యయ అంచనా రూ. 531 కోట్లను దాటి కొత్తగా రూ. 1,149.73 కోట్లకు చేరుతుందని నీటిపారుదల శాఖ తేల్చింది. ప్యాకేజీ-2లోనూ అదనంగా రూ. 283.46 కోట్లు ఖర్చవుతాయని లెక్కించారు. మొత్తంగా ఇక్కడ అంచనా రూ. 1,941.70 కోట్ల నుంచి రూ. 2,848.89 కోట్లకు చేరింది.
‘రీ ఇంజనీరింగ్’కు ఆమోదం
Published Sat, Jun 4 2016 3:58 AM | Last Updated on Wed, Sep 18 2019 2:56 PM
Advertisement
Advertisement