నోటు కాడి కూడు
ఈ నోట్ల రద్దు భారమెంత?
చలామణీలో ఉన్న పెద్ద నోట్లను ఉపసంహరిస్తూ నవంబర్ 8 రాత్రి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ ఆర్థిక రంగంలోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. ఈ నోట్ల ఉపసంహరణ వల్ల ఈ ఏడాది డిసెంబర్ 30 కల్లా దాదాపుగా రూ. 1.3 ట్రిలియన్ల (లక్షా 30 వేల కోట్ల రూపాయల) మేర భారం పడుతుందని ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ’ (సి.ఎం.ఐ.ఇ) తాజా నివేదికలో పేర్కొంది.
►గృహస్థులపై భారం (వేతనాల నష్టం వల్ల) రూ.15,000 కోట్లు
►బ్యాంకులపై భారం (ఓవర్‌హెడ్ కాస్ట్‌ల సహా అనేకం వల్ల) రూ. 35,100 కోట్లు
► ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకుపై (కొత్త కరెన్సీ తతంగంతో) రూ. 16,800 కోట్లు
►వ్యాపారాలపై భారం (నోట్ల రద్దు, వగైరాతో నష్టం వల్ల) రూ. 61,500 కోట్లు
►మొత్తం భారం రూ.1,28,000 కోట్లు
రద్దు ప్రభావం... నిపుణుల అంచనా!
మచ్చుకు కొన్ని రంగాల్లో...
ఆర్థికవ్యవస్థలోని వివిధ రంగాలపై పడ్డ దుష్ర్పభావం వల్ల మన దేశ ‘స్థూల జాతీయోత్పత్తి’ (జి.డి.పి) పెరుగుదల తగ్గిపోనుంది.
కంపెనీల సంగతికొస్తే, ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ రంగాల్లో డిమాండ్ తగ్గుతుంది. దేశంలో చలామణీ ఉన్న కరెన్సీ విలువలో దాదాపు 86 శాతం రద్దవడంతో, వినియోగదారుల కొనుగోలు స్వభావం మారిపోయింది. కేవలం అత్యవసర వస్తువులైతేనే కొంటున్నారు. చిల్లర బయటకు తీయకుండా, అతి భద్రంగా దాచుకుంటున్నారు.జనం చేతిలో డబ్బులు ఆడకపోవడంతో, వినియోగదారుల ప్యాకేజ్డ్ గూడ్స్ అమ్మకాలపై గట్టి దెబ్బ పడింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు రెంటిలోనూ డీలర్ల దగ్గరకు హోల్‌సేలర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ వచ్చి సరుకులు తీసుకోవడం లేదు.
కొత్త కరెన్సీకి... కనీసం 6 నెలలు!
పెద్ద నోట్లను ముద్రించగల మన దేశ కరెన్సీ ప్రెస్‌లు రెండింట్లోనూ, రోజుకు మూడు షిఫ్టులూ ఆపకుండా పనిచేసినా, ఇప్పుడున్న పాత నోట్ల స్థానంలో కొత్త నోట్లను ప్రవేశపెట్టడానికి వచ్చే ఏడాది మే నెల దాకా పడుతుంది. ఈ లోగా కొందరు డిజిటల్ చెల్లింపుల వైపు మళ్ళినా, కొంత పెద్దనోట్ల కరెన్సీ డిసెంబర్ 30 నాటికి మార్పిడిలోకి రాకుండా చిత్తుకాగితాలుగా మారిపోయిందనుకున్నా సరే - ఆ మిగిలిన పాత నోట్లన్నిటికీ కొత్త కరెన్సీ తేవడం సులభమేమీ కాదు.
ఎలా చేయాల్సింది? ఏవేం చేసి ఉండాల్సింది?
ముందుగానే రూ. 100, రూ. 50, రూ. 10 లాంటి చిన్న నోట్లను పెద్ద సంఖ్యలో ముద్రించి, మార్కెట్లోకి తీసుకురావాల్సింది.{పస్తుత సీజన్లో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల కొనుగోలు కోసం ఇబ్బంది పడే రైతులనూ, పెళ్ళిళ్ళ లాంటి తప్పనిసరి ఖర్చులున్నవాళ్ళనూ దృష్టిలో పెట్టుకొని ముందుగానే వెసులుబాట్లు ఇవ్వాల్సింది. జనం హాహాకారాల తర్వాత ప్రభుత్వం ఆలస్యంగా కళ్ళు తెరిచింది. {పభుత్వ ఆసుపత్రుల్లోని రోగులకు, ప్రభుత్వ రంగంలోని ఏజెన్సీల నుంచి విత్తనాలు కొనే రైతులకు మాత్రమే పాత నోట్లను అనుమతిస్తామన్నారు. కానీ, దాన్ని ప్రైవేట్ రంగంలోని ఆస్పత్రులకు, విత్తనాల విక్రయ సంస్థలకు కూడా అనుమతిస్తే ఇబ్బందులు తగ్గేవి.సహకార గ్రామీణ బ్యాంకుల్లో పాత నోట్లను తీసుకోవడానికి అనుమతిని ఇచ్చినట్లే ఇచ్చి, తీసేశారు. దీని వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు మచ్చుకైనా లేక కో-ఆపరేటివ్ బ్యాంకుల మీదే ఆధారపడ్డ కొన్ని లక్షల గ్రామాల్లో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
ఇప్పటికీ అక్షరాస్యతే పూర్తిగా సాధించని మన దేశంలో గ్రామీణ రైతులకే కాదు... చదువుకొన్న చాలామందికి కూడా డిజిటల్ చెల్లింపులు, నెట్ వినియోగంపై పూర్తి అవగాహన లేదు. గ్రామీణ ప్రాంత సామాన్యులకైనా శిక్షణనిచ్చి, తర్వాత డిజిటల్ వైపు ప్రోత్సహించాల్సింది. దేశంలో ఒక శాతం జనాభా వద్దే, లెక్కల్లో చూపని డబ్బు 60 శాతం ఉంది.
