మహిళా బ్యాంకు ఏర్పాటు చేస్తాం
కోటగుమ్మం (రాజమండ్రి) : రాజమండ్రి దానవాయి పేటలో మహిళా బ్యాంకు ఏర్పాటు చేస్తున్నామని.. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, రిజర్వు బ్యాంకు అనుమతి కోసం దరఖాస్తు చేశామని ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఛైర్మన్ చల్లా శంకరరావు తెలిపారు. మంగళవారం గోకవరం బస్టాండ్ వద్దగల బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖపట్నంలో ఒక బ్రాంచి ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రూ 3.50 కోట్లతో నూతన భవనం నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. తమ బ్యాంక్‌లో సభ్యులు 87,000 మంది, డిపాజిటర్లు 149024 మంది, రుణ గ్రహీతలు 23854 మంది ఉన్నారన్నారు. కోఆపరేటివ్ చరిత్రలోనే అత్యధిక డిపాజిటర్లు ఉన్న బ్యాంక్ తమదేనని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాంకు డిపాజిట్లు రూ.407.17 కోట్లకు పెరిగాయని, అప్పులు రూ.16 కోట్లు పెరిగి రూ.270 కోట్లు అయిందని చెప్పారు. భీమవరం, అమలాపురంల్లో కొత్త బ్రాంచీలు ప్రారంభించామన్నారు. బేసిక్ సేవింగ్స్ పథకం, సేవింగ్స్ సిల్వర్, సేవింగ్స్ గోల్డ్ పథకాలు ప్రవేశపెట్టినట్లు వివరించారు. బంగారంపై రుణ సౌకర్యం పొందే వారి కోసం సర్వీస్ చార్జీలు రద్దు చేసినట్లు తెలిపారు. పిల్లలు, మైనర్లను ప్రోత్సహించేందుకు కిడ్స్ సేవింగ్స్ ఖాతాలు ప్రారంభించినట్టు చెప్పారు. సమావేశంలో బ్యాంక్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం, అయ్యల కృష్ణ గంగాధరరావు, నండూరి వెంకటరమణ, నందం బాలవెంకటకుమార్ రాజా, పోలాకి పరమేశ్వరరావు, మహ్మద్ అబ్దుల్ ఫహీం తదితరులు పాల్గొన్నారు.