అన్నదాతలపై నోటీసుల దాడి
- ప్రకటనలకే పరిమితమైన రుణమాఫీ హామీ
- బ్యాంకుల నుంచి వెల్లువెత్తుతున్న నోటీసులు
- ఆందోళనలో రైతులు
తాళ్లపూడి : రైతులు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేస్తామన్న హామీ అమలుకు నోచుకోకపోవడంతో వారంతా ఆందోళన చెం దుతున్నారు. రుణాలు మాఫీకాకపోగా పులిమీద పుట్రలా బ్యాంకుల నుంచి నోటీసులు వెల్లువెత్తుతుండటం అన్నదాతలను కలవరపరుస్తోంది. రుణాలు మాఫీ చేస్తామంటూనే మరోపక్క వాటిని చెల్లించాలని, అనంతరం మాఫీ వర్తింపచేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పేర్కొనడం గందరగోళానికి గురిచేస్తోంది.
ఇదిలావుంటే రైతులు తీసుకున్న రుణాలను తక్షణమే చెల్లించాలని బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయి. మరీము ఖ్యంగా బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాలను చెల్లించాలని బ్యాంకుల నుంచి నోటీసులు అందుతున్నాయి. ఇదే తరహాలో ప్రక్కిలంక స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియూ నుంచి రైతులకు నోటీసులు వచ్చాయి. మాఫీ విషయంలో ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో బంగారం తాకట్టుపై తీసుకున్న రుణాలు చెల్లించాలని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.
ప్రక్కిలంక ఎస్‌బీఐలో 2011-12 సంవత్సరంలో బంగారం తాకట్టు పెట్టి 611 మంది రూ.4.11 కోట్లను, 2012-13 సంవత్సరంలో 511 మంది రైతులు రూ.3.19 కోట్లను, 2013-14లో 314 మంది రైతులు రూ.2.32 కోట్లను రుణాలుగా తీసుకున్నారు. గత ఏడాది పంట రుణాలుగా 431 మందికి రూ.2.67 కోట్లు తీసుకున్నారు. బ్యాంకుల నుంచి నోటీసులు అందడంతో మండలంలోని రైతుల్లో ఆందోళన మొదలైంది.
బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయి
ప్రక్కిలంక ఎస్‌బీఐలో బంగారం తాకట్టు పెట్టి వ్యవసాయ అవసరాల కోసం రూ.48 వేల రుణం తీసుకున్నాం. సెప్టెంబర్‌లో రూ.32 వేలు, మరో రూ.26 వేలు తీసుకున్నాం. ఆ మొత్తాలను వెంటనే కట్టాలంటూ బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చాయి. రుణాలు మాఫీ అవుతాయని చెప్పడంతో బాకీ కట్టలేదు. ఇప్పుడేమో బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయి.
- సూరవరపు శ్రీనివాస్, రైతు, ప్రక్కిలంక
వెంటనే మాఫీ చేయాలి
వ్యవసాయం కోసం రూ.40 వేలు అప్పుగా తీసుకున్నాను. మొత్తం రూ.56 వేలు చెల్లించాలని బ్యాంకు నుంచి నోటీసు వచ్చింది. రెండెకరాల పొలం, బంగారం తాకట్టు పెట్టి ఆ డబ్బు తీసుకున్నాం. రెండేళ్లుగా పంటలు సరిగా పండక రుణాలు చెల్లించలేకపోయాం. ప్రస్తుతం ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. ప్రభుత్వం రుణ మాఫీ చేస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నాం. బ్యాంకు నోటీసు ఇవ్వడంతో ఏం చేయాలో తెలియడం లేదు.
- సోము వెంకటేశ్వరరావు, పైడిమెట్ట
వడ్డీ భారం అధికమైంది
వ్యవసాయ ఖర్చుల కోసం రూ.70 వేలు రుణం తీసుకున్నాను. ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో బ్యాంకుకు డబ్బు కట్టలేదు. బ్యాంకు అధికారులు బంగారం వేలం వేస్తామని నోటీసు పంపించారు. దీనిపై వడ్డీ రూ.30 వేలు అయియంది. మొత్తం రూ.లక్ష చెల్లించాలి. ఇప్పటికప్పుడు అంత డబ్బు కట్టాలంటే కష్టం. గతంలో రుణం చెల్లిస్తే రుణమాఫీ అందలేదు. ప్రస్తుతం రుణం చెల్లించే పరిస్థితిలో లేం. ప్రభుత్వం రుణమాఫీ హామీని నిలబెట్టుకోవాలి.
- నాగోతు కొండలరావు, పైడిమెట్ట