హెచ్చుతగ్గులను తట్టుకునే ప్రణాళిక సిద్ధం: ఆర్‌బీఐ
ముంబై: సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇటు స్టాక్ మార్కెట్లు, అటు ఫారెక్స్ మార్కెట్లలో ఏర్పడే భారీ హెచ్చుతగ్గులను తట్టుకునేందుకు అనువైన(కంటిన్‌జెన్సీ) ప్రణాళికను ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్, సెబీ సంయుక్తంగా సిద్ధం చేశాయి. నేటి(శుక్రవారం) ఉదయం నుంచీ ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు, డాలరుతో మారకంలో రూపాయి అనూహ్య రీతిలో స్పందించే అవకాశముంది.
ఈ అంశంపై ఆర్థిక శాఖతోపాటు, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీతో చర్చలు నిర్వహించినట్లు రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. ప్రణాళికలో భాగంగా అవసరమైతే తగిన స్థాయిలో లిక్విడిటీను కల్పించనున్నట్లు తెలిపారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలోనూ సాధారణ స్థాయిలోనే పరిస్థితులు ఉండేలా నియంత్రించనున్నట్లు బ్యాంక్ కేంద్ర బోర్డుకు రాజన్ తెలియజేశారు. కాగా, గడిచిన ఐదు రోజుల్లో సెన్సెక్స్ 1,600 పాయింట్లకుపైగా పుంజుకోగా, డాలరుతో మారకంలో రూపాయి 59.29కు బలపడ్డ సంగతి తెలిసిందే.
ఎన్‌డీఏపై అంచనాలు
ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏకు మెజారిటీ లభిస్తుందన్న అంచనాలు వెల్లడయ్యాయి. తద్వారా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ అంచనాలతో గత వారం రోజులుగా మార్కెట్లు హైజంప్ చేస్తూ వచ్చాయి. ఈ బాటలో నేటి ట్రేడింగ్‌లో ప్రధాన సూచీల కదలికలపై నియంత్రణ సంస్థలు దృష్టిపెట్టాయి. స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ యథావిధిగా ఉదయం 9.15కు మొదలై సాయంత్రం 3.30కు ముగియనుంది.
మేమూ రెడీ: సెబీ
ఎన్నికల ఫలితాల వెల్లడి నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో ఏర్పడే భారీ ఒడిదుడుకులను తట్టుకునేందుకు తాము కూడా తగిన చర్యలు చేపట్టినట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పేర్కొంది. ట్రేడింగ్‌లో ఎవరైనా అవకతవకలకు పాల్పడిన సందర్భాలు ఎదురైతే సమర్థవంతంగా అడ్డుకునేందుకు అవసరమైన ఏర్పాట్లను చేసినట్లు తెలిపింది. నేటి ట్రేడింగ్‌కు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సెబీ చైర్మన్ యూకే సిన్హా ఇన్వెస్టర్లకు అభయమిచ్చారు. ఫలితాల కారణంగా స్టాక్ మార్కెట్లలో ఏర్పడగల అనూహ్య కదలికలపై ఆర్థిక శాఖ, ఆర్‌బీఐలతో చర్చించి... సర్వసన్నద్ధమైనట్లు తెలిపారు.
గత ఎన్నికల్లో సీలింగ్...
గత సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత రెండుమార్లు మార్కెట్లు సర్క్యూట్ బ్రేకర్లను తాకాయి. 2004లో ఎన్‌డీఏ ఓడిపోవడంతో మార్కెట్లు పతనంకాగా, 2009లో యూపీఏ అధికారంలోకి రావడంతో పలుమార్లు అప్పర్ సీలింగ్‌ను తాకాయి. 2009 మే 18న 30 సెకన్లలోనే సెన్సెక్స్ అప్పర్ సర్క్యూట్‌ను తాకడంతో ట్రేడింగ్ నిలిచి పోయింది. 2004 మే 14న సెన్సెక్స్ 6% పతనంకాగా, ఆ మర్నాడు 11%పైగా దిగజారింది. ఈసారి ఏం జరుగుతుందో వేచిచూడాల్సిందే!