– ఉయ్యూరుకు చెందిన శేఖర్(50)కు ఐదేళ్లుగా సుగర్ ఉంది. సరిగా మందులు వాడక పోవడంతో అదుపులో లేదు. దీంతో ఇటీవల ఎడమకాలుకు పుండు పడి మానలేదు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి రాగా, డాప్లర్ స్కాన్ చేసి రక్తప్రసరణ తగ్గినట్లు నిర్ధారించారు. దీంతో మోకాలు కింద భాగం వరకూ కాలును తొలగించాల్సి వచ్చింది.
– చిరు వ్యాపారం చేసి జీవనం సాగించే పటమటకు చెందిన వెంకాయమ్మకు 60 ఏళ్లు. పదేళ్లుగా సుగర్ ఉంది. సరిగా మందులు వాడటం లేదు. దీంతో ఇటీవల మోకీలు వద్ద పుండు ఏర్పడి, కిందిభాగం అంతా రక్తప్రసరణ నిలిచిపోయి నల్లగా మారింది. దీంతో తుంటె కింద భాగం వరకూ కాలును తొలగించాల్సి వచ్చింది.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు సుగర్ ఇన్‌ఫెక్షన్‌లతో రోగులు బారులు తీరుతున్నారు. కాళ్ల రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల రక్త ప్రసరణ తగ్గి పుండ్లు ఏర్పడటం కారణంగా ఒక్క ప్రభుత్వాస్పత్రిలోనే నెలకు 50 నుంచి 60 మందికి అవయవాల తొలగింపు శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. వీరిలో కొందరికి వేళ్లు, మరికొందరికి పాదాలు, మోకాలు వరకూ, ఇంకొందరికీ తుంటె వరకూ కూడా తొలగించిన సందర్భాలు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. కాళ్లు, కాళ్ల వేళ్లు తొలగిస్తున్న వారిలో 90 శాతం మందికి మధుమేహం కారణం కాగా, 5 శాతం మందికి ధూమపానం, వెరికోజ్ వెయిన్స్ కారణమని వివరిస్తున్నారు. ఇంకా లెప్రసీ, వెన్నుముఖ గాయం, క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్న వారికి కూడా రక్తనాళాలు మూసుకు పోతుంటాయని వైద్యులు చెబుతున్నారు.
ఓపీకి 400 మందికిపైగా..
విజయవాడ ప్రభుత్వాస్పత్రి జనరల్ సర్జరీ ఓపీకి ప్రతి రోజూ 100 నుంచి 150 మంది అవుట్ పేషెంట్స్ వస్తుంటారు. వారిలో నిత్యం 15 నుంచి 20 మంది వరకూ వివిధ రకాల పుండ్లు, కాళ్లకు రక్తప్రసరణ తగ్గడం వంటి కారణాలతో వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. నెలకు 350 నుంచి 400 మంది వరకూ వస్తారంటున్నారు. ఇలాంటి వారిలో కొందరికి పుండ్లకు డ్రెస్సింగ్ చేసి మందులు రాసి పంపుతుండగా, పుండ్లు తీవ్రంగా ఉన్న వారిని సెప్టిక్ వార్డులో అడ్మిట్ చేస్తున్నారు. కాళ్లకు, ఇతర శరీర అవయవాలపై మానని పుండ్లు(నాన్‌హీలింగ్ అల్సర్స్)తో ఎక్కువ మంది వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
అశ్రద్ధ చేస్తే ప్రాణాలకే ముప్పు..
కాళ్లకు రక్తప్రసరణ తగ్గడం వల్ల ఎక్కువగా మానని పుండ్లు ఏర్పడుతున్నాయి. కొందరికి కాళ్లు, వేళ్లు కుళ్లి నల్లగా అయిపోవడంతో, అలాంటి వారికి రక్తప్రసరణ లేని భాగాన్ని తొలగించాల్సి వస్తోంది. నెలలో 50 నుంచి 60 వరకూ అలాంటి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నాం. వేళ్లు, పాదాలు, మోకీలు వరకూ ఇలా రక్తప్రసరణను బట్టి అవయవాలను తొలగించాల్సి ఉంటుంది. తొలగించకుండా ఇన్‌ఫెక్షన్ పెరిగితే ప్రాణాలకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. కుళ్లిన పుళ్లు(గ్యాంగ్రీన్స్)తో వస్తున్న వారు ఉంటున్నారు. అలాంటి వారిని సెప్టిక్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నాం.
– డాక్టర్ కె. అప్పారావు, జనరల్ సర్జరీ విభాగాధిపతి, జీజీహెచ్
Comments
Please login to add a commentAdd a comment