The Reserve Bank
-
డబ్బు మీది.. మోత మాది..
ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి సామాన్యుల నడ్డి విరచడానికి బ్యాంకులు సిద్ధమయ్యాయి. బ్యాంకులంటేనే ఖాతాదారులు భయపడేలా చార్జీల మోత మోగించడానికి రుసుముల మోత మోగించనున్నాయి. చార్జీల పెంపుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా బ్యాంకులు కానీ, రిజర్వ్‌బ్యాంకు కానీ వెనక్కు తగ్గడం లేదు. ఈ విషయం తమ పరిధిలో లేదన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుండంపై ఖాతాదారులు అగ్గిమీదగుగ్గిలం అవుతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో అస్తవ్యస్తం అయిన ఆర్థిక వ్యవస్థతో ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు సామాన్యులు. ఇప్పుడు బ్యాంకులు ట్రాన్సాక్షన్ చార్జీలు భారీగా పెంచుతున్నాయి. సామాన్యులకు అండగా నిలిచి ఆర్థికంగా చేదోడువాదోడుగా నిలవాల్సిన బ్యాంకులు లాభార్జనే ధ్యేయంగా పని చేస్తుంటే ఖాతాదారులు భయపడిపోతున్నారు. చిత్తూరు : జిల్లాలో సుమారు 42 లక్షల జనాభా ఉంది. వీరిలో 33 లక్షల మందికి బ్యాంకు ఖాతాలున్నాయి. జిల్లా జనాభాలో 78 శాతం మంది బ్యాంకుల్లో ఖాతాదారులున్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారి నుంచి పై స్థాయి వరకు దాదాపుగా అందరికీ బ్యాంకుల్లో ఖాతాదారులుగా ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రతిఫలాలన్నీ బ్యాంకుల ద్వారానే లబ్ధిదారులకు చేరుతున్నాయి. దీంతో ప్రజలందరూ బ్యాంకులపై ఆధారపడ్డారు. దీంతో బ్యాంకులు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగుతోంది. ఇందులో భాగంగానే ఏప్రిల్ ఒకటి నుంచి బ్యాంకు ట్రాన్సాక్షన్ ఛార్జీలు భారీగా పెంచుతున్నాయి. ప్రైవేటు బ్యాంకులు, జాతీయ బ్యాంకులు ప్రస్తుతం ఉన్న ట్రాన్సాక్షన్ ఛార్జీలను సవరిస్తూ ఇప్పటికే తమ శాఖలకు కొత్త ఛార్జీల వివరాలు పంపాయి. ఈ పెంపుపై జాతీయమీడియా, నెటిజన్లు సామాన్యులు మండిపడుతున్నారు. ఈ పెంపునకు వ్యతిరేకంగా నో బ్యాంక్ ట్రాన్సాక్షన్డేగా ఏప్రిల్ 6ను ప్రకటించారు నెటిజన్లు. ఆ రోజున దేశంలోని ప్రజలందరూ అన్ని రకాల బ్యాంకు ట్రాన్సాక్షన్లను నిలేపేయాలని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. జిల్లాలో 40 బ్యాంకులు754 బ్రాంచులున్నాయి. వీటిలో సుమారు 33 లక్షల మంది ఖాతాదారులుగా ఉన్నారు. అన్ని ప్రైవేటు బ్యాంకులు, జాతీయ బ్యాంకులు తమకు