ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (Maruti Suzuki) ధరలను పెంచింది. పెరుగుతున్న ముడి సరుకుల ధరలు, నిర్వహణ ఖర్చుల కారణంగా పలు మోడళ్లలో ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరల (Car Prices) పెరుగుదల ఫిబ్రవరి 1 నుండి అమలులోకి వస్తుంది.
ఈ పెంపు సెలెరియో మోడల్‌పై ఎక్కువ ప్రభావం చూపుతుంది. దీని ధర రూ. 32,500 వరకు పెరుగుతుందని ఎక్స్ఛేంజీలకు మారుతి సుజుకి ఒక ప్రకటనలో తెలిపింది. అధిక ఇన్‌పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల ప్రభావం వల్ల ధరలు పెరిగాయని మారుతి సుజుకి వివరించింది. ఖర్చులను ఆప్టిమైజ్ చేయడానికి, వినియోగదారులపై ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్ని మోడళ్లపై ధరలు పెంచక తప్పలేదని పేర్కొంది.
ముడిసరుకు, లాజిస్టిక్స్, ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్ల వాహన తయారీదారులు అధిక ఇన్‌పుట్ ఖర్చులను ఎదుర్కొంటున్నారు. గ్లోబల్ సప్లయి చైన్‌లో అంతరాయాలు, పెరుగుతున్న డిమాండ్‌లే ముడిసరుకు ధరల పెరుగుదల కారణమని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్&పీ గ్లోబల్ అభిప్రాయపడింది. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో కొత్త సుంకాల అవకాశం కూడా అనిశ్చితిని జోడించింది. ఇది పరిశ్రమలో ఖర్చు ఒత్తిడిని మరింత పెంచుతుంది.
ఏ కారు ఎంతెంత పెరుగుతాయి?
సెలెరియో అత్యధికంగా రూ. 32,500 వరకు, ఇన్విక్టో రూ. 30,000 వరకు, గ్రాండ్ విటారా రూ. 25,000 వరకు పెరుగుతాయి. ఇక
బాలెనో ధర పెంపు రూ. 20,500 వరకు ఉంటుంది. ఆల్టో కె10 ధర రూ. 19,500 వరకు పెరుగుతుంది. ఎర్టిగా ధర రూ.15,000 వరకు, ఎస్-క్రాస్ ధర రూ.12,500 వరకు, ఎక్స్‌ఎల్6 ధర రూ.11,000 వరకు పెరగనుంది.
డిజైర్ రూ. 10,550 వరకు, సూపర్ క్యారీ రూ. 10,000 వరకు, బ్రెజ్జా రూ. 9,000 వరకు, వ్యాగన్-ఆర్ రూ. 8,000 వరకు పెరగనున్నాయి.
అదే సమయంలో, ఇగ్నిస్ రూ. 6,000 వరకు, ఫ్రాంక్స్ రూ. 5,500 వరకు, స్విఫ్ట్, ఎస్-ప్రెస్సో రెండూ రూ. 5,000 వరకు పెరగనున్నాయి. సియాజ్, జిమ్నీ స్వల్పంగా రూ. 1,500 వరకు పెరుగుతాయని కంపెనీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment