ముంబై: వ్యవస్థలో నగదు చలామణి కొంత తగ్గింది. ఫిబ్రవరి 9తో ముగిసిన వారంలో నగదు చలామణి వృద్ధి 3.7 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలానికి వృద్ధి 8.2 శాతంగా ఉన్నట్టు ఆర్‌బీఐ తన తాజా నివేదికలో వెల్లడించింది. తాజాగా నగదు చలామణి వృద్ధి నీరసించడానికి రూ.2,000 నోట్ల ఉపసంహరణ కారణమని పేర్కొంది. నగదు చలామణి అంటే ప్రజల వద్ద వినియోగంలో ఉన్న కాయిన్లు, నోట్లు.
వాణిజ్య బ్యాంకులు జనవరిలో డిపాజిట్లకు సంబంధించి రెండంకెల వృద్ధిని చూపించగా, రూ.2,000 నోట్ల ఉపసంహరణ ఈ వృద్ధికి మద్దతుగా నిలిచినట్టు ఆర్‌బీఐ తెలిపింది. రిజర్వ్ మనీ (చలామణిలో ఉన్న నోట్లు, కాయిన్లు, ఆర్‌బీఐ వద్దనున్న బ్యాంక్‌ల డిపాజిట్లు) ఫిబ్రవరి 9తో ముగిసిన వారంలో 5.8 శాతానికి తగ్గింది. ఏడాది క్రితం ఇదే కాలంలో ఇది 11.2 శాతంగా ఉంది. ఇందులో బ్యాంకుల డిపాజిట్లు కాకుండా, చలామణిలో ఉన్న కాయిన్లు, నోట్ల వరకే చూస్తే వృద్ధి 3.7 శాతం కాగా, ఏడాది క్రితం 8.2 శాతంగా ఉంది.
2023 మే 19న రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించడం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 31 నాటికి వ్యవస్థలోని మొత్తం రూ.2,000 నోట్లలో 97.50 శాతం తిరిగి బ్యాంకుల్లోకి వచ్చాయి. ఇప్పటికీ రూ.8,897 కోట్ల విలువ చేసే రూ.2,000 నోట్లు ప్రజల వద్దే ఉన్నాయి. 2023 మే 19 నాటికి వ్యవస్థలో చలామణిలోని మొత్తం రూ.2,000 నోట్ల విలువ రూ.3.56 లక్షల కోట్లుగా ఉంది. అయితే, ఈ నోట్ల జమ, మారి్పడి సేవలను 2023 అక్టోబర్ 7 నుంచి బ్యాంకులు నిలిపివేశాయి.
Comments
Please login to add a commentAdd a comment