circulation
-
దూసుకెళ్తున్న సాక్షి
-
తగ్గిన నగదు చలామణి
ముంబై: వ్యవస్థలో నగదు చలామణి కొంత తగ్గింది. ఫిబ్రవరి 9తో ముగిసిన వారంలో నగదు చలామణి వృద్ధి 3.7 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలానికి వృద్ధి 8.2 శాతంగా ఉన్నట్టు ఆర్బీఐ తన తాజా నివేదికలో వెల్లడించింది. తాజాగా నగదు చలామణి వృద్ధి నీరసించడానికి రూ.2,000 నోట్ల ఉపసంహరణ కారణమని పేర్కొంది. నగదు చలామణి అంటే ప్రజల వద్ద వినియోగంలో ఉన్న కాయిన్లు, నోట్లు. వాణిజ్య బ్యాంకులు జనవరిలో డిపాజిట్లకు సంబంధించి రెండంకెల వృద్ధిని చూపించగా, రూ.2,000 నోట్ల ఉపసంహరణ ఈ వృద్ధికి మద్దతుగా నిలిచినట్టు ఆర్బీఐ తెలిపింది. రిజర్వ్ మనీ (చలామణిలో ఉన్న నోట్లు, కాయిన్లు, ఆర్బీఐ వద్దనున్న బ్యాంక్‌ల డిపాజిట్లు) ఫిబ్రవరి 9తో ముగిసిన వారంలో 5.8 శాతానికి తగ్గింది. ఏడాది క్రితం ఇదే కాలంలో ఇది 11.2 శాతంగా ఉంది. ఇందులో బ్యాంకుల డిపాజిట్లు కాకుండా, చలామణిలో ఉన్న కాయిన్లు, నోట్ల వరకే చూస్తే వృద్ధి 3.7 శాతం కాగా, ఏడాది క్రితం 8.2 శాతంగా ఉంది. 2023 మే 19న రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించడం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 31 నాటికి వ్యవస్థలోని మొత్తం రూ.2,000 నోట్లలో 97.50 శాతం తిరిగి బ్యాంకుల్లోకి వచ్చాయి. ఇప్పటికీ రూ.8,897 కోట్ల విలువ చేసే రూ.2,000 నోట్లు ప్రజల వద్దే ఉన్నాయి. 2023 మే 19 నాటికి వ్యవస్థలో చలామణిలోని మొత్తం రూ.2,000 నోట్ల విలువ రూ.3.56 లక్షల కోట్లుగా ఉంది. అయితే, ఈ నోట్ల జమ, మారి్పడి సేవలను 2023 అక్టోబర్ 7 నుంచి బ్యాంకులు నిలిపివేశాయి. -
మందులు మరువొద్దు.. పుండు పడి, అవయవాలే తొలగించే పరిస్థితి వద్దు!
– ఉయ్యూరుకు చెందిన శేఖర్(50)కు ఐదేళ్లుగా సుగర్ ఉంది. సరిగా మందులు వాడక పోవడంతో అదుపులో లేదు. దీంతో ఇటీవల ఎడమకాలుకు పుండు పడి మానలేదు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి రాగా, డాప్లర్ స్కాన్ చేసి రక్తప్రసరణ తగ్గినట్లు నిర్ధారించారు. దీంతో మోకాలు కింద భాగం వరకూ కాలును తొలగించాల్సి వచ్చింది. – చిరు వ్యాపారం చేసి జీవనం సాగించే పటమటకు చెందిన వెంకాయమ్మకు 60 ఏళ్లు. పదేళ్లుగా సుగర్ ఉంది. సరిగా మందులు వాడటం లేదు. దీంతో ఇటీవల మోకీలు వద్ద పుండు ఏర్పడి, కిందిభాగం అంతా రక్తప్రసరణ నిలిచిపోయి నల్లగా మారింది. దీంతో తుంటె కింద భాగం వరకూ కాలును తొలగించాల్సి వచ్చింది. లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు సుగర్ ఇన్ఫెక్షన్లతో రోగులు బారులు తీరుతున్నారు. కాళ్ల రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల రక్త ప్రసరణ తగ్గి పుండ్లు ఏర్పడటం కారణంగా ఒక్క ప్రభుత్వాస్పత్రిలోనే నెలకు 50 నుంచి 60 మందికి అవయవాల తొలగింపు శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. వీరిలో కొందరికి వేళ్లు, మరికొందరికి పాదాలు, మోకాలు వరకూ, ఇంకొందరికీ తుంటె వరకూ కూడా తొలగించిన సందర్భాలు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. కాళ్లు, కాళ్ల వేళ్లు తొలగిస్తున్న వారిలో 90 శాతం మందికి మధుమేహం కారణం కాగా, 5 శాతం మందికి ధూమపానం, వెరికోజ్ వెయిన్స్ కారణమని వివరిస్తున్నారు. ఇంకా లెప్రసీ, వెన్నుముఖ గాయం, క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్న వారికి కూడా రక్తనాళాలు మూసుకు పోతుంటాయని వైద్యులు చెబుతున్నారు. ఓపీకి 400 మందికిపైగా.. విజయవాడ ప్రభుత్వాస్పత్రి జనరల్ సర్జరీ ఓపీకి ప్రతి రోజూ 100 నుంచి 150 మంది అవుట్ పేషెంట్స్ వస్తుంటారు. వారిలో నిత్యం 15 నుంచి 20 మంది వరకూ వివిధ రకాల పుండ్లు, కాళ్లకు రక్తప్రసరణ తగ్గడం వంటి కారణాలతో వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. నెలకు 350 నుంచి 400 మంది వరకూ వస్తారంటున్నారు. ఇలాంటి వారిలో కొందరికి పుండ్లకు డ్రెస్సింగ్ చేసి మందులు రాసి పంపుతుండగా, పుండ్లు తీవ్రంగా ఉన్న వారిని సెప్టిక్ వార్డులో అడ్మిట్ చేస్తున్నారు. కాళ్లకు, ఇతర శరీర అవయవాలపై మానని పుండ్లు(నాన్హీలింగ్ అల్సర్స్)తో ఎక్కువ మంది వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అశ్రద్ధ చేస్తే ప్రాణాలకే ముప్పు.. కాళ్లకు రక్తప్రసరణ తగ్గడం వల్ల ఎక్కువగా మానని పుండ్లు ఏర్పడుతున్నాయి. కొందరికి కాళ్లు, వేళ్లు కుళ్లి నల్లగా అయిపోవడంతో, అలాంటి వారికి రక్తప్రసరణ లేని భాగాన్ని తొలగించాల్సి వస్తోంది. నెలలో 50 నుంచి 60 వరకూ అలాంటి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నాం. వేళ్లు, పాదాలు, మోకీలు వరకూ ఇలా రక్తప్రసరణను బట్టి అవయవాలను తొలగించాల్సి ఉంటుంది. తొలగించకుండా ఇన్ఫెక్షన్ పెరిగితే ప్రాణాలకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. కుళ్లిన పుళ్లు(గ్యాంగ్రీన్స్)తో వస్తున్న వారు ఉంటున్నారు. అలాంటి వారిని సెప్టిక్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నాం. – డాక్టర్ కె. అప్పారావు, జనరల్ సర్జరీ విభాగాధిపతి, జీజీహెచ్ -
ఏయే నోట్లు ఎంతెంత? అత్యధిక వాటా ఈ నోటుదే..
