పరిశ్రమలను ప్రోత్సహించాలి
జయంతిపురం(జగ్గయ్యపేట): గ్రామాలలో ఏర్పాటు చేసే కర్మాగారాల యాజమాన్యాలు స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. గ్రామంలోని రామ్‌కో సిమెంట్స్ లిమిటెడ్ ఈస్ట్ బ్యాండ్ లైమ్ స్టోన్ మైన్ సున్నపు రాయి ఉత్పత్తికి సంబంధించి ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సున్నపురాయి ఉత్పత్తికి సంబంధించిన విషయాలలో ఏవైనా లోటుపాట్లుంటే ప్రజలు నిర్భయంగా సదస్సులో తెలపాలన్నారు. వీటి ఆధారంగానే కర్మాగారాలకు అనుమతులిస్తామన్నారు. రామ్‌కో కర్మాగారం ప్రెసిడెంట్ ఆశిష్‌కుమార్ శ్రీవత్సవ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పలు గ్రామాలను కర్మాగారం దత్తత తీసుకుని మౌలిక వసతులతో పాటు ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తోందని తెలిపారు.
నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం కలెక్టరేట్‌లో గ్రామీణ నీటిసరఫరా.. ఇతర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాలు, గ్రామాలు, మారుమూల పల్లెల్లో సైతం ప్రభుత్వ పరంగా, స్వచ్ఛంద సంస్థల సహకారంతో చలివేంద్రాలు ఏర్పాటు చేసేలా అధికారులు సమన్వయం చేసుకోవాలని చెప్పారు. తాగునీటి పైపులైన్ల మరమ్మతు ప్రాంతాలు గుర్తించి తక్షణమే పనులు పూర్తి చేయాలన్నారు. ఏప్రిల్, మే నెలల్లో నీటి ఎద్దడి తలెత్తే అవకాశాలు ఉంటాయని, అటువంటి కీలక సమయంలో అధికారులు ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. తాగునీరు పరంగా ఇబ్బందులు ఉంటే 0866–2575822, 91549 70454 నంబర్లలో సంప్రదించవచ్చని కలెక్టర్ సూచించారు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
Comments
Please login to add a commentAdd a comment