అనుకూలంగా, తాము అనుకున్న విధంగా రుసుములు పెంచి సామాన్యుడిపై భారం మోపేందుకు సిద్ధమయ్యాయి. నెలలో మొదటి మూడు నగదు ట్రాన్సాక్షన్లు ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఇది ప్రస్తుతం 5 వరకు ఉచితంగా చేసుకునే వెసులుబాటు ఉంది. ఎస్బీఐ ఖాతాదారులు ప్రతి నెలా మూడు సార్లు ఉచితంగా నగదు డిపాజిట్ చేయొచ్చు. అంతకుమించింతే ప్రతి లావాదేవిపై సర్వీస్ టాక్స్, రూ. 50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ ఒకటి నుంచి మినిమమ్ బ్యాలెన్స్ లేని అకౌంట్లపై ప్రతి నెలా రూ.20 నుంచి రూ. 100 ఫెనాల్టీతో పాటు సర్వీస్ ట్యాక్స్‌ను ఖాతాదారుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తారు. ఎస్బీఐ ఖాతాదారులు ఇతర బ్యాంకు ఏటీఎంలలో మూడు సార్ల కంటే ఎక్కువ నగదు డ్రా చేసుకుంటే ప్రతి ట్రాన్సాక్షన్‌పై రూ.20తో పాటు సర్వీస్‌ట్యాక్స్ వసూలు చేస్తారు. ఎస్బీఐ ఏటీఎంలో అయితే ఇది ఐదు సార్లకు మించకూడదు. రూ.10 వేలు నిల్వ ఉన్న కరెంటు ఖతాదారులు అయితే రూ.25వేలకు ప్రతి రోజూ రూ.25 వేలకు వరకు ఉచితంగా డిపాజిట్ చేసుకోవచ్చు. అంతకు మించితే ట్యాక్స్, రుసుం చెల్లించాల్సిందే. హెచ్డీఎఫ్సీ.. ప్రతి నెలా నాలుగు ట్రాన్సాక్షన్లకు మించితే రుసుం చెల్లించాల్సిందే. నాలుగుకు మించితే ప్రతి ట్రాన్సాక్షన్‌పై రూ.150లు ఖాతాదారుడి నుంచి ముక్కు పిండి వసూలు చేస్తారు. ఒక్కో రోజు రూ.2 లక్షల నగదు విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉటుంది. అదికూడా హోబ్రాంచ్ అయితేనే. అంతకు మించితే బాదుడు తప్పదు. ఈ ఛార్జీలు కేవలం సేవింగ్స్, శాలరీ అకౌంట్లకు మాత్రమే వర్తిస్తాయి. ఐసీఐసీఐ.. నెలకు నాలుగు లావాదేవీలకు ఎలాంటి రుసుము ఉండదు. అంతకు మించితే బాదుడు తప్పదు. పరిమితి మించిన లావాదేవీలపై ఒక్కోదానిపై సుమారు రూ.150 వసూలు చేస్తుంది. ఇతర ట్రాన్సాక్షన్ చార్జీలు కూడా భారీగా పెంచినట్లు సమాచారం. యాక్సిస్ బ్యాంకు యాక్సి బ్యాంకు ఖాతాదారులు ప్రతి నెలా ఐదు ట్రాన్సాక్షన్లు ఉచితంగా చేసుకోవచ్చు. వీటిలోనే డిపాజిట్లు విత్డ్రాలుంటాయి. వీటికి మించితే రుసుము చెల్లించాల్సిందే. ప్రతి లావాదేవీపై గరిష్టంగా రూ.95 చార్జీ ఉంటుంది. నాన్హోమ్ బ్రాంచ్‌లో ఐదుకు మించి ట్రాన్సాక్షన్స్ చేస్తే ప్రతి ట్రాన్సాక్షన్‌కి రూ.1000కి రూ.2.5 రుసుం లేదా రూ.95లు ఏది ఎక్కువైతే అది వసూలు చేస్తారు ఖాతాదారుల నుంచి. -
మారుతి లాభం జూమ్..