దేశంలో ప్రస్తుతం చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లలో అత్యధిక విలువ కగిలిన నోటు రూ.2 వేల నోటు. అయితే తాజాగా రూ.2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ). 'క్లీన్ నోట్ పాలసీ'లో భాగంగా రూ.2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన ఆర్బీఐ ఈ నోట్లు చట్టబద్ధమైన చెల్లుబాటులో కొనసాగుతాయని తెలిపింది. రూ.2 వేల నోట్లను తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవాలని లేదా ఏదైనా బ్యాంకు శాఖలో ఇతర డినామినేషన్ నోట్లతో మార్చుకోవాలని ప్రజలకు సూచించింది. రూ.500 నోట్లదే అత్యధిక వాటా ఆర్బీఐ డేటా ప్రకారం.. 2022 మార్చి 31 నాటికి చెలామణిలో ఉన్న నోట్లలో రూ. 500 నోటు అత్యధిక విలువ కలిగిన కరెన్సీ అని తేలింది. ఇది మొత్తం విలువ పరంగా రూ. 22.77 లక్షల కోట్ల విలువైనది. చలామణిలో ఉన్న మొత్తం నోట్లలో దీని వాటా 73.3 శాతం. దీని తర్వాత స్థానంలో రూ. 2,000 నోట్లు ఉన్నాయి. మొత్తం చెలామణిలో ఇవి 13.8 శాతంగా ఉన్నాయి. ఇదీ చదవండి: RS 2000 Note: ముగిసిన రూ.2 వేల నోటు శకం.. ఆరేళ్ల ప్రస్థానం.. అయితే తాజాగా మే19న ఆర్బీఐ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మార్చి 31, 2023న చెలామణిలో ఉన్న నోట్లలో రూ. 2 వేల నోట్ల మొత్తం విలువ రూ. 3.62 లక్షల కోట్లు. అన్ని డినామినేషన్ నోట్లో వీటి వాటా 10.8 శాతం మాత్రమే. రూ. 2 నోట్లలో దాదాపు 89 శాతం మార్చి 2017కి ముందు ముద్రించినవే. ఏయే నోట్లు ఎంతెంత? 2022 మార్చి చివరి నాటికి చలామణిలో వివిధ డినామినేషన్ నోట్ల సంఖ్య, విలువలు ఇలా ఉన్నాయి. రూ.2వేలు - 21,420 లక్షల నోట్లు - విలువ రూ.4,28,394 కోట్లు రూ.500 - 4,55,468 లక్షల నోట్లు - విలువ రూ.22,77,340 కోట్లు రూ.200 - 60,441 లక్షల నోట్లు - విలువ రూ.1,20,881 కోట్లు రూ.100 - 1,81,420 లక్షల నోట్లు - విలువ రూ.1,81,421 కోట్లు రూ.50 - 87,141 లక్షల నోట్లు - విలువ రూ.43,571 కోట్లు రూ.20 - 1,10,129 లక్షల నోట్లు - విలువ రూ.22,026 కోట్లు రూ.10 - 2,78,046 లక్షల నోట్లు - విలువ రూ.27,805 కోట్లు బిజినెస్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, కథనాల కోసం సాక్షి బిజినెస్ పేజీని చూడండి -
2022 మార్చికి చలామణిలో రూ.31 లక్షల కోట్ల విలువైన కరెన్సీ: కేంద్రం
న్యూఢిల్లీ: గత సంవత్సరం మార్చి నెలనాటికి దేశంలో రూ.31.33 లక్షల కోట్ల విలువైన కరెన్సీ చలామణిలో ఉందని కేంద్రం ప్రకటించింది. 2014 ఏడాదిలో చలామణిలో రూ.13 లక్షల కోట్ల కరెన్సీ ఉండగా గత మార్చికి ఇంతటి భారీ స్థాయికి పెరిగిందని సోమవారం లోక్‌సభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. 2014 ఏడాది మార్చిలో డీజీపీలో 11.6 శాతంగా ఉన్న బ్యాంక్ నోట్లు, నాణేల వాటా 2022 మార్చి 25వ తేదీకల్లా 13.7 శాతానికి పెరిగింది. 2016 మార్చి నెలలో రూ.16.63 లక్షల కోట్ల కరెన్సీ చలామణిలో ఉండగా పాత పెద్ద నోట్ల రద్దు కారణంగా 2017 మార్చినాటికి కరెన్సీ చలామణి రూ.13.35 లక్షల కోట్లకు తగ్గింది. ఆ తర్వాత మళ్లీ చలామణిలో ఉన్న కరెన్సీ పెరుగుతూ పోయింది. చలామణిలో ఉన్న కరెన్సీ విలువ 2018 మార్చికి రూ.18.29 లక్షల కోట్లకు, 2019 మార్చినాటికి రూ.21.36 లక్షల కోట్లకు, 2020 మార్చినాటికి రూ.24.47 లక్షల కోట్లకు, 2021 మార్చి నాటికి రూ.28.53 లక్షల కోట్లకు, 2022 మార్చి నాటికి రూ.31.33 లక్షల కోట్లకు ఎగబాకింది. నల్ల ధనం చలామణికి చరమగీతం పాడటంతోపాటు డిజిటల్ ఆర్థికవ్యవస్థను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం అడుగులువేసిందని మంత్రి ఉద్ఘాటించారు. -
Demonetisation: ఇప్పటికీ క్యాషే కింగ్!
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు. ఆరేళ్ల క్రితం మోదీ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయం. అప్పటికి దేశవ్యాప్తంగా చలామణిలో ఉన్న కరెన్సీలో 86 శాతం వాటి రూ.1,000, రూ.500 నోట్లదే. కేంద్రం నిర్ణయంతో అవి ఒక్క దెబ్బతో రద్దయ్యాయి. కానీ ఆర్థిక లావాదేవీల్లో ఇప్పటికీ నగదుదే పెద్ద వాటా! పైగా నోట్ల రద్దు నాటితో పోలిస్తే జనం దగ్గరున్న నగదు ఏకంగా రెట్టింపైందని తాజా గణాంకాలు చెబుతుండటం ఆసక్తికరం. నోట్ల రద్దుకు కాస్త ముందు, అంటే 2016 నవంబర్ 4న చలామణిలో ఉన్న కరెన్సీ విలువ కేవలం 17.74 లక్షల కోట్ల రూపాయలు. రద్దు నిర్ణయం తర్వాత అది ఏకంగా రూ.9 లక్షల కోట్లకు పడిపోయింది. కానీ తాజాగా 2022 డిసెంబర్ 23 నాటికి ఏకంగా 32.42 లక్షల కోట్ల రూపాయల విలువైన కరెన్సీ చలామణిలో ఉందని రిజర్వు బ్యాంకు గణాంకాలే చెబుతున్నాయి. రద్దయిన నోట్లు మార్చుకోవడానికి అప్పట్లో 52 రోజుల గడువు ఇవ్వడం తెలిసిందే. ఆ గడువు లోపల రూ.15.3 లక్షల కోట్ల విలువైన పెద్ద నోట్లు, అంటే 99.3 శాతం వెనక్కొచ్చాయని ఆర్బీఐ పేర్కొంది. అలాంటప్పుడు నోట్ల రద్దుతో సాధించింది ఏమిటన్న ప్రశ్నలు అప్పట్లోనే తలెత్తాయి. రద్దు అనంతరం కొత్తగా రూ.2,000 నోటు ప్రవేశపెట్టడం తెలిసిందే. రూ.500 నోట్లను సరికొత్త రూపంలో తిరిగి జారీ చేసినా రూ.1,000 నోట్లను మాత్రం పునరుద్ధరించలేదు. ఒకవైపు డిజిటల్ చెల్లింపుల్లో భారత్ కొన్నేళ్లుగా ప్రపంచంలోనే అగ్ర స్థానంతో దూసుకుపోతున్నా మరోవైపు నగదు చలామణి కూడా అంతకంతకూ పెరుగుతుండటం ఆసక్తికరమే. అయితే నగదు చలామణి క్రమంగా తగ్గుతోందని ఎస్బీఐ తాజా సర్వే ఒకటి తేల్చింది. ‘‘మొత్తం చెల్లింపుల్లో నగదు వాటా 2015–16 ఆర్థిక సంవత్సరంలో 88 శాతం కాగా 2021–22 నాటికి అది 20 శాతానికి తగ్గింది. 2026–27 కల్లా కేవలం 11 శాతానికి పరిమితమవుతుంది. అదే సమయంలో 2015–16లో కేవలం 11.26 శాతంగా నమోదైన డిజిటల్ చెల్లింపులు 2021–22 నాటికి ఏకంగా 80 శాతానికి ఎగబాకాయి. 2026–27 కల్లా 88 శాతానికి చేరతాయి’’ అని అది పేర్కొంది. -
కొలీజియంలో విభేదాలు!
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త జడ్జీల నియామకప్రక్రియలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మధ్య సర్వామోదం సన్నగిల్లింది. నూతన జడ్జీల ఎంపికకు సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ చేపట్టిన ‘సర్కులేషన్’ పద్ధతిపై కొలీజియంలోని ఇద్దరు జడ్జీలు భిన్న స్వరం వినిపించడం తెలిసిందే. ఆ ఇద్దరి పేర్లను తొలిసారిగా బహిరంగంగా వెల్లడించడం గమనార్హం. 11 మంది నూతన జడ్జీల నియామకం కోసం సెప్టెంబర్ 26న సీజేఐ జస్టిస్ లలిత్ నేతృత్వంలోని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల కొలీజియం భేటీ జరిగింది. జస్టిస్ చంద్రచూడ్ హాజరుకాలేదు. 10 మంది జడ్జీల నియామక ప్రక్రియ కోసం నలుగురు జడ్జీలకు సీజేఐ లేఖలు రాశారు. తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ జస్టిస్ కిషన్ అక్టోబర్ ఒకటిన, జస్టిస్ జోసెఫ్ అక్టోబర్ ఏడున సీజేఐకు ప్రతిలేఖలు రాశారు. లేఖలు రాసే పద్ధతిపై జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నజీర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. అభిప్రాయం తెలపాలని అక్టోబర్ రెండున మరోసారి కోరినా స్పందించలేదు. సాధారణంగా కొలీజియంలో వ్యక్తమయ్యే బేధాభిప్రాయాలు, అభ్యంతరాలు తెలిపిన జడ్జీల పేర్లను వెల్లడించరు. కానీ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నజీర్ పేర్లను బయటపెడుతూ కొలీజియం ప్రకటన విడుదలచేసింది. ఇక నవంబరు 9న కొత్త సీజేఐ వచ్చాకే కొలీజియం సమావేశం కానుంది. జస్టిస్ దీపాంకర్ గుప్తాను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటూ ఇప్పటికే కేంద్రానికి సిఫార్సు చేసిన విషయం విదితమే. -
2,000 కరెన్సీ నోట్లు : ఆర్బీఐ షాకింగ్ నివేదిక
ముంబై: ఆర్థిక వ్యవస్థ నుంచి 2000 వేల రూపాయల నోట్లు క్రమంగా వెనక్కుమళ్లుతున్నాయి. 2022 మార్చి నాటికి చెలామణిలో ఉన్న మొత్తం నోట్లలో వీటి శాతం కేవలం 1.6 శాతానికి పడిపోయింది. నోట్ల సంఖ్య 214 కోట్లుగా ఉంది. ఆర్బీఐ 2021–22 వార్షిక నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. రుణ వృద్ధిలో బ్యాంకింగ్ కీలకపాత్ర పోషించాలని నివేదిక సూచిస్తూనే, అదే సమయంలో రుణ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన అకౌంట్ల పనితీరును జాగ్రత్తగా ఎప్పటికప్పుడు పరిశీలించాలని, బ్యాలెన్స్ షీట్ల పటిష్టతపై దృష్టి సారించాలని ఉద్ఘాటించింది.దేశంలో వర్చువల్ కరెన్సీని ప్రవేశపెట్టడం వల్ల కలిగే లాభ,నష్టాలను పరిశీలిస్తున్నామని తెలిపింది. డిజిటల్ కరెన్సీని ప్రారంభించేందుకు గ్రేడెడ్ విధానాన్ని (దశలవారీ పరిశీలిలన) అవలంబిస్తామని పేర్కొంది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం చెలామణిలో ఉన్న అన్ని డినామినేషన్ల కరెన్సీ నోట్ల సంఖ్య 13,053 కోట్లు. 2021 ఇదే నెల్లో ఈ నోట్ల సంఖ్య 12,437 కోట్లు. మార్చి 2020 చివరి నాటికి, చెలామణిలో ఉన్న రూ. 2000 డినామినేషన్ నోట్ల సంఖ్య 274 కోట్లు. ఇది మొత్తం చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్లలో 2.4 శాతం. మార్చి 2021 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం బ్యాంకు నోట్లలో 245 కోట్లకు లేదా 2 శాతానికి ఈ పరిమాణం క్షీణించింది. ఇక గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 214 కోట్లకు (1.6 శాతానికి) పడిపోయింది. విలువ పరంగా కూడా రూ. 2000 డినామినేషన్ నోట్లు చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్ల విలువలో 22.6 శాతం నుండి మార్చి 2021 చివరి నాటికి 17.3 శాతానికి, మార్చి 2022 చివరి నాటికి 13.8 శాతానికి తగ్గాయి. నివేదిక ప్రకారం ఈ ఏడాది మార్చి చివరి నాటికి చెలామణిలో ఉన్న రూ.500 డినామినేషన్ నోట్ల సంఖ్య 3,867.90 కోట్ల నుంచి 4,554.68 కోట్లకు పెరిగింది. పరిమాణం పరంగా మొత్తం బ్యాంక్ నోట్లలో మార్చి చివరినాటికి రూ. 500 డినామినేషన్ అత్యధికంగా 34.9 శాతం వాటాను కలిగి ఉంది. ఆ తర్వాత రూ. 10 డినామినేషన్ బ్యాంక్ నోట్ల వెయిటేజ్ చెలామణిలో ఉన్న నోట్లలో 21.3 శాతంగా ఉంది. రూ.500 డినామినేషన్ నోట్లు మార్చి 2021 చివరి నాటికి 31.1 శాతం. మార్చి 2020 నాటికి 25.4 శాతం వాటా కలిగి ఉంది. విలువ పరంగా చూస్తే, ఈ నోట్లు మార్చి 2020 నుండి మార్చి 2022 వరకు 60.8 శాతం నుండి 73.3 శాతానికి పెరిగాయి. 2021 మార్చి చివరినాటికి రూ.28.27 లక్షల కోట్లుగా ఉన్న అన్ని డినామినేషన్ల మొత్తం కరెన్సీ నోట్ల విలువ ఈ ఏడాది మార్చి చివరి నాటికి రూ.31.05 లక్షల కోట్లకు పెరిగింది. విలువ పరంగా రూ. 500, రూ. 2000 నోట్ల వాటా 31 మార్చి 2022 నాటికి చెలామణిలో ఉన్న బ్యాంక్ నోట్ల మొత్తం విలువలో 87.1 శాతం. ఇది మార్చి 2021 నాటికి 85.7 శాతం. చెలామణిలో ఉన్న బ్యాంకు నోట్ల విలువ–పరిమాణం 2020–21లో వరుసగా 16.8 శాతం, 7.2 శాతం పెరిగాయి. 2021–22లో వరుసగా ఈ పెరుగుదల 9.9 శాతం, 5 శాతంగా ఉంది. చెలామణిలో ఉన్న కరెన్సీ (సీఐసీ) బ్యాంకు నోట్లు, నాణేల రూపంలో ఉంది. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 100, రూ. 200, రూ. 500, రూ. 2000 డినామినేషన్లలో బ్యాంకు నోట్లను జారీ చేస్తోంది. 50 పైసలు, రూ. 1, రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 20 నాణేలు చెలామణిలో ఉన్నాయి. పెరిగిన ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ నివేదిక ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాలెన్స్ షీట్ 8.46 శాతం పెరిగి రూ.61.9 లక్షల కోట్లకు చేరింది. కరెన్సీ జారీ కార్యకలాపాలు, ద్రవ్య విధానం, నగదు నిల్వల నిర్వహణ, ఇందుకు అనుగుణంగా నిర్వహించే విధులను ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ ప్రతిబింబిస్తుంది. సెంట్రల్ బ్యాంక్ ఆదాయం 20.14 శాతం పెరిగితే, వ్యయాలు భారీగా 280.13 శాతం పెరిగి 1,29,800.68 కోట్లకు చేరాయి. 2020–21లో మొత్తం మిగులు రూ.99,122 కోట్లయితే, 2021–22లో ఈ పరిమాణం 69.42 శాతం తగ్గి రూ.30,307.45 కోట్లకు చేరింది. ఈ మొత్తాన్ని కేంద్రానికి డివిడెండ్‌గా ఇవ్వాలని గతవారం ఆర్బీఐ నిర్ణయించింది. 2022 మార్చి నాటికి మొత్తం అసెట్స్‌లో దేశీయ అసెట్స్ వెయిటేజ్ 28.22 శాతం అయితే, ఫారిన్ కరెన్సీ అసెట్స్, పసిడి (గోల్డ్ డిపాజిట్లు, నిల్వలు) వాటా 71.78 శాతంగా ఉంది. 2021 మార్చి నాటికి ఈ వెయిటేజ్‌లు వరుసగా 26.42 శాతం, 73.58 శాతాలుగా ఉన్నాయి. గోల్డ్ హోల్డింగ్స్ ఇదే కాలంలో 695.31 మెట్రిక్ టన్నుల నుంచి 760.42 మెట్రిక్ టన్నులకు చేరింది. కాగా ఉద్యోగుల వ్యయాలు 19.19 శాతం తగ్గి రూ.4,788.03 కోట్ల నుంచి రూ.3,869.43 కోట్లకు తగ్గాయి. 2021–22లో వివిధ సూపర్‌యాన్యుయేషన్ ఫండ్స్‌కు (ఉద్యోగుల పెన్షన్ ప్రణాళికలకు) సంబంధించి చెల్లింపులు తగ్గడం దీనికి కారణం. సంస్కరణలు, ద్రవ్యోల్బణం కట్టడే కీలకం సుస్థిర, సమతౌల్య, సవాళ్లను ఎదుర్కొనగలిగే ఆర్థిక వృద్ధికి వ్యవస్థాగత సంస్కరణలు కీలకమని ఆర్బీఐ పేర్కొంది. ముఖ్యంగా మహమ్మారి సవాళ్లు, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్థిక సంస్కరణల వేగవంతం ముఖ్యమని వివరించింది. దీనితోపాటు ద్రవ్యోల్బణం కట్టడి, మూలధన వ్యయాల పెంపు, పటిష్ట ద్రవ్య విధానాలు, సరఫరాల సమస్యలు అధిగమించడం కూడా ఎకానమీ పురోగతిలో కీలకమని వివరించింది. ప్రస్తుతం ఎకానమీ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో ద్రవ్యోల్బణం ఒకటని వివరించింది. ఎకానమీ రికవరీలో స్పీడ్ తగ్గిందని కొన్ని హై–ఫ్రీక్వెన్సీ ఇండికేటర్లు సంకేతాలు ఇచ్చినట్లు తెలిపింది. ద్రవ్యోల్బణం కట్టడికి ప్రభుత్వ సహకారం, సమన్వయంతో ఆర్బీఐ తగిన అన్ని చర్యలూ తీసుకుంటుందని స్పష్టం చేసింది. భౌగోళిక ఉద్రిక్తతలు సమసిపోయి, కోవిడ్ తదుపరి వేవ్‌లు తగ్గితే తిరిగి ఎకానమీ స్పీడ్ అందుకుంటుందన్న భరోసాను వెలిబుచ్చింది. అధిక టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ధరలపై ఒత్తిడి తెస్తుందని ఆర్బీఐ పేర్కొంది. -
ఎక్మో ఎలాంటి సందర్భాల్లో వాడతారో తెలుసా?
ఇటీవల ఎక్మో అనే మాట చాలా సందర్భాల్లో వినిపించింది. తాజాగా ప్రముఖ సినీకవి సిరివెన్నెల సీతారామశాస్త్రికి అమర్చిన ఈ వైద్య పరికరాన్ని గతంలో ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం, అంతకు మునుపు తమిళనాడు మాజీ సీఎం జయలలిత.. లాంటి చాలామంది ప్రముఖులకు వాడారు. అలా ఇటీవల చాలా సందర్భాల్లో ఎక్మో అనే మాట వినిపించింది. అసలీ ఎక్మో అంటే ఏమిటో, దాన్ని ఎలాంటి సందర్భాల్లో వాడతారనే విషయాలపై అవగాహన కోసం ఈ సంక్షిప్త కథనం. ఈసీఎంఓ అనే ఇంగ్లిష్ పొడి అక్షరాలు ‘ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేనస్ ఆక్సిజనేషన్’ అనే పదాల ముందక్షరాలు. వీటన్నింటినీ కలిపి ‘ఎక్మో’ అంటారు. పేరునుబట్టే ఇది గాల్లోని ఆక్సిజన్ సమర్థంగా అందిస్తుందని తెలుస్తుంది. ఎక్స్ట్రా కార్పోరియల్ లైఫ్ సపోర్ట్ అని కూడా చెప్పే ఈ ఉపకరణాన్ని... ఊపిరితిత్తులు తమంతట తామే శుభ్రమైన ఆక్సిజన్ తో కూడిన (ఆక్సీజనేటెడ్) రక్తాన్ని అందించలేనప్పుడు వాడుతారు. ఎలా పని చేస్తుంది? ఎక్మో రెండు రకాలు. ఒకటి ఏ–వీ ఎక్మో, మరొకటి...వి–వి ఎక్మో.. ఇందులో వీ–వీ (వీనో–వీనస్) ఎక్మోను ఊపిరితిత్తుల పనితీరు బాగాలేనప్పుడు వాడతారు. అలాగే వీ–ఏ (వీనో – ఆర్టరీ) ఎక్మోను గుండె పనితీరు బాగాలేనప్పుడు (కార్డియో పల్మునరీ సపోర్ట్‌గా)వాడుతారు. ఎక్మో పరికరంలో ఆక్సిజనేటర్ గ్యాస్ ఎక్స్ఛేంజ్ పరికరం, అలాగే పంప్ అనేవి ముఖ్యమైన భాగాలు. మొదటగా ఒక పైప్ (డ్రైనేజ్ కాన్యులా) ద్వారా తొడలోని సిర నుంచి రక్తాన్ని తీసుకుని, అందులోంచి కార్బన్ డైయాక్సైడ్‌ను తొలగిస్తారు. తర్వాత ఆక్సిజన్‌ను రక్తంలోకి ఇంకేలా చేస్తారు. ఇలా చేశాక... ఆ శుద్ధి అయిన రక్తాన్ని మళ్లీ గుండెకు దగ్గర్లో ఉన్న సిరలోకి (వి–వి ఎక్మో) లేదా ధమనికి (వి–ఏ ఎక్మో) రిటర్న్ కాన్యులా ద్వారా పంపిస్తారు. అంతేకాదు... దానికి అమర్చి ఉన్న మానిటర్ మీద నాడి కొట్టుకునే స్పందనలూ, రక్తం ఎంత వేగంతో ప్రవహిస్తోందనే అంశాలు ఎప్పటికప్పుడు నమోదవుతూ ఉంటాయి. ఇదీ సంక్షిప్తంగా ఎక్మో పనిచేసే తీరు. నిజానికి ఇది