త్వరలో రాష్ట్ర కేబినెట్‌లోకి గుత్తా!
- సీఎం కేసీఆర్‌తో మరోసారి భేటీ
- కారెక్కనున్న కాకా తనయులు
- అదే బాటలో సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్!
-15న టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహూర్తం
సాక్షి, హైదరాబాద్/ నల్లగొండ: టీఆర్‌ఎస్‌లో చేరనున్న నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి త్వరలోనే రాష్ట్ర కేబినెట్‌లో అవకాశం దక్కనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచనప్రాయంగా అంగీకరించినట్లు పార్టీ శ్రేణుల్లో ప్రచారం జోరందుకుంది. వివాద రహితునిగా పేరుండటంతో పాటు తెలంగాణ ఉద్యమ సమయంలోనూ వివిధ సందర్భాల్లో తనకు మద్దతుగా నిలిచిన నాయకుడిగా గుత్తాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ముందునుంచీ సదభిప్రాయముంది. దీంతో ఆయన పార్టీలో చేరికకు ముందునుంచీ సీఎం సానుకూలతను ప్రదర్శించారు.
అదే సమయంలో ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు గుత్తా మొగ్గు చూపడంతోపాటు, ఒక్కసారైనా రాష్ట్రంలో మంత్రి పదవిని చేపట్టాలనే తన ఆకాంక్షను ఫామ్‌హౌస్‌లో జరిగిన మంతనాల సందర్భంగా గుత్తా, సీఎం ఎదుట వెలిబుచ్చినట్లు తెలిసింది. అయితే ఎంపీ పదవికి ఇప్పుడు రాజీనామా చేయవద్దని ముఖ్యమంత్రి వారించటంతో పాటు.. అవసరమైనప్పుడు తానే మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తానని గుత్తాకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేబినెట్‌లో నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి ఉన్నప్పటికీ.. అదే సామాజిక వర్గానికి చెందిన మరో బలమైన నాయకుడి అవసరం ఉందని సీఎం ఆలోచనలో ఉన్నారు. కేబినెట్‌లో గుత్తాకు అవకాశం ఇవ్వడం ద్వారా ఆ లోటు తీరిపోతుందనే భావన ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయటంతో ఆ సీటు ఖాళీ అయింది. దీంతో అదే ఎమ్మెల్సీ సీటును గుత్తాకు ఇచ్చి.. మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం లేకపోలేదని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది.
రెండు చోట్ల చర్చలు
గుత్తా, భాస్కరరావులు టీఆర్‌ఎస్‌లో చేరే అంశంపై ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు చర్చలు జరిగాయి. ఎంపీ గుత్తా, ఎమ్మెల్యే భాస్కరరావు, తిప్పర్తి జెడ్పీటీసీ, నల్లగొండ డీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పాశం రాంరెడ్డిలు ముందుగా సాయంత్రం మెదక్ జిల్లాలోని సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌కు వెళ్లారు. అక్కడ సీఎం కేసీఆర్ గుత్తా, భాస్కరరావులతో భేటీ అయ్యారు. అనంతరం అక్కడి నుంచి తన కారులోనే వారిద్దరినీ బేగంపేట సీఎం క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి మరోసారి చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం వారు టీఆర్‌ఎస్‌లో చేరే ముహూర్తాన్ని నిర్ణయించారు. రవీంద్రకుమార్‌ను టీఆర్‌ఎస్‌లో చేర్చుకునే విషయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదిపినట్టు తెలుస్తోంది. కాగా, రవీంద్రకుమార్ మాత్రం గుత్తా, భాస్కరరావులతో ఫాంహౌస్‌కు వెళ్లకుండా క్యాంపు ఆఫీసులో జరిగిన చర్చల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది.
ఖరారైన ముహూర్తం..
నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, దివంగత వెంకటస్వామి తనయులు.. జి.వినోద్, వివేక్‌లు టీఆర్‌ఎస్‌లో చేరే ముహూర్తం ఖరారైంది. ఆదివారం గుత్తాతో పాటు మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే భాస్కర్‌రావు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలుసుకున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జి.వివేక్, వినోద్‌ల నివాసానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీని వీడొద్దని నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. కానీ వివేక్, వినోద్‌లు టీఆర్‌ఎస్‌లో చేరేందుకే మొగ్గు చూపినట్లు తెలిసింది. వీరందరూ ఈనెల 15న కారెక్కేందుకు ముహూర్తం కుదిరినట్లు తెలిసింది. ముందుగా సోమవారమే వీరందరూ టీఆర్‌ఎస్‌లో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ ఆ రోజు మంచి రోజు కాదని.. రెండ్రోజులు వాయిదా వేసుకున్నట్లు సమాచారం. మరో పక్క దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ (సీపీఐ) కూడా టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తెలిసింది.