క్యూ2లో రూ. 863 కోట్లు; 29% వృద్ధి న్యూఢిల్లీ: దేశీయంగా అమ్మకాలు పుంజుకోవడం, వ్యయ నియంత్రణ చర్యల ఆసరాతో వాహన దిగ్గజం మారుతి సుజుకీ ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది రెండో త్రైమాసికం(2014-15, క్యూ2)లో కంపెనీ నికర లాభం 28.69 శాతం దూసుకెళ్లి రూ.863 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.670 కోట్లుగా ఉంది. ఇక మొత్తం ఆదాయం రూ.11,996 కోట్లకు ఎగబాకింది. గతేడాది క్యూ2లో ఆదాయం రూ.10,212 కోట్లతో పోలిస్తే 17.47 శాతం వృద్ధి చెందింది. వాటాదార్లకు ఉత్సాహాన్నిచ్చే చర్యల్లో బాగంగా డివిడెండ్ చెల్లింపు నిష్పత్తిని పెంచేందుకు కంపెనీ డెరైక్టర్ల బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈమేరకు నిబంధనల్లో మార్పులకు ఓకే చెప్పింది. ఇప్పటిదాకా నికర లాభంలో సగటున 10-15 శాతాన్ని డివిడెండ్ చెల్లింపునకు ప్రామాణికంగా తీసుకుంటుండగా.. దీన్ని ఇప్పుడు 18-30 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క, కంపెనీలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐ) పెట్టుబడి పరిమితిని ఇప్పుడున్న 24 శాతం నుంచి 40 శాతానికి పెంచే ప్రతిపాదనను కూడా కంపెనీ ఆమోదించింది. వాటాదారులు, రిజర్వ్ బ్యాంకు అనుమతులకు లోబడి ఈ మార్పులు ఉంటాయని పేర్కొంది. అయితే, గుజరాత్ ప్లాంట్‌ను పూర్తిగా మాతృసంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్ అధీనంలో ఉంచే అంశానికి సంబంధించి మైనారిటీ షేర్‌హోల్డర్ల ఓటింగ్‌కు తుది తేదీని మాత్రం కంపెనీ ఇంకా నిర్ణయించలేదు. -
మహిళా బ్యాంకు ఏర్పాటు చేస్తాం
కోటగుమ్మం (రాజమండ్రి) : రాజమండ్రి దానవాయి పేటలో మహిళా బ్యాంకు ఏర్పాటు చేస్తున్నామని.. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, రిజర్వు బ్యాంకు అనుమతి కోసం దరఖాస్తు చేశామని ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఛైర్మన్ చల్లా శంకరరావు తెలిపారు. మంగళవారం గోకవరం బస్టాండ్ వద్దగల బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖపట్నంలో ఒక బ్రాంచి ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రూ 3.50 కోట్లతో నూతన భవనం నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. తమ బ్యాంక్‌లో సభ్యులు 87,000 మంది, డిపాజిటర్లు 149024 మంది, రుణ గ్రహీతలు 23854 మంది ఉన్నారన్నారు. కోఆపరేటివ్ చరిత్రలోనే అత్యధిక డిపాజిటర్లు ఉన్న బ్యాంక్ తమదేనని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాంకు డిపాజిట్లు రూ.407.17 కోట్లకు పెరిగాయని, అప్పులు రూ.16 కోట్లు పెరిగి రూ.270 కోట్లు అయిందని చెప్పారు. భీమవరం, అమలాపురంల్లో కొత్త బ్రాంచీలు ప్రారంభించామన్నారు. బేసిక్ సేవింగ్స్ పథకం, సేవింగ్స్ సిల్వర్, సేవింగ్స్ గోల్డ్ పథకాలు ప్రవేశపెట్టినట్లు వివరించారు. బంగారంపై రుణ సౌకర్యం పొందే వారి కోసం సర్వీస్ చార్జీలు రద్దు చేసినట్లు తెలిపారు. పిల్లలు, మైనర్లను ప్రోత్సహించేందుకు కిడ్స్ సేవింగ్స్ ఖాతాలు ప్రారంభించినట్టు చెప్పారు. సమావేశంలో బ్యాంక్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం, అయ్యల కృష్ణ గంగాధరరావు, నండూరి వెంకటరమణ, నందం బాలవెంకటకుమార్ రాజా, పోలాకి పరమేశ్వరరావు, మహ్మద్ అబ్దుల్ ఫహీం తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాతలపై నోటీసుల దాడి
ప్రకటనలకే పరిమితమైన రుణమాఫీ హామీ బ్యాంకుల నుంచి వెల్లువెత్తుతున్న నోటీసులు ఆందోళనలో రైతులు తాళ్లపూడి : రైతులు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేస్తామన్న హామీ అమలుకు నోచుకోకపోవడంతో వారంతా ఆందోళన చెం దుతున్నారు. రుణాలు మాఫీకాకపోగా పులిమీద పుట్రలా బ్యాంకుల నుంచి నోటీసులు వెల్లువెత్తుతుండటం అన్నదాతలను కలవరపరుస్తోంది. రుణాలు మాఫీ చేస్తామంటూనే మరోపక్క వాటిని చెల్లించాలని, అనంతరం మాఫీ వర్తింపచేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పేర్కొనడం గందరగోళానికి గురిచేస్తోంది. ఇదిలావుంటే రైతులు తీసుకున్న రుణాలను తక్షణమే చెల్లించాలని బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయి. మరీము ఖ్యంగా బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాలను చెల్లించాలని బ్యాంకుల నుంచి నోటీసులు అందుతున్నాయి. ఇదే తరహాలో ప్రక్కిలంక స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియూ నుంచి రైతులకు నోటీసులు వచ్చాయి. మాఫీ విషయంలో ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో బంగారం తాకట్టుపై తీసుకున్న రుణాలు చెల్లించాలని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ప్రక్కిలంక ఎస్బీఐలో 2011-12 సంవత్సరంలో బంగారం తాకట్టు పెట్టి 611 మంది రూ.4.11 కోట్లను, 2012-13 సంవత్సరంలో 511 మంది రైతులు రూ.3.19 కోట్లను, 2013-14లో 314 మంది రైతులు రూ.2.32 కోట్లను రుణాలుగా తీసుకున్నారు. గత ఏడాది పంట రుణాలుగా 431 మందికి రూ.2.67 కోట్లు తీసుకున్నారు. బ్యాంకుల నుంచి నోటీసులు అందడంతో మండలంలోని రైతుల్లో ఆందోళన మొదలైంది. బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయి ప్రక్కిలంక ఎస్బీఐలో బంగారం తాకట్టు పెట్టి వ్యవసాయ అవసరాల కోసం రూ.48 వేల రుణం తీసుకున్నాం. సెప్టెంబర్‌లో రూ.32 వేలు, మరో రూ.26 వేలు తీసుకున్నాం. ఆ మొత్తాలను వెంటనే కట్టాలంటూ బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చాయి. రుణాలు మాఫీ అవుతాయని చెప్పడంతో బాకీ కట్టలేదు. ఇప్పుడేమో బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయి. - సూరవరపు శ్రీనివాస్, రైతు, ప్రక్కిలంక వెంటనే మాఫీ చేయాలి వ్యవసాయం కోసం రూ.40 వేలు అప్పుగా తీసుకున్నాను. మొత్తం రూ.56 వేలు చెల్లించాలని బ్యాంకు నుంచి నోటీసు వచ్చింది. రెండెకరాల పొలం, బంగారం తాకట్టు పెట్టి ఆ డబ్బు తీసుకున్నాం. రెండేళ్లుగా పంటలు సరిగా పండక రుణాలు చెల్లించలేకపోయాం. ప్రస్తుతం ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. ప్రభుత్వం రుణ మాఫీ చేస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నాం. బ్యాంకు నోటీసు ఇవ్వడంతో ఏం చేయాలో తెలియడం లేదు. - సోము వెంకటేశ్వరరావు, పైడిమెట్ట వడ్డీ భారం అధికమైంది వ్యవసాయ ఖర్చుల కోసం రూ.70 వేలు రుణం తీసుకున్నాను. ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో బ్యాంకుకు డబ్బు కట్టలేదు. బ్యాంకు అధికారులు బంగారం వేలం వేస్తామని నోటీసు పంపించారు. దీనిపై వడ్డీ రూ.30 వేలు అయియంది. మొత్తం రూ.లక్ష చెల్లించాలి. ఇప్పటికప్పుడు అంత డబ్బు కట్టాలంటే కష్టం. గతంలో రుణం చెల్లిస్తే రుణమాఫీ అందలేదు. ప్రస్తుతం రుణం చెల్లించే పరిస్థితిలో లేం. ప్రభుత్వం రుణమాఫీ హామీని నిలబెట్టుకోవాలి. - నాగోతు కొండలరావు, పైడిమెట్ట -
రీ షెడ్యూల్‌పై ఆశలు ఆవిరి!