గుండె చేసే పని కంటే ఊపిరితిత్తులు చేసే పనిని సమర్థంగా నిర్వహిస్తుంటుందని చెప్పవచ్చు. ఎప్పుడూ రోగగ్రస్థమైన వారికేనా? పైన పేర్కొన్న సెలబ్రిటీ ఉదాహరణలతో ఊపిరితిత్తులు బాగా చెడిపోయి, ఆక్సిజన్ అందని స్థితికి చేరిన బాధితులకే అమర్చుతారా అనే సందేహం వస్తుంది. కానీ కేవలం అలాంటి సందర్భాల్లోనే కాదు... గుండె మార్పిడి / ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స వంటివి జరిగినప్పుడు కూడా దీన్ని అమరుస్తారు. ఉదాహరణకు గుండె / ఊపిరితిత్తులు ఏమాత్రం పనిచేయని వారిలో బయటి దాతల నుంచి గుండె / ఊపిరితిత్తులను సేకరించి, అమర్చినప్పుడు ఒక్కోసారి వాటిని దేహం ఆమోదించదు. అలాంటి సమయాల్లో... బయటి గుండె/ఊపిరితిత్తులు దేహానికి అలవాటయ్యేవరకూ ‘ఎక్మో’ సహాయం తీసుకుంటారు. ‘ఎక్మో’తో సపోర్ట్ మొదలుపెట్టాక రోగి కోలుకుంటున్న తీరు నెమ్మదిగా జరుగుతుంది. కాబట్టి దీన్ని చాలా నిశితంగా పరిశీలిస్తూ ఉండాలి. రోగి స్పందన తెలియడానికి కనీసం ఐదు నుంచి ఏడు రోజులైనా వేచిచూడాల్సి ఉంటుంది. అలా చూస్తూ... ‘ఎక్మో’ సపోర్ట్‌ను నెమ్మది నెమ్మదిగా తగ్గిస్తూ పోతారు. ఈ సమయంల్లో అతడి ‘వైటల్స్’... అంటే పేషెంట్ పరిస్థితిని తెలిపే కీలకమైన కొలతలైన... పల్స్, బీపీ వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటారు. ఎక్మో సపోర్టు తగ్గించినప్పుడల్లా పల్స్ రేటూ, బీపీ, ఆక్సిజన్, కార్మబ్ డైఆక్సైడ్ శాతం... నార్మల్‌గా ఉన్నాయా అని చూస్తారు. అవి నార్మల్‌గా ఉన్నాయంటే రోగి కోలుకుంటున్నట్లు అర్థం. అలా క్రమక్రమంగా ఎక్మో సపోర్ట్‌ను తగ్గిస్తూ గుండె, ఊపిరితిత్తుల పనితీరు పూర్తిగా నార్మల్ అయ్యే వరకు రోగి కోలుకుంటున్న క్రమాన్ని చూస్తూ... ఐసీయూలో ఉంచి పర్యవేక్షిస్తూ ఉంటారు. ఎవరెవరిలో... ఎక్మో అమర్చాల్సిన పరిస్థితి సాధారణంగా గుండె ఆగినప్పుడు సీపీఆర్ ద్వారా స్పందనలు తిరిగి వచ్చి పంపు చేసే కేపాసిటి తక్కువ ఉన్నప్పుడు ఎక్మో ద్వారా రక్త ప్రసరణ జరిగి అన్ని అవయవాలు గుండె తిరిగి సాధారణ స్థితిలో పని చేయడానికి దోహదపడుతుంది. ఎక్మోతో పాటు బాధితుడికి డయాలసిస్ కూడా చేయాల్సినప్పుడు పేషెంట్ నుంచి రక్తాన్ని డయాలసిస్ యంత్రంలోకి నేరుగా వెళ్లేలా కాకుండా... ఎక్మో పరికరం ద్వారా డయాలసిస్ యంత్రానికి రక్తాన్ని సరఫరా అయ్యేలా చూస్తారు. గుండె ఆగిపోయిన సందర్భాల్లో దాని స్పందనలను పునరుద్ధరించడానికి బాధితుడి ఛాతీ మీద రెండు చేతులతోనూ నొక్కుతున్నట్లు చేసే సీపీఆర్ (కార్డియో పల్మునరీ రిససియేషన్) చేస్తూ, రక్తప్రసరణ జరుగుతున్నట్లు గుర్తించగానే వెంటనే ఎక్మో అమరుస్తారు. సాధారణంగా గుండె ఆగిపోగానే సీపీఆర్ ఇచ్చి, ఎక్మో ద్వారా రక్తప్రసరణ నార్మల్‌గా జరుగుతుంటే దేహంలో అన్ని అవయవాలూ సజావుగా పనిచేస్తున్నట్లే అనుకోవచ్చు. అప్పుడు క్రమక్రమంగా ఎక్మో సపోర్ట్‌ను తగ్గించుకుంటూ పోతారు. ఇలా చేసే సమయంలో ఎక్మో సపోర్ట్‌ను తగ్గిస్తున్నా... రోగిలోని వ్యవస్థలు తమంతట తాము స్వయంగా తమ విధులను నిర్వహించుకోలేని సందర్భాల్లో మాత్రమే రోగి కోలుకోవడం లేదనే నిర్ధారణకు డాక్టర్లు వస్తారు. చివరగా... ఎక్మో అమర్చడం ఓ చివరి ప్రయత్నంగా చేసే పని. దానిపై కొన్ని అపోహలున్నప్పటికీ... కొన్ని సందర్భాల్లో రోగులు పూర్తిగా కోలుకుని, వారు పూర్తిగా మళ్లీ తమ పూర్వస్థితికి వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. సక్కెస్ రేటు తక్కువా? సెలబ్రిటీల ఉదాహరణలతో గానీ లేదా గుండె, ఊపిరితిత్తులు పనిచేయనప్పుడు అమర్చుతారనే సందర్భాల వల్లగానీ ‘ఎక్మో’ పరికరంపై కొన్ని అపోహలు నెలకొని ఉన్నాయి. అందులో మొదటిది... దీన్ని అమర్చాల్సిన పరిస్థితి వచ్చిందంటే బాధితులు కోలుకునే అవకాశాలు తక్కువనీ లేదా ‘ఎక్మో’కు సక్సెస్ రేటు తక్కువనే అపప్రధ ప్రజల్లో ఉంది. దీనికి కారణం... ఓ పేషెంట్‌కు ఎక్మో అమర్చాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది చాలా తీవ్రంగా రోగగ్రస్థమైన స్థితి. అంతటి పరిస్థితుల్లో కోలుకునే అవకాశాలు వాస్తవంగా కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ... చాలా సందర్భాల్లో గుండెకు సంబంధించిన బాధితుల్లో 40 – 50 శాతం, ఊపిరతిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారిలో 60 – 70 శాతం సక్కెస్ రేటు ఉంటాయి. అంతగా రోగసిక్తమైనప్పటికీ 70 శాతం అంటే నిజానికి మంచి విజయావకాశాలు ఉన్నట్లే లెక్క. కానీ రోగి వయసు, అతడికి ఇంతకుముందే ఉన్న అనేక ఆరోగ్య సమస్యలు, ఇతర అనారోగ్యాలూ, రోగనిరోధక శక్తి, కోలుకునే సామర్థ్యం... లాంటి అనేక అంశాలు ఈ విజయావకాశాల (సక్సెస్ రేటు)ను ప్రభావితం చేస్తాయి. అందుకే ఈ అపోహ. డాక్టర్ శ్రీనివాస కుమార్ రావిపాటి సీనియర్ కన్సల్టెంట్ ట్రాన్స్‌ప్లాంట్ పల్మనాలజిస్ట్ -
పాత రూ.100 నోట్ల రద్దు: కేంద్రం క్లారిటీ
