ఇటీవల ఎక్మో అనే మాట చాలా సందర్భాల్లో వినిపించింది. తాజాగా ప్రముఖ సినీకవి సిరివెన్నెల సీతారామశాస్త్రికి అమర్చిన ఈ వైద్య పరికరాన్ని గతంలో ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం, అంతకు మునుపు తమిళనాడు మాజీ సీఎం జయలలిత.. లాంటి చాలామంది ప్రముఖులకు వాడారు. అలా ఇటీవల చాలా సందర్భాల్లో ఎక్మో అనే మాట వినిపించింది. అసలీ ఎక్మో అంటే ఏమిటో, దాన్ని ఎలాంటి సందర్భాల్లో వాడతారనే విషయాలపై అవగాహన కోసం ఈ సంక్షిప్త కథనం.
ఈసీఎంఓ అనే ఇంగ్లిష్ పొడి అక్షరాలు ‘ఎక్స్‌ట్రా కార్పోరియల్ మెంబ్రేనస్ ఆక్సిజనేషన్’ అనే పదాల ముందక్షరాలు. వీటన్నింటినీ కలిపి ‘ఎక్మో’ అంటారు. పేరునుబట్టే ఇది గాల్లోని ఆక్సిజన్ సమర్థంగా అందిస్తుందని తెలుస్తుంది. ఎక్స్‌ట్రా కార్పోరియల్ లైఫ్ సపోర్ట్ అని కూడా చెప్పే ఈ ఉపకరణాన్ని... ఊపిరితిత్తులు తమంతట తామే శుభ్రమైన ఆక్సిజన్ తో కూడిన (ఆక్సీజనేటెడ్) రక్తాన్ని అందించలేనప్పుడు వాడుతారు.
ఎలా పని చేస్తుంది?
ఎక్మో రెండు రకాలు. ఒకటి ఏ–వీ ఎక్మో, మరొకటి...వి–వి ఎక్మో.. ఇందులో వీ–వీ (వీనో–వీనస్) ఎక్మోను ఊపిరితిత్తుల పనితీరు బాగాలేనప్పుడు వాడతారు. అలాగే వీ–ఏ (వీనో – ఆర్టరీ) ఎక్మోను గుండె పనితీరు బాగాలేనప్పుడు (కార్డియో పల్మునరీ సపోర్ట్‌గా)వాడుతారు.
ఎక్మో పరికరంలో ఆక్సిజనేటర్ గ్యాస్ ఎక్స్ఛేంజ్ పరికరం, అలాగే పంప్ అనేవి ముఖ్యమైన భాగాలు. మొదటగా ఒక పైప్ (డ్రైనేజ్ కాన్యులా) ద్వారా తొడలోని సిర నుంచి రక్తాన్ని తీసుకుని, అందులోంచి కార్బన్ డైయాక్సైడ్‌ను తొలగిస్తారు. తర్వాత ఆక్సిజన్‌ను రక్తంలోకి ఇంకేలా చేస్తారు. ఇలా చేశాక... ఆ శుద్ధి అయిన రక్తాన్ని మళ్లీ గుండెకు దగ్గర్లో ఉన్న సిరలోకి (వి–వి ఎక్మో) లేదా ధమనికి (వి–ఏ ఎక్మో) రిటర్న్ కాన్యులా ద్వారా పంపిస్తారు.
అంతేకాదు... దానికి అమర్చి ఉన్న మానిటర్ మీద నాడి కొట్టుకునే స్పందనలూ, రక్తం ఎంత వేగంతో ప్రవహిస్తోందనే అంశాలు ఎప్పటికప్పుడు నమోదవుతూ ఉంటాయి. ఇదీ సంక్షిప్తంగా ఎక్మో పనిచేసే తీరు. నిజానికి ఇది గుండె చేసే పని కంటే ఊపిరితిత్తులు చేసే పనిని సమర్థంగా నిర్వహిస్తుంటుందని చెప్పవచ్చు.
