మారుతి లాభం జూమ్..
క్యూ2లో రూ. 863 కోట్లు; 29% వృద్ధి
న్యూఢిల్లీ: దేశీయంగా అమ్మకాలు పుంజుకోవడం, వ్యయ నియంత్రణ చర్యల ఆసరాతో వాహన దిగ్గజం మారుతి సుజుకీ ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది రెండో త్రైమాసికం(2014-15, క్యూ2)లో కంపెనీ నికర లాభం 28.69 శాతం దూసుకెళ్లి రూ.863 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.670 కోట్లుగా ఉంది. ఇక మొత్తం ఆదాయం రూ.11,996 కోట్లకు ఎగబాకింది. గతేడాది క్యూ2లో ఆదాయం రూ.10,212 కోట్లతో పోలిస్తే 17.47 శాతం వృద్ధి చెందింది.
వాటాదార్లకు ఉత్సాహాన్నిచ్చే చర్యల్లో బాగంగా డివిడెండ్ చెల్లింపు నిష్పత్తిని పెంచేందుకు కంపెనీ డెరైక్టర్ల బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈమేరకు నిబంధనల్లో మార్పులకు ఓకే చెప్పింది. ఇప్పటిదాకా నికర లాభంలో సగటున 10-15 శాతాన్ని డివిడెండ్ చెల్లింపునకు ప్రామాణికంగా తీసుకుంటుండగా.. దీన్ని ఇప్పుడు 18-30 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
మరోపక్క, కంపెనీలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐ) పెట్టుబడి పరిమితిని ఇప్పుడున్న 24 శాతం నుంచి 40 శాతానికి పెంచే ప్రతిపాదనను కూడా కంపెనీ ఆమోదించింది. వాటాదారులు, రిజర్వ్ బ్యాంకు అనుమతులకు లోబడి ఈ మార్పులు ఉంటాయని పేర్కొంది. అయితే, గుజరాత్ ప్లాంట్‌ను పూర్తిగా మాతృసంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్ అధీనంలో ఉంచే అంశానికి సంబంధించి మైనారిటీ షేర్‌హోల్డర్ల ఓటింగ్‌కు తుది తేదీని మాత్రం కంపెనీ ఇంకా నిర్ణయించలేదు.