రైతు రుణాల విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి హైదరాబాద్: రైతు రుణాల రీ షెడ్యూల్‌పై రాష్ర్ట ప్రభుత్వం పెట్టుకున్న ఆశలు ఆవిరవుతున్నాయి. దీనితో ప్రత్యామ్నాయ మార్గాల వేటలో పడింది. రుణాలు రీ షెడ్యూల్ అవుతాయని నిన్నటి వరకు భావించిన ప్రభుత్వం, రిజర్వ్‌బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ మీడియాతో మాట్లాడుతూ రీ షెడ్యూల్‌పై వ్యక్తం చేసిన అభిప్రాయాల నేపథ్యంలో పునరాలోచనలో పడిం ది. రీ షెడ్యూల్‌తో కొంతమేరకు ప్రభుత్వంపై తక్షణ భారం తగ్గుతుందని భావించినా... ఇప్పుడాపరిస్థితి కూడా లేకపోవడంతో నిధుల సమీకరణ ఎలా అన్న అంశంపై దృష్టి పెట్టింది. బాండ్లద్వారా నిధుల సేకరణ, సెక్యురిటీ గ్యారెంటీ, భూముల విక్రయం, బడ్జెట్లో బ్యాంకులకు చెల్లించే మొత్తాన్ని కేటాయించడం వంటివి మినహా మరో మార్గం లేదని ఉన్నతాధికారవర్గాలు స్పష్టంచేశాయి. కాగా, మంగళవారం ఆర్బీఐకి లేఖ రాశామనీ, దానికి స్పష్టమైన సమాధానం కోసం ఎదురుచూస్తున్నామని అధికారులు చెబుతున్నారు. రుణాల రీ షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్‌కు చేస్తే... తెలంగాణకు కూడా అది వర్తిస్తుందని వ్యాఖ్యానించారు. ఆర్బీఐ నుంచి అధికారిక సమాచారం వచ్చే వరకు తాము పూర్తిగా ఆశ వదులుకోలేమని చెబుతూనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక తప్పదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పంటల దిగుబడిపై జిల్లాను యూనిట్‌గా తీసుకుని.. రిజర్వ్‌బ్యాంకు నిబంధనల కంటే ఎక్కువ దిగుబడి ఉన్నందున రీ షెడ్యూల్ ఎలా చేస్తామంటూ కొర్రీలు వేస్తున్నారని, కాని మండలాల వారీగా పరిశీలిస్తే.. చాలా మండలాల్లో దిగుబడి తక్కువగా ఉందని, పైలాన్ తుపానుతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వం అంటోంది. గతంలో రుణాల రీ షెడ్యూల్‌పై ఆర్బీఐ ఏనాడు ఇలా ఇబ్బందులు సృష్టించలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో యూపీఏ ప్రభుత్వం 60 వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేసినప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేయని ఆర్బీఐ ఇప్పుడే ఎందుకు చేస్తోందని ప్రభుత్వంలో ప్రముఖుడు ఒకరు వ్యాఖ్యానించారు. నిధుల సమీకరణ ఎలా చేస్తారన్న ప్రశ్నకు మాత్రం ఆయన సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేయడం గమనార్హం. ప్రస్తుతం రైతులు రుణాలు చెల్లిస్తే.. వారికి రీయింబర్స్ చేసే విధానాన్ని పరిశీలిస్తున్నారు. అది తప్ప మరోమార్గం లేదన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. -
రుణమాఫీ ఎగవేతకు బాబు కుట్ర: చెవిరెడ్డి
హైదరాబాద్ : వ్యవసాయ రుణాల రీ షెడ్యూల్‌కు రిజర్వుబ్యాంకు అంగీకరించడం లేదనే సాకు చూపుతూ రైతు రుణాల మాఫీని ఎగవేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుట్ర పన్నుతున్నట్లు అనుమానంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. -
ఏటీఎంలలో బ్రెయిలీ కీప్యాడ్స్..
