రీ షెడ్యూల్‌పై ఆశలు ఆవిరి!
రైతు రుణాల విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి
హైదరాబాద్: రైతు రుణాల రీ షెడ్యూల్‌పై రాష్ర్ట ప్రభుత్వం పెట్టుకున్న ఆశలు ఆవిరవుతున్నాయి. దీనితో ప్రత్యామ్నాయ మార్గాల వేటలో పడింది. రుణాలు రీ షెడ్యూల్ అవుతాయని నిన్నటి వరకు భావించిన ప్రభుత్వం, రిజర్వ్‌బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ మీడియాతో మాట్లాడుతూ రీ షెడ్యూల్‌పై వ్యక్తం చేసిన అభిప్రాయాల నేపథ్యంలో పునరాలోచనలో పడిం ది. రీ షెడ్యూల్‌తో కొంతమేరకు ప్రభుత్వంపై తక్షణ భారం తగ్గుతుందని భావించినా... ఇప్పుడాపరిస్థితి కూడా లేకపోవడంతో నిధుల సమీకరణ ఎలా అన్న అంశంపై దృష్టి పెట్టింది. బాండ్లద్వారా నిధుల సేకరణ, సెక్యురిటీ గ్యారెంటీ, భూముల విక్రయం, బడ్జెట్‌లో బ్యాంకులకు చెల్లించే మొత్తాన్ని కేటాయించడం వంటివి మినహా మరో మార్గం లేదని ఉన్నతాధికారవర్గాలు స్పష్టంచేశాయి. కాగా, మంగళవారం ఆర్‌బీఐకి లేఖ రాశామనీ, దానికి స్పష్టమైన సమాధానం కోసం ఎదురుచూస్తున్నామని అధికారులు చెబుతున్నారు. రుణాల రీ షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్‌కు చేస్తే... తెలంగాణకు కూడా అది వర్తిస్తుందని వ్యాఖ్యానించారు. ఆర్‌బీఐ నుంచి అధికారిక సమాచారం వచ్చే వరకు తాము పూర్తిగా ఆశ వదులుకోలేమని చెబుతూనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక తప్పదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
పంటల దిగుబడిపై జిల్లాను యూనిట్‌గా తీసుకుని.. రిజర్వ్‌బ్యాంకు నిబంధనల కంటే ఎక్కువ దిగుబడి ఉన్నందున రీ షెడ్యూల్ ఎలా చేస్తామంటూ కొర్రీలు వేస్తున్నారని, కాని మండలాల వారీగా పరిశీలిస్తే.. చాలా మండలాల్లో దిగుబడి తక్కువగా ఉందని, పైలాన్ తుపానుతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వం అంటోంది. గతంలో రుణాల రీ షెడ్యూల్‌పై ఆర్‌బీఐ ఏనాడు ఇలా ఇబ్బందులు సృష్టించలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో యూపీఏ ప్రభుత్వం 60 వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేసినప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేయని ఆర్‌బీఐ ఇప్పుడే ఎందుకు చేస్తోందని ప్రభుత్వంలో ప్రముఖుడు ఒకరు వ్యాఖ్యానించారు. నిధుల సమీకరణ ఎలా చేస్తారన్న ప్రశ్నకు మాత్రం ఆయన సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేయడం గమనార్హం. ప్రస్తుతం రైతులు రుణాలు చెల్లిస్తే.. వారికి రీయింబర్స్ చేసే విధానాన్ని పరిశీలిస్తున్నారు. అది తప్ప మరోమార్గం లేదన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.