సాక్షి, న్యూఢిల్లీ: మార్చి-ఏప్రిల్ నాటికి పాత కరెన్సీ నోట్ల రూ.100, రూ.10, రూ.5ను చలామణి నుంచి శాశ్వతంగా తొలగిపోనున్నాయనే వార్తలపై కేంద్రం స్పందించింది. అలాంటి ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పాత వంద, పది, ఐదు రూపాయల నోట్లు రద్దు ఊహాగానాలను తప్పుడు నివేదికలుగా కొట్టిపారేసింది. మార్చి లేదా ఏప్రిల్ నాటికి రూ.100, రూ.10, రూ.5ల పాత సిరీస్ కరెన్సీ నోట్లను ఉపసంహరించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యోచిస్తోందని ఇటీవల కొన్ని నివేదికలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చింది. ఇది ఫేక్ న్యూస్ అని తేల్చి చెప్పింది. ఆర్బీఐ అలాంటి ప్రకటన చేయలేదని ట్వీట్ చేసింది. మరోవైపు ఆర్బీఐ ప్రతినిధి కూడా ఈ వార్తలను తోసిపుచ్చారు. ఈ నోట్లను ఉపసంహరించుకునే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేశారు. (రూ.100 నోటు షాకింగ్ న్యూస్!) కాగా, ఒక సమావేశంలో ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఎజిఎం) మహేష్ మాట్లాడుతూ ఆర్బీఐ త్వరలోనే పాత కరెన్సీ నోట్లు రూ.100, రూ.10, రూ.5 రద్దు చేయనుందని, ఈ నేపథ్యంలో 2021 మార్చి నుంచి ఈ నోట్లు చలామణిలో ఉండవని ప్రకటించారన్న వార్తలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. తాజా వివరణతో ఊరట లభించింది. एक खबर में दावा किया जा रहा है कि आरबीआई द्वारा दी गई जानकारी के अनुसार मार्च 2021 के बाद 5, 10 और 100 रुपए के पुराने नोट नहीं चलेंगे।#PIBFactCheck: यह दावा #फ़र्ज़ी है। @RBI ने ऐसी कोई घोषणा नहीं की है। pic.twitter.com/WiuRd2q9V3 — PIB Fact Check (@PIBFactCheck) January 24, 2021 -
భారీగా పెరిగిన రూ.500 నకిలీ నోట్లు
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా తన వార్షికనివేదికలను గురువారం ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దుతరువాత డిజిటల్ లావాదేవీకు కేంద్రం భారీ ప్రోత్సాహాన్నిస్తుండగా ఆర్బీఐ షాకింగ్ న్యూస్ చెప్పింది. 2018-19లో చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల పరిమాణం 6.2 శాతం పెరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో 108,759 మిలియన్ కరెన్సీ నోట్లు చెలామణిలో ఉన్నాయని సెంట్రల్ బ్యాంక్ తన వార్షిక నివేదికలో పేర్కొంది. ప్రధానంగా 500 రూపాయల నోట్ల చలామణి గణనీయంగా పెరిగింది. ఈ సంవత్సరంలో 42.9 శాతం నుంచి 51.0 శాతానికి పెరిగిందని నివేదిక తెలిపింది. దీంతో పాటు రూ.500, రూ.2వేల నకిలీ నోట్ల చలామని కూడా భారీగా పెరగడం గమనార్హం. దీంతో నరేంద్రమోదీ సర్కార్ కల డిజిటల్ ఎకానమీ కలకు చెక్‌పడింది. 2018-19లో చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల విలువ 17 శాతం పెరిగి రూ .211.11 లక్షల కోట్లకు చేరుకుంది. విలువ పరంగా, 2019 మార్చి చివరి నాటికి రూ .500, రూ .2,000 నోట్ల వాటా 82.2 శాతానికి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో, మొత్తం నోట్ల విలువలో వీటి వాటా 80.2 శాతంగా ఉంది. 2019 మార్చి చివరి నాటికి చెలామణిలో ఉన్న మొత్తం నోట్లలో వాల్యూమ్ పరంగా, రూ .10 , రూ .100 నోట్లు 47.2 శాతంగా ఉంది. 2018 మార్చి చివరి నాటికి ఇది 51.6 శాతంగా నమోదైంది. గత సంవత్సరం 2.4 శాతం పెరుగుదలతో పోలిస్తే 2018-19లో చెలామణిలో ఉన్న నాణేల మొత్తం విలువ 0.8 శాతం పెరిగింది. అంతకుముందు సంవత్సరంలో 2.4 శాతం పెరుగుదలతో పోలిస్తే మొత్తం వాల్యూమ్ 1.1 శాతం పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరం ముగింపులో రూ.1, రూ .2, రూ .5 నాణేలు మొత్తం చెలామణిలో ఉన్న నాణేల పరిమాణంలో 83.6 శాతం ఉన్నాయి. విలువ పరంగా వీటి వాటా 78.3 శాతం. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే, రూ .10, రూ .20, రూ .50 అనే డినామినేషన్లలో వరుసగా 20.2 శాతం, 87.2 శాతం, 57.3 శాతం నకిలీ నోట్లు పెరిగాయి. అయితే రూ.100ల నకిలీ నోట్లు మాత్రం 7.5 శాతం తగ్గాయి. ఆగస్టు 2017లో ప్రవేశపెట్టిన రూ .200 నోట్లలో అంతకుముందు సంవత్సరంలో 79 పోలిస్తే... 12,728 నకిలీ నోట్లను గుర్తించినట్టు ఆర్బీఐ నివేదించింది. అలాగే ఈ ఏడాది రూ .500ల (కొత్త డిజైన్ నోట్స్) నకిలీ నోట్లు 121.0 శాతం పెరగ్గా, రూ. 2వేల నోట్లలో నకిలీవి 21.9 శాతం పెరిగిందని సెంట్రల్ బ్యాంక్ తన నివేదికలో పేర్కొంది. బ్యాంకు కుంభకోణాలు : 2019 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు మోసాల మొత్తం విలువ 74 శాతం ఎగిసి రూ. 72వేల కోట్లుగా ఉంది. ఇందులో ప్రభుత్వ బ్యాంకులది 90 శాతం వాటా. -
ఎమ్మిగనూరులో దొంగనోట్లు
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలో రూ.500 నకిలీ నోట్లు చలామణి అవుతున్నట్లు సమాచారం ఉండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఏది నకిలీదో.. ఏది ఒరిజినలో తెలియక అసలు రూ. 500 నోట్లు తీసుకునేందుకే జంకుతున్నారు. నకిలీ కరెన్సీగా చెబుతున్న రూ. 500 నోట్లు ఒరిజినల్ నోటుకు ఏమాత్రం తీసిపోకుండా ఉండడంతో గుర్తించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వ్యాపారం రద్దీగా సాగుతున్న పశువుల మార్కెట్, కూరగాయల మార్కెట్, కిరాణం షాపుల వద్ద దొంగ నోట్ల మార్పిడి జరుగుతున్నట్లు తెలుస్తోంది. -
నోట్ల చలామణి తగ్గిపోయింది!
