
సాక్షి, న్యూఢిల్లీ: భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ నియమితులు కానున్నారు. ఆయన పేరును సిఫార్సు చేస్తూ సీజేఐ జస్టిస్ యు.యు.లలిత్ మంగళవారం ఫుల్ కోర్టు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర న్యాయ శాఖకు ప్రతిపాదన పంపారు. న్యాయ శాఖ దాన్ని ప్రధాని పరిశీలనకు పంపనుంది. ప్రధాని, తర్వాత రాష్ట్రపతి ఆమోదం అనంతరం జస్టిస్ చంద్రచూడ్ సీజేఐగా నియమితులవుతారు.
జస్టిస్ లలిత్ నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు. 9న జస్టిస్ చంద్రచూడ్ సీజేఐగా ప్రమాణం చేస్తారు. 2024 నవంబర్ 10 దాకా రెండేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగుతారు. ఆయన తండ్రి జస్టిస్ వైవీ చంద్రచూడ్ కూడా సీజేఐగా చేయడం విశేషం! ఆయన 1978 నుంచి 1985 దాకా ఏకంగా ఏడేళ్ల పాటు అత్యధిక కాలం సీజేఐగా పని చేశారు. తండ్రీకొడుకులిద్దరూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.
ప్రగతిశీల భావాలున్న న్యాయమూర్తిగా పేరొందిన జస్టిస్ చంద్రచూడ్ న్యాయవాదుల కుటుంబం నుంచి వచ్చారు. 1959 నవంబర్ 11న జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్, ప్రభ దంపతులకు మహారాష్ట్రలో జన్మించారు. ముంబైలోని కేథడ్రల్, జాన్‌కానన్‌లో పాఠశాల విద్య, 1979లో ఢిల్లీలో ఆర్థిక, గణిత శాస్త్రాల్లో ఆనర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 1982లో ఢిల్లీలో న్యాయ పట్టా పొందారు. 1983లో హార్వర్డ్ లా స్కూల్ నుంచి ఎల్‌ఎల్‌ఎం పట్టా పొందారు. 1986లో హార్వర్డ్‌లో డాక్టరేట్ ఆఫ్ జ్యూరిడికల్ సైన్స్ చదివారు. బాంబే హైకోర్టులో, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు.
1998లో సీనియర్ న్యాయవాదిగా పదోన్నతి పొందడంతోపాటు సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. 2000లో బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013లో అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యనిర్వాహక చైర్మన్‌గా ఉన్నారు. ఆయన ఇద్దరు కుమారులు అభినవ్, చింతన్ కూడా లాయర్లే.
భిన్నాభిప్రాయాల వెల్లడికి వెనకాడరు
విచారణ సమయంలో తన అభిప్రాయాలు వెల్లడించడానికి వెనకాడని న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్‌కు పేరుంది. మానవహక్కులు, లింగ సమానత్వం, ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, క్రిమినల్, రాజ్యాంగ చట్టాలు, వ్యక్తిగత స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, వికలాంగుల హక్కులు, ఆధార్, పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు, గోప్యత హక్కు, అయోధ్య భూ వివాదంపై కీలక తీర్పులిచ్చారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుమతిచ్చి సంచలనం సృష్టించారు.
రుతుక్రమం కారణంగా ఆలయంలోకి రానివ్వకపోవడం మహిళల ప్రాథమిక హక్కులకు భంగకరమని తీర్పు చెప్పారు. వివాహితులైన ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకోవడం చట్ట విరుద్ధం కాదంటూ వివాహేతర సంబంధాలపైనా సంచలన తీర్పు వెలువరించారు. కరోనా సమయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ను గుర్తుచేస్తూ ప్రభుత్వ వైద్య సాయం నిరాకరించకూడదని పేర్కొన్నారు. అవివాహితలకు కూడా 24 వారాల దాకా అబార్షన్ చేయించుకునే హక్కు కల్పిస్తూ తాజాగా తీర్పు ఇచ్చారు.
తండ్రి తీర్పులనే తిరగరాశారు
కిస్సా కుర్చీకా అనే సినిమాకు సంబంధించిన కేసులో నాడు జస్టిస్ వైవీ చంద్రచూడ్ కాంగ్రెస్ నేత సంజయ్‌గాంధీని జైలుకు పంపారు! అయితే వ్యభిచారం, గోప్యత హక్కులకు సంబంధించి ఆయన ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్ తోసిపుచ్చడం విశేషం! 1976లో ఏడీఎం జబల్‌పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసులో అత్యవసర సమయాల్లో పౌరులకు ప్రాథమిక హక్కులుండవంటూ జస్టిస్ వైవీ చంద్రచూడ్ తీర్పు ఇచ్చారు. దాన్ని 2016లో జస్టిస్ చంద్రచూడ్ కొట్టేశారు.
Comments
Please login to add a commentAdd a comment