అంగవైకల్యం ఉన్న వారు కూడా ఏటీఎంలను వినియోగించుకోవడాన్ని సులభతరం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వికలాంగుల కోసం ఏటీఎంలలో ర్యాంప్‌లు ఏర్పాటు చేయాలని బ్యాంకులకు సూచించింది. సాధ్యమైన చోట్ల బ్యాంకు శాఖల్లో కూడా ఇవి ఉండాలి. ఒకవేళ ఏదైనా కారణం చేత ఏటీఎంలలో ర్యాంప్ ఏర్పాటు చేయలేకపోతే ర్యాంప్ అందుబాటులో లేని విషయాన్ని తెలియజేసేలా సైన్పోస్టు ఉంచాలి. అలాగే, కొత్తగా ఏర్పాటు చేసే వాటిలో కనీసం మూడో వంతు ఏటీఎంలలో బ్రెయిలీ కీప్యాడ్స్ని అందుబాటులో ఉంచాలి. వీటితో పాటు కొత్త ఏటీఎంలన్నింటిలో ఆడియో సదుపాయం కూడా ఉండాలి. -
మన రూపాయే మహారాజు..
ప్రపంచంలో అమెరికన్ డాలర్‌కు ఉండే ప్రాధాన్యం ఎలా ఉన్నా.. మన రూపాయికి కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. చలామణీలో ఉన్న కరెన్సీ నోట్ల సంఖ్య విషయంలో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే మన రూపాయి చాలా ముందుంటుంది. దేశీ కరెన్సీకి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలివీ.. 1. రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం 2012-13 నాటికి దేశంలో అక్షరాలా 7,647 కోట్ల బ్యాంకు నోట్లు చలామణీలో ఉన్నాయి. అమెరికన్ డాలర్లతో పోలిస్తే ఇది రెట్టింపు. అమెరికాలో 3,450 కోట్ల నోట్లు మాత్రమే చలామణీలో ఉన్నాయి. యూరోజోన్‌తో పోలిస్తే అయిదు రెట్లు ఎక్కువ. అక్కడ 1,580 కోట్ల కరెన్సీ నోట్లు చలామణీలో ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, యూరోజోన్ , ఆస్ట్రేలియా, కెనడా కరెన్సీ నోట్లన్నీ కలిపినా కూడా మన ముందు బలాదూరే. ఇవన్నీ కలి పినా సంఖ్య 5,644 కోట్ల క్యాష్ నోట్లను మించదు. ఇక, నాణేల విషయానికొస్తే.. మన దగ్గర 8,991 కోట్ల కాయిన్లు సర్క్యులేషన్లో ఉన్నాయి. 2. విలువ పరంగా చూస్తే మన కరెన్సీ నోట్ల విలువ రూ. 12,46,800 కోట్లు కాగా, కాయిన్ల విలువ రూ. 16,800 కోట్ల పైచిలుకు ఉంటుంది. అదే అమెరికన్ కరెన్సీ నోట్ల విలువ 1,198 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 72 లక్షల కోట్లు). 3. మన దగ్గర కరెన్సీ నోట్ల ముద్రణ కూడా భారీగానే ఉంటోంది. 2013లో ప్రపంచవ్యాప్తంగా 15,400 కోట్ల కరెన్సీ నోట్లను ముద్రించగా, భారత్ సుమారు 2,000 కోట్ల నోట్లను ముద్రించింది. దాదాపు 5,400 కోట్ల నోట్లతో చైనా అగ్ర స్థానంలో నిల్చింది. 4. డబ్బు ముద్రించడానికే కాదు.. పాతబడిపోయినవాటిని ధ్వంసం చేయడానికీ బోలెడంత ఖర్చవుతుంది. ఇందుకు కావాల్సిన యంత్రాల కొనుగోలు, మెయింటెనెన్స్‌కు ఆర్బీఐకి రూ. 523 కోట్లు ఖర్చయ్యింది. 5. కరెన్సీ ముద్రణ ఖర్చుల విషయానికొస్తే.. రూ.10 విలువ ఉండే నోటును ప్రింట్ చేయాలంటే 96 పైసలు ఖర్చవుతుంది. అదే రూ. 100 నోటు ముద్రణకు రూ. 1.79 వ్యయమవుతుంది. రూ. 20 నోటుకు రూ. 1.50, రూ. 50 నోటుకు రూ. 1.81 ఖర్చవుతుంది. 100 నోటు కన్నా 50 రూపాయల నోటు ముద్రణ ఖర్చే ఎక్కువ ఉండటం గమనార్హం. ఇక, రూ. 500 నోటును ప్రింట్ చేయడానికి రూ. 3.58, రూ. 1,000 నోటు ముద్రణకు రూ. 4.06 ఖర్చవుతుంది. పదిరూపాయల నాణెం తయారికి రూ. 6.10 వ్యయమవుతుంది. -
