మూకుమ్మడిగా 350 చట్టాల అన్వయింపు
సర్క్యులేషన్ విధానంలో ఆమోదించిన రాష్ట్ర కేబినెట్
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 350 చట్టాలను ఒకేసారి అన్వయిం చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫైళ్లు సిద్ధం చేసింది. పునర్విభజన చట్టం ప్రకా రం రాష్ట్రం ఏర్పడిన రెండేళ్లలోగా ఉమ్మడి రాష్ట్ర చట్టాలను దత్తత తీసుకోవాల్సి ఉం ది. లేని పక్షంలో వాటన్నింటినీ తెలంగాణ ప్రభుత్వం బిల్లుల రూపంలో ప్రవేశపెట్టి.. కొత్తగా చట్టాలు చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. జూన్ 2తో తెలంగాణ ఏర్పడి రెండేళ్లు పూర్తవనున్నందున ప్రభుత్వం ఆగమేఘాలపై రాష్ట్రానికి అవసరమైన చట్టాలన్నీ ఒకేసారి దత్తత తీసుకునే ప్రక్రియ చేపట్టింది. మొత్తం 350 చట్టాలను దత్తత తీసుకునేందుకు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం పొందాల్సి ఉండటంతో.. వారం రోజుల కిందటే ప్రభుత్వం మెమ రాండం సిద్ధం చేసింది. సర్క్యులేషన్ విధానంలో ప్రతిపాదన పంపి ఈ నెల 25న మంత్రిమండలి ఆమోదం కూడా తీసుకుంది.
ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులివ్వను న్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. సమైక్య రాష్ట్రంలోని ఏయే చట్టాలు, సవరింపులు, నిబంధనలు, రెగ్యులేషన్లు తెలంగాణకు అవసరమనే అంశంపై ప్రభుత్వం భారీ కసరత్తు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలోని యాక్ట్ నంబరింగ్ రిజిస్టర్‌లో మొత్తం 1,600 చట్టాలున్నాయి. వీటిలో అక్కర్లేనివి పక్కన పెట్టాలని, ఒకే తీరుగా ఉన్న వాటి ని క్రోడీకరించాలని, కాలం చెల్లిన వాటిని పరిహరించాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. అవసరం మేరకు అడపా దడపా ఓ 62 చట్టాలను దత్తత తీసుకుంది. మిగిలినవి 288 వరకు ఉంటాయని అంచనా వేసింది.
నివేదికను సమర్పించిన నల్సార్
నల్సార్ వర్సిటీ వారం రోజుల కిందట తమ నివేదికను సీసీఎల్‌ఏకు సమర్పించిం ది. నల్సార్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో 15 మంది నిపుణుల బృందం వీటిని కూలంకషంగా అధ్యయనం చేసి, నివేదికిచ్చింది. తెలంగాణలో ఒకేవిధమైన ల్యాండ్ రెవెన్యూ కోడ్ ఆవశ్యకత ఉందని అందులో స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంత ప్రజల భూ పరిరక్షణ, పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణకు ల్యాం డ్ రెవెన్యూ కోడ్ దోహదపడుతుందంది.
భూ వివాదాల సత్వర పరిష్కారానికి ల్యాండ్ ట్రిబ్యునల్, స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించింది. వర్సిటీ విశ్లేషించిన 112 చట్టాల్లో 52 పూర్తిస్థాయి చట్టాలు, 60 సవరణలు ఉన్నాయి. వీటిని మూడుగా వర్గీకరించారు. 10 పూర్తి స్థాయి చట్టాలు, 32 సవరణలు రాష్ట్రానికి కీలకమని సూచించిన నిపుణులు మరో 27 చట్టాలు, 14 సవరణలు ప్రస్తుతం అనవసరమని తేల్చారు. మూడో విభాగంలో 15 చట్టాలు, 11 సవరణలను ప్రస్తావించింది. వీటిలో జిల్లా కలెక్టర్ల అధికారాలు, కొత్త జిల్లాల ఏర్పాటు, వాటర్ ట్యాక్స్, డ్రైనేజీ సెస్ తదితర అంశాలకు సంబంధించిన చట్టాలున్నాయి.