పెద్ద నోట్ల రద్దు అనంతరం కరెన్సీ వాడకంపై పెడుతున్న ఆంక్షలు, డిజిటల్ లావాదేవీల వాడకం నోట్ల చలామణిని తగ్గించేశాయి. నోట్ల రద్దు అనంతరం కేవలం ఈ క్వార్టర్లో రూ.11.73 లక్షల కోట్ల కరెన్సీ నోట్లు మాత్రమే చలామణిలో ఉన్నాయని నేడు ప్రభుత్వం పార్లమెంట్ కు తెలిపింది. గతేడాది ఇదే క్వార్టర్లో రూ.16.41 లక్షల కోట్ల కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయని పేర్కొంది. ఈ విషయాన్ని ఆర్థికశాఖ సహాయమంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ లోక్ సభకు లిఖితపూర్వకంగా తెలిపారు. 21014 మార్చి 31 న రూ.12.82 లక్షల కోట్ల నోట్లు చలామణిలో ఉన్నాయని, అవి 2015 మార్చి 31కి వచ్చేసరికి రూ.14.28కోట్లకు పెరిగాయని చెప్పారు. 2016 మార్చిలో మరింత పెరిగి రూ.16.41 లక్షల కోట్లకు చేరినట్టు తెలిపారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దుతో నోట్ల చలామణి తగ్గినట్టు తెలిసింది. నవంబర్ 8న ప్రధాని తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో 86 శాతం కరెన్సీ నోట్ల చలామణిలోంచి వెనక్కి వెళ్లాయి. నోట్ల రద్దు అనంతరం ప్రభుత్వం కొత్త రూ.500, రూ.2000 నోట్లను చలామణిలోకి తెచ్చింది. 2017 ఫిబ్రవరి వరకు రూ.1.9 బిలియన్ల రూ.5 కాయిన్లు, రూ.1.03 బిలియన్ల రూ.10 కాయిన్లు చలామణిలో ఉన్నట్టు మేఘ్వాల్ చెప్పారు. అంతేకాక 2.6 బిలియన్ల రూ.10 నోట్లు, 3.6 బిలియన్ల రూ.20 నోట్లు మార్కెట్లో చలామణి అవుతున్నట్టు వెల్లడించారు. -
త్వరలో చలామణిలోకి రూ.2,000 నోటు
-
త్వరలో చలామణిలోకి రూ.2,000 నోటు
సాక్షి, అమరావతి: త్వరలో రూ.2,000 నోట్లు చలామణిలోకి రానున్నాయి. దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కసరత్తు పూర్తి చేసింది. పెరుగుతున్న ధరలను (ద్రవ్యోల్బణం) దృష్టిలో పెట్టుకొని అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లకు డిమాండ్ పెరుగుతుండటంతో రూ.2,000 నోటును విడుదల చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఇప్పటికే మైసూర్లో ఉన్న కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్‌లో ఈ నోట్ల ముద్రణ పూర్తయి కరెన్సీ చెస్ట్‌లకు పంపిణీ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటివరకు రూ. 1,000 డినామినేషన్ నోటే అధిక కరెన్సీ నోటుగా చలామణిలో ఉంది. ఇప్పుడు ఈ స్థానాన్ని రూ.2,000 నోటు ఆక్రమించే అవకాశం ఉంది. ఒకవైపు దేశంలో నల్లధనం అరికట్టడానికి రూ. 500, రూ.1,000 నోట్లను రద్దు చేయాలని వివిధ వర్గాల నుంచి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆర్బీఐ తాజా గణాంకాల ప్రకారం మార్చి, 2016 నాటికి రూ.16,41,500 కోట్ల కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయి. ఇది గతేడాదితో పోలిస్తే 15 శాతం వృద్ధికి సమానం. ఇందులో రూ. 500, రూ. 1,000 నోట్లే 86.4 శాతం వరకు ఉన్నాయి. అధిక నోట్లవైపే మొగ్గు.... మన కరెన్సీ చరిత్ర చూస్తే ఇప్పటివరకు రూ. 10,000 నోటే అత్యధిక డినామినేషన్ నోటుగా రికార్డులకు ఎక్కింది. 1978లో నల్లధనం అరికట్టడానికి రూ. 10,000, రూ. 5,000, రూ. 1,000 నోట్లను నాటిప్రభుత్వం రద్దు చేసింది. 2000 సంవత్సరంలో తిరిగి రూ. 1,000 నోటును ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు తొలిసారిగా కొత్త డినామినేషన్ రూ. 2,000 నోటు ప్రవేశానికి రంగం సిద్ధమయ్యింది. నగదురహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నా కరెన్సీ నోట్లకు డిమాండ్ పెరుగుతుండటంతో కొత్త నోట్ల ముద్రణ ఆర్బీఐకి తలకు మించిన భారంగా మారింది. రూ.1,000 నోటు ముద్రణకు రూ.3 వ్యయం అవుతోంది. ఇదే అతి తక్కువ ముద్రణా వ్యయం. వివిధ డినామినేషన్లతో కూడిన నోట్లను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం సూచించడంతో ఆర్బీఐ ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
మూకుమ్మడిగా 350 చట్టాల అన్వయింపు
సర్క్యులేషన్ విధానంలో ఆమోదించిన రాష్ట్ర కేబినెట్ సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 350 చట్టాలను ఒకేసారి అన్వయిం చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫైళ్లు సిద్ధం చేసింది. పునర్విభజన చట్టం ప్రకా రం రాష్ట్రం ఏర్పడిన రెండేళ్లలోగా ఉమ్మడి రాష్ట్ర చట్టాలను దత్తత తీసుకోవాల్సి ఉం ది. లేని పక్షంలో వాటన్నింటినీ తెలంగాణ ప్రభుత్వం బిల్లుల రూపంలో ప్రవేశపెట్టి.. కొత్తగా చట్టాలు చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. జూన్ 2తో తెలంగాణ ఏర్పడి రెండేళ్లు పూర్తవనున్నందున ప్రభుత్వం ఆగమేఘాలపై రాష్ట్రానికి అవసరమైన చట్టాలన్నీ ఒకేసారి దత్తత తీసుకునే ప్రక్రియ చేపట్టింది. మొత్తం 350 చట్టాలను దత్తత తీసుకునేందుకు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం పొందాల్సి ఉండటంతో.. వారం రోజుల కిందటే ప్రభుత్వం మెమ రాండం సిద్ధం చేసింది. సర్క్యులేషన్ విధానంలో ప్రతిపాదన పంపి ఈ నెల 25న మంత్రిమండలి ఆమోదం కూడా తీసుకుంది. ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులివ్వను న్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. సమైక్య రాష్ట్రంలోని ఏయే చట్టాలు, సవరింపులు, నిబంధనలు, రెగ్యులేషన్లు తెలంగాణకు అవసరమనే అంశంపై ప్రభుత్వం భారీ కసరత్తు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలోని యాక్ట్ నంబరింగ్ రిజిస్టర్లో మొత్తం 1,600 చట్టాలున్నాయి. వీటిలో అక్కర్లేనివి పక్కన పెట్టాలని, ఒకే తీరుగా ఉన్న వాటి ని క్రోడీకరించాలని, కాలం చెల్లిన వాటిని పరిహరించాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. అవసరం మేరకు అడపా దడపా ఓ 62 చట్టాలను దత్తత తీసుకుంది. మిగిలినవి 288 వరకు ఉంటాయని అంచనా వేసింది. నివేదికను సమర్పించిన నల్సార్ నల్సార్ వర్సిటీ వారం రోజుల కిందట తమ నివేదికను సీసీఎల్ఏకు సమర్పించిం ది. నల్సార్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో 15 మంది నిపుణుల బృందం వీటిని కూలంకషంగా అధ్యయనం చేసి, నివేదికిచ్చింది. తెలంగాణలో ఒకేవిధమైన ల్యాండ్ రెవెన్యూ కోడ్ ఆవశ్యకత ఉందని అందులో స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంత ప్రజల భూ పరిరక్షణ, పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణకు ల్యాం డ్ రెవెన్యూ కోడ్ దోహదపడుతుందంది. భూ వివాదాల సత్వర పరిష్కారానికి ల్యాండ్ ట్రిబ్యునల్, స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించింది. వర్సిటీ విశ్లేషించిన 112 చట్టాల్లో 52 పూర్తిస్థాయి చట్టాలు, 60 సవరణలు ఉన్నాయి. వీటిని మూడుగా వర్గీకరించారు. 10 పూర్తి స్థాయి చట్టాలు, 32 సవరణలు రాష్ట్రానికి కీలకమని సూచించిన నిపుణులు మరో 27 చట్టాలు, 14 సవరణలు ప్రస్తుతం అనవసరమని తేల్చారు. మూడో విభాగంలో 15 చట్టాలు, 11 సవరణలను ప్రస్తావించింది. వీటిలో జిల్లా కలెక్టర్ల అధికారాలు, కొత్త జిల్లాల ఏర్పాటు, వాటర్ ట్యాక్స్, డ్రైనేజీ సెస్ తదితర అంశాలకు సంబంధించిన చట్టాలున్నాయి. -
కొంగలు నీటిలో ఎందుకు నిలబడతాయంటే...