నిపుణులు ఏమంటున్నారంటే...
బ్లాక్ మనీ నిర్మూలనకే అంటూ సర్కారు తీసుకున్న నిర్ణయం మంచిదైనా, దాని అమలుకు అనుసరించిన పద్ధతి లోపభూయిష్ఠంగా ఉందని ఆర్థిక నిపుణుల మాట. అసలు ఈ ఆలోచన ద్వారా దొంగ డబ్బు నిర్మూలన ఎలా సాధ్యమని ఆర్థిక రంగ దిగ్గజాలు ప్రశ్నిస్తున్నారు.
సామాన్యుడికి దెబ్బే!
‘‘నోట్ల రద్దుతో కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్వల్పకాలిక కష్టాల్ని తట్టుకోవాలని కేంద్రం కోరింది. జనం సిద్ధమయ్యారు. కానీ, దీర్ఘకాలిక లాభం ఏమిటి? ఎప్పుడు వస్తుంది? జనాభాలో చాలామంది పని చేస్తూ, నగదుపై ఆధారపడి నడిచే అసంఘటిత రంగంలో డబ్బుల కొరత వచ్చి పడింది. రైతులు, జాలర్లు, కూరగాయలు అమ్ముకొనేవాళ్ళు, చిన్న షాపుల వాళ్ళు, ట్యాక్సీ డ్రైవర్లు, ట్రక్కుల వాళ్ళు జీవనోపాధి కోల్పోయారు. రియల్ ఎస్టేట్ దెబ్బ తినడంతో సిమెంటు, స్టీల్, పెయింట్, గ్లాస్ కొనుగోళ్ళు పడిపోతున్నాయి. రోజు వారీ జీతాల కూలీలు రోడ్డున పడ్డారు. ఒక్క మాటలో దేశంలో అవినీతినీ, బ్లాక్‌మనీ సృష్టినీ అరికట్టాలంటే, సమగ్ర వ్యూహం అవసరం. పెద్ద నోట్ల ఉపసంహరణ అందులో ఒక అంశమైతే కావచ్చేమో కానీ, దానితోనే అంతా చక్కదిద్దుతామని అంటే, అది పొరపాటు!’’
- మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, ఒకప్పటి ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్
కార్డులు వాడేది ఎందరు?
►2.7 కోట్లు... ఇప్పుడు ఇండియాలో ఉన్న క్రెడిట్ కార్డ్‌ల సంఖ్య ఇది.
►కార్డుల్లో ఎక్కువ మధ్యతరగతి, ఉన్నతాదాయ వర్గాలవే! దిగువ వర్గాల్లో పాస్టిక్ మనీ అరుదు.
►కార్డ్‌ల సంఖ్యను బట్టి చూస్తే, ఇప్పటి దాకా మన దేశంలో ప్రతి వ్యక్తీ కేవలం 6.7 లావాదేవీలే కార్డులతో చేస్తున్నారు. అదే కొరియాలో ఒక్కొక్కరూ 260.8 కార్డు లావాదేవీలు చేస్తున్నారు.
►మన జనాభా 130 కోట్లు! ఏ.టి.ఎం.లు 2.2 లక్షలే!
► ప్రతి 10 లక్షల మందికీ అమెరికాలో అయితే 1500 ఏ.టి.ఎం.లున్నాయి. చైనాలో అయితే, 350 ఏ.టి.ఎం.లు ఉన్నాయి. మన దేశంలో మాత్రం దాదాపు 130 ఏ.టి.ఎం.లే.
► తమిళనాడు, గోవా లాంటి చోట్ల ప్రతి 2000 మందికీ ఒక ఏ.టి.ఎం. ఉంది. కానీ, బీహార్, ఉత్తర ప్రదేశ్ లాంటి చోట్ల ప్రతి 11000 మందికి కానీ ఒక ఏ.టి.ఎం. లేదు.