హెచ్చుతగ్గులను తట్టుకునే ప్రణాళిక సిద్ధం: ఆర్బీఐ
ముంబై: సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇటు స్టాక్ మార్కెట్లు, అటు ఫారెక్స్ మార్కెట్లలో ఏర్పడే భారీ హెచ్చుతగ్గులను తట్టుకునేందుకు అనువైన(కంటిన్జెన్సీ) ప్రణాళికను ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్, సెబీ సంయుక్తంగా సిద్ధం చేశాయి. నేటి(శుక్రవారం) ఉదయం నుంచీ ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు, డాలరుతో మారకంలో రూపాయి అనూహ్య రీతిలో స్పందించే అవకాశముంది. ఈ అంశంపై ఆర్థిక శాఖతోపాటు, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీతో చర్చలు నిర్వహించినట్లు రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. ప్రణాళికలో భాగంగా అవసరమైతే తగిన స్థాయిలో లిక్విడిటీను కల్పించనున్నట్లు తెలిపారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలోనూ సాధారణ స్థాయిలోనే పరిస్థితులు ఉండేలా నియంత్రించనున్నట్లు బ్యాంక్ కేంద్ర బోర్డుకు రాజన్ తెలియజేశారు. కాగా, గడిచిన ఐదు రోజుల్లో సెన్సెక్స్ 1,600 పాయింట్లకుపైగా పుంజుకోగా, డాలరుతో మారకంలో రూపాయి 59.29కు బలపడ్డ సంగతి తెలిసిందే. ఎన్డీఏపై అంచనాలు ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏకు మెజారిటీ లభిస్తుందన్న అంచనాలు వెల్లడయ్యాయి. తద్వారా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ అంచనాలతో గత వారం రోజులుగా మార్కెట్లు హైజంప్ చేస్తూ వచ్చాయి. ఈ బాటలో నేటి ట్రేడింగ్‌లో ప్రధాన సూచీల కదలికలపై నియంత్రణ సంస్థలు దృష్టిపెట్టాయి. స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ యథావిధిగా ఉదయం 9.15కు మొదలై సాయంత్రం 3.30కు ముగియనుంది. మేమూ రెడీ: సెబీ ఎన్నికల ఫలితాల వెల్లడి నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో ఏర్పడే భారీ ఒడిదుడుకులను తట్టుకునేందుకు తాము కూడా తగిన చర్యలు చేపట్టినట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పేర్కొంది. ట్రేడింగ్‌లో ఎవరైనా అవకతవకలకు పాల్పడిన సందర్భాలు ఎదురైతే సమర్థవంతంగా అడ్డుకునేందుకు అవసరమైన ఏర్పాట్లను చేసినట్లు తెలిపింది. నేటి ట్రేడింగ్‌కు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సెబీ చైర్మన్ యూకే సిన్హా ఇన్వెస్టర్లకు అభయమిచ్చారు. ఫలితాల కారణంగా స్టాక్ మార్కెట్లలో ఏర్పడగల అనూహ్య కదలికలపై ఆర్థిక శాఖ, ఆర్బీఐలతో చర్చించి... సర్వసన్నద్ధమైనట్లు తెలిపారు. గత ఎన్నికల్లో సీలింగ్... గత సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత రెండుమార్లు మార్కెట్లు సర్క్యూట్ బ్రేకర్లను తాకాయి. 2004లో ఎన్డీఏ ఓడిపోవడంతో మార్కెట్లు పతనంకాగా, 2009లో యూపీఏ అధికారంలోకి రావడంతో పలుమార్లు అప్పర్ సీలింగ్‌ను తాకాయి. 2009 మే 18న 30 సెకన్లలోనే సెన్సెక్స్ అప్పర్ సర్క్యూట్‌ను తాకడంతో ట్రేడింగ్ నిలిచి పోయింది. 2004 మే 14న సెన్సెక్స్ 6% పతనంకాగా, ఆ మర్నాడు 11%పైగా దిగజారింది. ఈసారి ఏం జరుగుతుందో వేచిచూడాల్సిందే!