
త్వరలో చలామణిలోకి రూ.2,000 నోటు
సాక్షి, అమరావతి: త్వరలో రూ.2,000 నోట్లు చలామణిలోకి రానున్నాయి. దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కసరత్తు పూర్తి చేసింది. పెరుగుతున్న ధరలను (ద్రవ్యోల్బణం) దృష్టిలో పెట్టుకొని అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లకు డిమాండ్ పెరుగుతుండటంతో రూ.2,000 నోటును విడుదల చేయాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. ఇప్పటికే మైసూర్‌లో ఉన్న కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్‌లో ఈ నోట్ల ముద్రణ పూర్తయి కరెన్సీ చెస్ట్‌లకు పంపిణీ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇప్పటివరకు రూ. 1,000 డినామినేషన్ నోటే అధిక కరెన్సీ నోటుగా చలామణిలో ఉంది. ఇప్పుడు ఈ స్థానాన్ని రూ.2,000 నోటు ఆక్రమించే అవకాశం ఉంది. ఒకవైపు దేశంలో నల్లధనం అరికట్టడానికి రూ. 500, రూ.1,000 నోట్లను రద్దు చేయాలని వివిధ వర్గాల నుంచి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఆర్‌బీఐ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆర్‌బీఐ తాజా గణాంకాల ప్రకారం మార్చి, 2016 నాటికి రూ.16,41,500 కోట్ల కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయి. ఇది గతేడాదితో పోలిస్తే 15 శాతం వృద్ధికి సమానం. ఇందులో రూ. 500, రూ. 1,000 నోట్లే 86.4 శాతం వరకు ఉన్నాయి.
అధిక నోట్లవైపే మొగ్గు....
మన కరెన్సీ చరిత్ర చూస్తే ఇప్పటివరకు రూ. 10,000 నోటే అత్యధిక డినామినేషన్ నోటుగా రికార్డులకు ఎక్కింది. 1978లో నల్లధనం అరికట్టడానికి రూ. 10,000, రూ. 5,000, రూ. 1,000 నోట్లను నాటిప్రభుత్వం రద్దు చేసింది. 2000 సంవత్సరంలో తిరిగి రూ. 1,000 నోటును ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు తొలిసారిగా కొత్త డినామినేషన్ రూ. 2,000 నోటు ప్రవేశానికి రంగం సిద్ధమయ్యింది. నగదురహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నా కరెన్సీ నోట్లకు డిమాండ్ పెరుగుతుండటంతో కొత్త నోట్ల ముద్రణ ఆర్‌బీఐకి తలకు మించిన భారంగా మారింది. రూ.1,000 నోటు ముద్రణకు రూ.3 వ్యయం అవుతోంది. ఇదే అతి తక్కువ ముద్రణా వ్యయం. వివిధ డినామినేషన్లతో కూడిన నోట్లను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం సూచించడంతో ఆర్‌బీఐ ఆ దిశగా అడుగులు వేస్తోంది.