జంతు ప్రపంచం ఒకప్పుడు కొన్ని వందల రకాల జాతుల కొంగలు ఉండేవి. కానీ క్రమంగా అంతరించిపోయి ఇప్పుడు పదిహేను జాతులు మాత్రమే మిగిలాయి!వీటికి ఇవే తినాలన్న నియమం ఏమీ ఉండదు. ఎప్పుడేది దొరికితే అది తినేసి కడుపు నింపుకుంటాయి. చేపలు, పురుగులు, పండ్లు, గింజలు, మొక్కలు... ఏవైనా సరే! ఇవి మూడు నుంచి ఐదేళ్ల వయసు వచ్చేవరకూ జతకట్టవు. ఒక్కసారి జతకట్టాక జీవితాంతం దానితోనే ఉంటాయి. అది చనిపోయినా సరే... మరోదానికి దగ్గర కావు! కొంగలలో ఐకమత్యం చాలా ఎక్కువ. ఒక కొంగకి ఏదైనా ప్రమాదం వాటిల్లితే... అది ఒక రకమైన శబ్దం చేస్తుంది. ఈ శబ్దం దాదాపు రెండు కిలోమీటర్ల వరకూ వినిపిస్తుంది. దాన్ని గుర్తుపట్టిన ఇతర కొంగలన్నీ వచ్చేస్తాయి. కలసికట్టుగా శత్రువుతో పోరాటం జరుపుతాయి! కొంగలు గంటలపాటు చల్లటి నీటిలో నిలబడి ఎందుకు ఉంటాయో తెలుసా? శరీర ఉష్ణోగ్రతను సమన్వయం చేసుకోవడానికి ఇవి రక్తప్రసరణ వేగాన్ని నియంత్రించుకునే ప్రయత్నం చేస్తుంటాయి. అందుకోసం కాళ్లలో ఉండే రక్తనాళాలను బిగబడతాయి. దానికోసమే గడ్డకట్టించేంత చల్లటి నీటిలో గంటలసేపు నిలబడిపోతాయి! వీటి కాళ్లు చాలా బలంగా ఉంటాయి. శత్రువులు దాడి చేసినప్పుడు తమ కాళ్లతోనే ప్రతిఘటిస్తాయి! కొంగలు ప్రపంచమంతా ఉన్నాయి. కానీ అంటార్కిటికా, దక్షిణ అమెరికాల్లో మాత్రం ఎక్కడా ఒక్క కొంగ కూడా కనిపించదు. -
మన రూపాయే మహారాజు..
ప్రపంచంలో అమెరికన్ డాలర్‌కు ఉండే ప్రాధాన్యం ఎలా ఉన్నా.. మన రూపాయికి కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. చలామణీలో ఉన్న కరెన్సీ నోట్ల సంఖ్య విషయంలో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే మన రూపాయి చాలా ముందుంటుంది. దేశీ కరెన్సీకి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలివీ.. 1. రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం 2012-13 నాటికి దేశంలో అక్షరాలా 7,647 కోట్ల బ్యాంకు నోట్లు చలామణీలో ఉన్నాయి. అమెరికన్ డాలర్లతో పోలిస్తే ఇది రెట్టింపు. అమెరికాలో 3,450 కోట్ల నోట్లు మాత్రమే చలామణీలో ఉన్నాయి. యూరోజోన్‌తో పోలిస్తే అయిదు రెట్లు ఎక్కువ. అక్కడ 1,580 కోట్ల కరెన్సీ నోట్లు చలామణీలో ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, యూరోజోన్ , ఆస్ట్రేలియా, కెనడా కరెన్సీ నోట్లన్నీ కలిపినా కూడా మన ముందు బలాదూరే. ఇవన్నీ కలి పినా సంఖ్య 5,644 కోట్ల క్యాష్ నోట్లను మించదు. ఇక, నాణేల విషయానికొస్తే.. మన దగ్గర 8,991 కోట్ల కాయిన్లు సర్క్యులేషన్లో ఉన్నాయి. 2. విలువ పరంగా చూస్తే మన కరెన్సీ నోట్ల విలువ రూ. 12,46,800 కోట్లు కాగా, కాయిన్ల విలువ రూ. 16,800 కోట్ల పైచిలుకు ఉంటుంది. అదే అమెరికన్ కరెన్సీ నోట్ల విలువ 1,198 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 72 లక్షల కోట్లు). 3. మన దగ్గర కరెన్సీ నోట్ల ముద్రణ కూడా భారీగానే ఉంటోంది. 2013లో ప్రపంచవ్యాప్తంగా 15,400 కోట్ల కరెన్సీ నోట్లను ముద్రించగా, భారత్ సుమారు 2,000 కోట్ల నోట్లను ముద్రించింది. దాదాపు 5,400 కోట్ల నోట్లతో చైనా అగ్ర స్థానంలో నిల్చింది. 4. డబ్బు ముద్రించడానికే కాదు.. పాతబడిపోయినవాటిని ధ్వంసం చేయడానికీ బోలెడంత ఖర్చవుతుంది. ఇందుకు కావాల్సిన యంత్రాల కొనుగోలు, మెయింటెనెన్స్‌కు ఆర్బీఐకి రూ. 523 కోట్లు ఖర్చయ్యింది. 5. కరెన్సీ ముద్రణ ఖర్చుల విషయానికొస్తే.. రూ.10 విలువ ఉండే నోటును ప్రింట్ చేయాలంటే 96 పైసలు ఖర్చవుతుంది. అదే రూ. 100 నోటు ముద్రణకు రూ. 1.79 వ్యయమవుతుంది. రూ. 20 నోటుకు రూ. 1.50, రూ. 50 నోటుకు రూ. 1.81 ఖర్చవుతుంది. 100 నోటు కన్నా 50 రూపాయల నోటు ముద్రణ ఖర్చే ఎక్కువ ఉండటం గమనార్హం. ఇక, రూ. 500 నోటును ప్రింట్ చేయడానికి రూ. 3.58, రూ. 1,000 నోటు ముద్రణకు రూ. 4.06 ఖర్చవుతుంది. పదిరూపాయల నాణెం తయారికి రూ. 6.10 వ్యయమవుతుంది. -
దొంగనోట్లు చెలామణి చేస్తున్న ఇద్దరి అరెస్ట్
విజయనగరం టౌన్, న్యూస్‌లైన్ : పట్టణంలో దొంగనోట్లు చెలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను సీసీఎస్ పోలీసులు శని వారం ఉదయం గాజులరేగ సమీపంలో అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 32 వంద రూపాయల నకిలీ నోట్లను, రూ.38 వేల నగదు, దొంగనోట్ల తయారీకి వినియోగించే నల్ల కాగితా ల క ట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీసీఎస్ సీఐ ఎ.వి.రమణ శనివారం స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం వెల్లడించారు. పట్టణానికి చెందిన గొర్లె హేమచంద్ర, గంగళ్ల అజయ్‌కుమార్‌లు కశింకోటకు చెందిన శంకరరావుతో స్నేహం ఏర్పరచుకుని దొంగనోట్లు చెలామణి చేయడానికి ప్రణాళిక రచించారు. గాజుల రేగ ప్రాంతంలో నకిలీ నోట్లు మారుస్తుండగా.. విశ్వసనీయ సమాచారం మేరకు సీసీఎస్ బృందం వలపన్ని పట్టుకుంది. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, మరో నింది తుడు శంకరరావు ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు సీఐ రమణ తెలిపారు. వీరిపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయని చెప్పారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సీఐలు టి.కల్యాణి, సీసీఎస్ ఎస్సై సన్యాసిరావు, వన్‌టౌన్ ఎస్సై ధనుంజయరావు పాల్గొన్నారు.