ఎప్పుడూ రోగగ్రస్థమైన వారికేనా?
పైన పేర్కొన్న సెలబ్రిటీ ఉదాహరణలతో ఊపిరితిత్తులు బాగా చెడిపోయి, ఆక్సిజన్ అందని స్థితికి చేరిన బాధితులకే అమర్చుతారా అనే సందేహం వస్తుంది. కానీ కేవలం అలాంటి సందర్భాల్లోనే కాదు... గుండె మార్పిడి / ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స వంటివి జరిగినప్పుడు కూడా దీన్ని అమరుస్తారు.
ఉదాహరణకు గుండె / ఊపిరితిత్తులు ఏమాత్రం పనిచేయని వారిలో బయటి దాతల నుంచి గుండె / ఊపిరితిత్తులను సేకరించి, అమర్చినప్పుడు ఒక్కోసారి వాటిని దేహం ఆమోదించదు. అలాంటి సమయాల్లో... బయటి గుండె/ఊపిరితిత్తులు దేహానికి అలవాటయ్యేవరకూ ‘ఎక్మో’ సహాయం తీసుకుంటారు.
‘ఎక్మో’తో సపోర్ట్ మొదలుపెట్టాక రోగి కోలుకుంటున్న తీరు నెమ్మదిగా జరుగుతుంది. కాబట్టి దీన్ని చాలా నిశితంగా పరిశీలిస్తూ ఉండాలి. రోగి స్పందన తెలియడానికి కనీసం ఐదు నుంచి ఏడు రోజులైనా వేచిచూడాల్సి ఉంటుంది. అలా చూస్తూ... ‘ఎక్మో’ సపోర్ట్‌ను నెమ్మది నెమ్మదిగా తగ్గిస్తూ పోతారు. ఈ సమయంల్లో అతడి ‘వైటల్స్’... అంటే పేషెంట్ పరిస్థితిని తెలిపే కీలకమైన కొలతలైన... పల్స్, బీపీ వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటారు.
ఎక్మో సపోర్టు తగ్గించినప్పుడల్లా పల్స్ రేటూ, బీపీ, ఆక్సిజన్, కార్మబ్ డైఆక్సైడ్ శాతం... నార్మల్‌గా ఉన్నాయా అని చూస్తారు. అవి నార్మల్‌గా ఉన్నాయంటే రోగి కోలుకుంటున్నట్లు అర్థం. అలా క్రమక్రమంగా ఎక్మో సపోర్ట్‌ను తగ్గిస్తూ గుండె, ఊపిరితిత్తుల పనితీరు పూర్తిగా నార్మల్ అయ్యే వరకు రోగి కోలుకుంటున్న క్రమాన్ని చూస్తూ... ఐసీయూలో ఉంచి పర్యవేక్షిస్తూ ఉంటారు.
ఎవరెవరిలో...
ఎక్మో అమర్చాల్సిన పరిస్థితి సాధారణంగా గుండె ఆగినప్పుడు సీపీఆర్ ద్వారా స్పందనలు తిరిగి వచ్చి పంపు చేసే కేపాసిటి తక్కువ ఉన్నప్పుడు ఎక్మో ద్వారా రక్త ప్రసరణ జరిగి అన్ని అవయవాలు గుండె తిరిగి సాధారణ స్థితిలో పని చేయడానికి దోహదపడుతుంది. ఎక్మోతో పాటు బాధితుడికి డయాలసిస్ కూడా చేయాల్సినప్పుడు పేషెంట్ నుంచి రక్తాన్ని డయాలసిస్ యంత్రంలోకి నేరుగా వెళ్లేలా కాకుండా... ఎక్మో పరికరం ద్వారా డయాలసిస్ యంత్రానికి రక్తాన్ని సరఫరా అయ్యేలా చూస్తారు.
