కొంగలు నీటిలో ఎందుకు నిలబడతాయంటే...
జంతు ప్రపంచం
ఒకప్పుడు కొన్ని వందల రకాల జాతుల కొంగలు ఉండేవి. కానీ క్రమంగా అంతరించిపోయి ఇప్పుడు పదిహేను జాతులు మాత్రమే మిగిలాయి!వీటికి ఇవే తినాలన్న నియమం ఏమీ ఉండదు. ఎప్పుడేది దొరికితే అది తినేసి కడుపు నింపుకుంటాయి. చేపలు, పురుగులు, పండ్లు, గింజలు, మొక్కలు... ఏవైనా సరే! ఇవి మూడు నుంచి ఐదేళ్ల వయసు వచ్చేవరకూ జతకట్టవు. ఒక్కసారి జతకట్టాక జీవితాంతం దానితోనే ఉంటాయి. అది చనిపోయినా సరే... మరోదానికి దగ్గర కావు!
కొంగలలో ఐకమత్యం చాలా ఎక్కువ. ఒక కొంగకి ఏదైనా ప్రమాదం వాటిల్లితే... అది ఒక రకమైన శబ్దం చేస్తుంది. ఈ శబ్దం దాదాపు రెండు కిలోమీటర్ల వరకూ వినిపిస్తుంది. దాన్ని గుర్తుపట్టిన ఇతర కొంగలన్నీ వచ్చేస్తాయి. కలసికట్టుగా శత్రువుతో పోరాటం జరుపుతాయి! కొంగలు గంటలపాటు చల్లటి నీటిలో నిలబడి ఎందుకు ఉంటాయో తెలుసా? శరీర ఉష్ణోగ్రతను సమన్వయం చేసుకోవడానికి ఇవి రక్తప్రసరణ వేగాన్ని నియంత్రించుకునే ప్రయత్నం చేస్తుంటాయి. అందుకోసం కాళ్లలో ఉండే రక్తనాళాలను బిగబడతాయి. దానికోసమే గడ్డకట్టించేంత చల్లటి నీటిలో గంటలసేపు నిలబడిపోతాయి!
వీటి కాళ్లు చాలా బలంగా ఉంటాయి. శత్రువులు దాడి చేసినప్పుడు తమ కాళ్లతోనే ప్రతిఘటిస్తాయి! కొంగలు ప్రపంచమంతా ఉన్నాయి. కానీ అంటార్కిటికా, దక్షిణ అమెరికాల్లో మాత్రం ఎక్కడా ఒక్క కొంగ కూడా కనిపించదు.