మన రూపాయే మహారాజు..
ప్రపంచంలో అమెరికన్ డాలర్‌కు ఉండే ప్రాధాన్యం ఎలా ఉన్నా.. మన రూపాయికి కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. చలామణీలో ఉన్న కరెన్సీ నోట్ల సంఖ్య విషయంలో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే మన రూపాయి చాలా ముందుంటుంది. దేశీ కరెన్సీకి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలివీ..
1. రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం 2012-13 నాటికి దేశంలో అక్షరాలా 7,647 కోట్ల బ్యాంకు నోట్లు చలామణీలో ఉన్నాయి. అమెరికన్ డాలర్లతో పోలిస్తే ఇది రెట్టింపు. అమెరికాలో 3,450 కోట్ల నోట్లు మాత్రమే చలామణీలో ఉన్నాయి. యూరోజోన్‌తో పోలిస్తే అయిదు రెట్లు ఎక్కువ. అక్కడ 1,580 కోట్ల కరెన్సీ నోట్లు చలామణీలో ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, యూరోజోన్ , ఆస్ట్రేలియా, కెనడా కరెన్సీ నోట్లన్నీ కలిపినా కూడా మన ముందు బలాదూరే. ఇవన్నీ కలి పినా సంఖ్య 5,644 కోట్ల క్యాష్ నోట్లను మించదు. ఇక, నాణేల విషయానికొస్తే.. మన దగ్గర 8,991 కోట్ల కాయిన్లు సర్క్యులేషన్‌లో ఉన్నాయి.
2. విలువ పరంగా చూస్తే మన కరెన్సీ నోట్ల విలువ రూ. 12,46,800 కోట్లు కాగా, కాయిన్ల విలువ రూ. 16,800 కోట్ల పైచిలుకు ఉంటుంది. అదే అమెరికన్ కరెన్సీ నోట్ల విలువ 1,198 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 72 లక్షల కోట్లు).
3. మన దగ్గర కరెన్సీ నోట్ల ముద్రణ కూడా భారీగానే ఉంటోంది. 2013లో ప్రపంచవ్యాప్తంగా 15,400 కోట్ల కరెన్సీ నోట్లను ముద్రించగా, భారత్ సుమారు 2,000 కోట్ల నోట్లను ముద్రించింది. దాదాపు 5,400 కోట్ల నోట్లతో చైనా అగ్ర స్థానంలో నిల్చింది.
4. డబ్బు ముద్రించడానికే కాదు.. పాతబడిపోయినవాటిని ధ్వంసం చేయడానికీ బోలెడంత ఖర్చవుతుంది. ఇందుకు కావాల్సిన యంత్రాల కొనుగోలు, మెయింటెనెన్స్‌కు ఆర్‌బీఐకి రూ. 523 కోట్లు ఖర్చయ్యింది.
5. కరెన్సీ ముద్రణ ఖర్చుల విషయానికొస్తే.. రూ.10 విలువ ఉండే నోటును ప్రింట్ చేయాలంటే 96 పైసలు ఖర్చవుతుంది. అదే రూ. 100 నోటు ముద్రణకు రూ. 1.79 వ్యయమవుతుంది. రూ. 20 నోటుకు రూ. 1.50, రూ. 50 నోటుకు రూ. 1.81 ఖర్చవుతుంది. 100 నోటు కన్నా 50 రూపాయల నోటు ముద్రణ ఖర్చే ఎక్కువ ఉండటం గమనార్హం. ఇక, రూ. 500 నోటును ప్రింట్ చేయడానికి రూ. 3.58, రూ. 1,000 నోటు ముద్రణకు రూ. 4.06 ఖర్చవుతుంది. పదిరూపాయల నాణెం తయారికి రూ. 6.10 వ్యయమవుతుంది.