గుండె ఆగిపోయిన సందర్భాల్లో దాని స్పందనలను పునరుద్ధరించడానికి బాధితుడి ఛాతీ మీద రెండు చేతులతోనూ నొక్కుతున్నట్లు చేసే సీపీఆర్ (కార్డియో పల్మునరీ రిససియేషన్) చేస్తూ, రక్తప్రసరణ జరుగుతున్నట్లు గుర్తించగానే వెంటనే ఎక్మో అమరుస్తారు. సాధారణంగా గుండె ఆగిపోగానే సీపీఆర్ ఇచ్చి, ఎక్మో ద్వారా రక్తప్రసరణ నార్మల్‌గా జరుగుతుంటే దేహంలో అన్ని అవయవాలూ సజావుగా పనిచేస్తున్నట్లే అనుకోవచ్చు.
అప్పుడు క్రమక్రమంగా ఎక్మో సపోర్ట్‌ను తగ్గించుకుంటూ పోతారు. ఇలా చేసే సమయంలో ఎక్మో సపోర్ట్‌ను తగ్గిస్తున్నా... రోగిలోని వ్యవస్థలు తమంతట తాము స్వయంగా తమ విధులను నిర్వహించుకోలేని సందర్భాల్లో మాత్రమే రోగి కోలుకోవడం లేదనే నిర్ధారణకు డాక్టర్లు వస్తారు.
చివరగా... ఎక్మో అమర్చడం ఓ చివరి ప్రయత్నంగా చేసే పని. దానిపై కొన్ని అపోహలున్నప్పటికీ... కొన్ని సందర్భాల్లో రోగులు పూర్తిగా కోలుకుని, వారు పూర్తిగా మళ్లీ తమ పూర్వస్థితికి వచ్చిన సందర్భాలూ ఉన్నాయి.
సక్కెస్ రేటు తక్కువా?
సెలబ్రిటీల ఉదాహరణలతో గానీ లేదా గుండె, ఊపిరితిత్తులు పనిచేయనప్పుడు అమర్చుతారనే సందర్భాల వల్లగానీ ‘ఎక్మో’ పరికరంపై కొన్ని అపోహలు నెలకొని ఉన్నాయి. అందులో మొదటిది... దీన్ని అమర్చాల్సిన పరిస్థితి వచ్చిందంటే బాధితులు కోలుకునే అవకాశాలు తక్కువనీ లేదా ‘ఎక్మో’కు సక్సెస్ రేటు తక్కువనే అపప్రధ ప్రజల్లో ఉంది. దీనికి కారణం... ఓ పేషెంట్‌కు ఎక్మో అమర్చాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది చాలా తీవ్రంగా రోగగ్రస్థమైన స్థితి.
అంతటి పరిస్థితుల్లో కోలుకునే అవకాశాలు వాస్తవంగా కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ... చాలా సందర్భాల్లో గుండెకు సంబంధించిన బాధితుల్లో 40 – 50 శాతం, ఊపిరతిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారిలో 60 – 70 శాతం సక్కెస్ రేటు ఉంటాయి. అంతగా రోగసిక్తమైనప్పటికీ 70 శాతం అంటే నిజానికి మంచి విజయావకాశాలు ఉన్నట్లే లెక్క.
కానీ రోగి వయసు, అతడికి ఇంతకుముందే ఉన్న అనేక ఆరోగ్య సమస్యలు, ఇతర అనారోగ్యాలూ, రోగనిరోధక శక్తి, కోలుకునే సామర్థ్యం... లాంటి అనేక అంశాలు ఈ విజయావకాశాల (సక్సెస్ రేటు)ను ప్రభావితం చేస్తాయి. అందుకే ఈ అపోహ. డాక్టర్ శ్రీనివాస కుమార్ రావిపాటి సీనియర్ కన్సల్టెంట్ ట్రాన్స్‌ప్లాంట్ పల్మనాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment