సాక్షి, న్యూఢిల్లీ: కొత్త జడ్జీల నియామకప్రక్రియలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మధ్య సర్వామోదం సన్నగిల్లింది. నూతన జడ్జీల ఎంపికకు సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ చేపట్టిన ‘సర్కులేషన్’ పద్ధతిపై కొలీజియంలోని ఇద్దరు జడ్జీలు భిన్న స్వరం వినిపించడం తెలిసిందే. ఆ ఇద్దరి పేర్లను తొలిసారిగా బహిరంగంగా వెల్లడించడం గమనార్హం. 11 మంది నూతన జడ్జీల నియామకం కోసం సెప్టెంబర్ 26న సీజేఐ జస్టిస్ లలిత్ నేతృత్వంలోని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల కొలీజియం భేటీ జరిగింది. జస్టిస్ చంద్రచూడ్ హాజరుకాలేదు.
10 మంది జడ్జీల నియామక ప్రక్రియ కోసం నలుగురు జడ్జీలకు సీజేఐ లేఖలు రాశారు. తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ జస్టిస్ కిషన్ అక్టోబర్ ఒకటిన, జస్టిస్ జోసెఫ్ అక్టోబర్ ఏడున సీజేఐకు ప్రతిలేఖలు రాశారు. లేఖలు రాసే పద్ధతిపై జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నజీర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. అభిప్రాయం తెలపాలని అక్టోబర్ రెండున మరోసారి కోరినా స్పందించలేదు. సాధారణంగా కొలీజియంలో వ్యక్తమయ్యే బేధాభిప్రాయాలు, అభ్యంతరాలు తెలిపిన జడ్జీల పేర్లను వెల్లడించరు. కానీ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నజీర్ పేర్లను బయటపెడుతూ కొలీజియం ప్రకటన విడుదలచేసింది. ఇక నవంబరు 9న కొత్త సీజేఐ వచ్చాకే కొలీజియం సమావేశం కానుంది. జస్టిస్ దీపాంకర్ గుప్తాను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటూ ఇప్పటికే కేంద్రానికి సిఫార్సు చేసిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment